ఈ వారసునికీ లైన్ క్లియరా..?

విశాఖ జిల్లాలో ఇప్పుడు వారసుల ఊపు కనిపిస్తోంది. తెలుగుదేశంలో ఈ మధ్య వరసగా జరిగిన కొన్ని సంఘటనలు వారసుల రాకకు అవకాశం కల్పించాయి. సానుభూతి సెంటిమెంట్ కోణంతో పాటు ఎన్నికలు కూడా దగ్గరలో ఉండడంతో ఆయా రాజకీయ కుటుంబాల నుంచి వారసులకు టీడీపీ అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీంతో కొత్త రక్తం పార్టీకి వచ్చి చేరుతుందని, వారసులకూ న్యాయం చేసినట్లవుతుందని బాబు భావిస్తున్నారు. మరి ఈ పరిణామాలు ముందు నుంచి పార్టీని అట్టిపెట్టుకుని ఉన్న వారికి ఇబ్బందికరమేనని అంటున్నారు.

కిడారితో బోణీ

రెండు నెలల క్రితం విశాఖ జిల్లా ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు దారి కాచి మరీ దారుణంగా చంపేశారు. ఆ ఘటనతో జాతీయ స్థాయిలోనే అంతా ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. బాబు ఆ తరువాత విశాఖ జిల్లా రావడం, కిడారి కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అన్న మాట ప్రకారం తాజాగా జరిగిన విస్తరణలో కిడారి పెద్ద కుమారుడు శ్రావణ్ కుమార్ కి మంత్రి పదవి ఇచ్చి బాబు గౌరవించారు. దీంతో మరో వారసుడు కూడా బాబు నిర్ణయం కోసం ఇపుడు లైన్లోకి వచ్చేశాడు.

గీతం మూర్తి మనవడు

విశాఖ లోక్ సభ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు ఎంవీవీఎస్ మూర్తి నెలన్నర క్రితం అమెరికాలో రోడ్డు యాక్సిడెంట్ లో దుర్మరణం పాలయ్యారు. ఆయన విశాఖ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర బలంగా వేసుకున్నారు. దీంతో ఆయన వారసత్వాన్ని పెద్ద కొడుకు రామారావు కుమారుడు భరత్ స్వీకరించారు. నాటి నుంచి విశాఖలోనే గడుపుతున్న భరత్ తాత ఆశయాలు నెరవేస్తానని అంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి భరత్ రంగం సిధ్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

సేవా కార్యక్రమాలు

భరత్ అపుడే జనంలోకి వస్తున్నారు. సేవా కార్యక్రమాల పేరు మీద ఆయన తిరుగుతున్నారు. ఇటు పార్టీలోనూ అందరినీ కలుపుకుంటున్నారు. రేపటి రోజున చంద్రబాబు టికెట్ ఇచ్చేలా ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నిజానికి మూర్తి బతికి ఉంటే భరత్ కి సులువుగా టికెట్ దక్కేదని కూడా అంటారు. భరత్ సినీ నటుడు బాలక్రిష్ణ అల్లుడు కూడా కావడంతో బాబుతో ఉన్న చుట్టరికం కూడా ఇప్పుడు కలసి వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒక వారసునికి న్యాయం చేసిన బాబు రేపు భరత్ ని కూడా విశాఖ ఎంపీగా నిలబెట్టి మూర్తి కుటుంబానికి కూడా న్యాయం చేస్తారని అంటున్నారు.

పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితేంటి..?

ఇదిలా ఉండగా టీడీపీలో పూర్వం నుంచి ఉన్న వారు, పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న వారు తాజా పరిణామాలతో ఇరకాటంలో పడుతున్నారు. వారసులకు మరేదైనా విధంగా న్యాయం చేస్తే బాగుంటుంది కానీ రాజకీయంగా వాటాలను ఇవ్వడం వల్ల పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిలో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని వాదించే వారు ఉన్నారు. ఏది ఏమైనా టీడీపీలో బాబు మాటే ఫైనల్ కాబట్టి ఆయన వారసుల వైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. సో వారసుల రాజ్యం గా విశాఖ టీడీపీ మారబోతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*