అంతరిక్షం 9000 KMPH మూవీ రివ్యూ

antariksham movie review

బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు, అవసరాల శ్రీనివాస్,రెహమాన్, సత్య దేవ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్
మ్యూజిక్ డైరెక్టర్: ప్రశాంత్ విహారి
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాతలు: క్రిష్, సాయి అబ్దు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
డైరెక్టర్: సంకల్ప్ రెడ్డి

ఫిల్మీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన వరుణ్ తేజ్ అందరి హీరోలలా కమర్షియల్, హీరోయిజం, మాస్ కథల వెంట పరిగెత్తకుండా చాలా జాగ్రత్తగా కథలు వింటూ తనకి సూట్ అయ్యే సినిమాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకుంటున్నాడు. యంగ్ హీరోలంతా మాస్, కమర్షియల్ చిత్రాల వెంట పరుగులు పెడుతున్నారు. కానీ వరుణ్ తేజ్ తనకి సూట్ అయ్యే ప్రేమ కథలనే కాదు… కొన్ని ప్రయోగాత్మకమైన కథలను ఎంచుకుంటూ డిఫ్రెంట్ గా కెరీర్ ని మలుచుకుంటూ సాగిపోతున్నాడు. తాజాగా ఒక ప్రయోగాత్మక చిత్రమైన ఘాజితో హిట్ కొట్టిన సంకల్ప్ రెడ్డి తో కలిసి ఈ అంతరిక్షం సినిమాని చేసాడు. ఘాజి చిత్రంతో జాతీయ అవార్డును కైవసం చేసుకుని అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న సంకల్ప్ రెడ్డి మొదటిసారి స్పేస్ కథను ఎంచుకుని అంతరిక్షం సినిమాతో మరో ప్రయోగం చేసాడు. ఎంతో కష్టపడి ఒక సైన్స్ ఫిక్షన్‌ను సినిమాగా మలిచాడు. మరి సంకల్ప్ ఘజితో తానేంటో నిరూపించుకుని… అంతరిక్షంతో మరోసారి తన సత్తా చాటడానికి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. మరి వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డిల అంతరిక్షం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటనతో.. ఇండియన్ స్పేస్ సెంటర్ లో ఐదేళ్ల క్రితం ఉద్యోగం మానేసి ఓ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పుకుంటూ ఉంటాడు దేవ్(వరుణ్ తేజ్). పదకొండేళ్ల క్రితం కక్ష్యలోకి పంపిన శాటిలైట్ మిహిరలో సమస్య తలెత్తుతుంది. ఆ సమస్య వల్ల ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనికేషన్ సిస్టమ్‌ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఇండియన్ స్పేస్ సెంటర్ భయపడుతుంది. అయితే దాని కోడింగ్‌ను కేవలం దేవ్ (వరుణ్ తేజ్) మాత్రమే సరిచేయగలడని భావించి మిహిరలో ఉన్న సమస్యను పరిష్కరించడానికి దేవ్ ని తిరిగి రప్పిస్తారు. అయితే దేవ్ ఆ సమస్యని పరిష్కరించడానికి ఒప్పుకుని… తాను కూడా అంతరిక్షంలోకి వెళ్లాలని దేవ్ కోరతాడు. దీంతో దేవ్‌ను మరో ముగ్గురు వ్యోమగాములతో కలిపి స్పేస్‌లోకి పంపుతారు. వీరు నలుగురూ కలిసి మిహిరలో సమస్యను సరిచేస్తారు. అయితే భూమిపైకి తిరిగి రావడానికి దేవ్ అంగీకరించడు. అసలు దేవ్ ఆలా ఎందుకు చేస్తాడు..? తిరిగి వెనక్కి రావడానికి దేవ్ ఎందుకు ఒప్పుకోడు..? అసలు దేవ్ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగింది..? మిషన్ కిన్నెర అనేది ఏమిటి..? మిషన్ కిన్నెర గురించి దేవ్ ఎందుకు అంత పట్టు బడతాడు..? అనేది అంతరిక్షం మిగతా కథ.

నటీనటుల నటన:
వ్యోమగామిగా వరుణ్ తేజ్ నటన చాలా బాగుంది. ఇలాంటి పాత్రల్లో నటించేందుకు హీరోలకు చాలా అరుదుగా అవకాశం వస్తుంది. మరి అలాంటి అవకాశాన్ని వరుణ్ తేజ్ కెరీర్ తొలినాళ్లలోనే అందిపుచ్చుకున్నాడు. లావ‌ణ్య‌, అతిథి పాత్ర‌లు గ్లామ‌ర్ కోస‌మో, హీరోయిన్లు ఉండాల‌నో పెట్టిన‌వి కావు. పాత్ర‌ల‌కు ఎప్పుడైతే వెయిటేజీ ఉంటుందో.. అప్పుడు ఆ పాత్ర‌లు రాణిస్తాయి. లావణ్య, అదితి రావు విష‌యంలోనూ అదే జ‌రిగింది. కానీ ఒక్కోసారి.. లావణ్య, అదితి పాత్రలకు ఓ అన్నంత స్కోప్ లేదేమో అనిపిస్తుంది. ఇక రెహ‌మాన్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. రాజా చెంబోలు, సత్యదేవ్ నటన బాగుంది.

సాంకేతిక వర్గం పనితీరు:

ప్రశాంత్ విహారి అందించిన మ్యూజిక్ లో మూడు పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టింది. చాలా కీలక సన్నివేశాల్లో నేపధ్య సంగీతం హైలెట్ గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెమెరా పనితనం, విజువల్ ఎఫెక్ట్స్ గురించే. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. అంతరిక్షంలో సన్నివేశాలను అద్భుతంగా కెమెరాలో బంధించాడు. ఇక వీఎఫ్ఎక్స్‌ ను ప్రైమ్ ఫోకస్ కంపెనీ చేసింది. అయితే వీఎఫ్ఎక్స్‌ పై ఇంకాస్త దృష్టి సారించాల్సింది. అక్కడక్కడ విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా అనిపిస్తాయి. వీఎఫెక్స్ గనక బాగుంటే.. సినిమాని హాలీవుడ్ రేంజ్ లో పొగిడేవారు. ఇక ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ మరీ లాగింగ్ సీన్స్ లేకుండా… ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవ్వకుండా రెండు గంటలకు బాగా కుదించాడు. ఇక నిర్మాణ విలువలు ఓ అన్నంతగా కనిపించలేదు. చూసి చూసి పెట్టినట్లుగా అనిపిస్తుంది.

విశ్లేషణ:

ఘాజీ సినిమాతోనే త‌న ఆలోచ‌న‌ల్లోని వైవిధ్యాన్ని ప్రపంచానికి చూపించాడు దర్శకుడు సంక‌ల్ప్ రెడ్డి. ఘాజీ నీటిలో యుద్ధ‌మైతే.. అంతరిక్షం.. అంత‌రిక్షంలో యుద్ధం లాంటిది. సంకల్ప్ రెడ్డి ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని కొత్త విజువల్స్‌ ను ప్రేక్షకులకు చూపించాడు. అంతరిక్షంలో శాటిలైట్స్ గమనం ఎలా ఉంటుంది, వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్తే వాళ్ల కదలికలు ఎలా ఉంటాయి అనే విషయాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. విజువల్‌గా సినిమా బాగానే ఉన్నా ప్రేక్షకుడిని అంతరిక్షం మూడ్‌లోకి తీసుకెళ్లడంలో దర్శకుడు సఫలం కాలేదనే చెప్పాలి. ఇక సినిమాలో ఫస్టాఫ్ లో కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాల నుంచి పర్వాలేదనిపించే స్థాయిలో ఉండి సెకండాఫ్ లో ఏం జరగబోతుంది అనే విధంగా ఇంటర్వెల్ వరకు బాగానే తీసుకెళ్తుంది. ఫస్ట్ హాఫ్.. లావ‌ణ్య‌తో ప్రేమ‌క‌థ‌, శాలిలైట్‌కి వ‌చ్చిన ముప్పు… వీటి చుట్టూనే సాగింది. సెకండ్ హాఫ్ లో అంతరిక్ష‌యానం మొద‌లైంది. సెకండాఫ్ కూడా ప్రారంభమే కాస్త ఆసక్తిగా ఫస్టాఫ్ లో చూపిన విధంగా అంతరిక్షంలో మొదలవుతుంది. అంతరిక్ష యానం చేసిన వరుణ్ టీమ్ లో వారిలో వారికే కొన్ని ఊహించని ఘటనలు చోటు చేసుకోవడం వలన కథ ఇంకాస్త ఆసక్తికరంగా మారుతుంది. అయితే క్లైమాక్స్‌ ను దర్శకుడు అంత బాగా డిజైన్ చేయకపోవడం ఈ సినిమాకి మైనస్. అలాగే ప్రేక్ష‌కుడు ఊపిరి బిగ‌బెట్టుకుని చూసేలా స‌న్నివేశాల్ని సృష్టించ‌డంలో ర‌చ‌యిత‌గా దర్శకుడు సంక‌ల్ప్‌ రెడ్డి విఫ‌లయ్యాడు అనే చెప్పాలి. అలాగే ఈ అంతరిక్షం సినిమా మల్టిప్లెక్స్ ఆడియన్స్ కే కానీ.. బీ, సీ సెంటర్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు.

ప్లస్ పాయింట్స్: స్పేస్ థ్రిల్లర్, సంకల్ప్ రెడ్డి డైరెక్షన్, వరుణ్ తేజ్ నటన, అదితి రావు నటన, సెకండ్ హాఫ్, బ్యాగ్రౌడ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్, కామెడీ లేకపోవడం, ప్రొడక్షన్ వాల్యూస్, బీ, సీ సెంటర్స్ కి ఎక్కదు

రేటింగ్: 2.75 /5

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*