కేజ్రీ ఒంటరివాడని తేలింది….!

అరవింద్ కేజ్రీవాల్….ఉన్నతాధికారి నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. బ్యూరోక్రాట్ నుంచి పొలిటికల్ లీడర్ గా ఎదిగిన కేజ్రీవాల్ పాలనాపరంగా ఇబ్బందులు తొలి నాటి నుంచి ఎదుర్కొంటున్నారు. పేరుకు ముఖ్యమంత్రి కాని అంతా లెఫ్ట్ నెంట్ గవర్న్ చేతిలో అధికారాలు ఉండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే మూడు రోజులుగా లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఇంటివద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రోజులుగా ఆందోళన చేస్తుంటే ఆయనకు కనీసం విపక్షాలు మద్దతు తెలపక పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సంచలనాలు సృష్టించిన…..

అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి….ఢిల్లీలో అధికారంలో చేపట్టి పెద్ద సంచలనమే సృష్టించారు. అప్పటి వరకూ కాంగ్రెస్ చేతిలో ఉన్న ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని కేజ్రీ అందుకున్నారు. ఆయన బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ తో జట్టు కడితే వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది ఉందని ఆయన హస్తం పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. మరోవైపు బీజేపీని మాత్రం వదలడం లేదు. అవకాశమొచ్చినప్పుడల్లా బీజేపీపైనా, ప్రధాని మోడీపైనా ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతూనే ఉన్నారు.

ఫైలు పక్కన పెట్టడంతో….

అయితే వరుసగా తనపైనా, తనమంత్రి వర్గ సహచరులపైనా ఏసీబీ, ఈడీ దాడులు జరుగుతుండటాన్ని ఆయన తప్పుపడుతున్నారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేతిలో ఉన్న ఏసీబీ, మోడీ చేతిలో ఉన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులతో తమను బెదిరించాలని చూస్తున్నారన్నది కేజ్రీవాల్ ఆరోపణ. తనను పాలన సజావుగా చేయకుండా ఎప్పటికప్పుడు లెఫ్ట్ నెంట్ గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ ప్రజలకు రేషన్ సరుకులను నేరుగా వారి ఇంటి వద్దకే చేర్చాలన్న ఒక పథకాన్ని రూపొందించుకున్నారు. దీనివల్ల ప్రజలు రేషన్ షాపులు చుట్టూ తిరగకుండా నేరుగా ఇంటివద్దకే అందించాలన్న కేజ్రీ లక్ష్యాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ నీరుగార్చారు.

పరిపాలన స్థంభించి……

ఆ ఫైలును గత కొద్దినెలలుగా ఆమోదం పొందకుండా కోల్డ్ స్టోరేజీలో పడేశారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు తన ఇంటివద్ద సమావేశం ఏర్పాటు చేస్తే అప్పట్లో చీఫ్ సెక్రటరీపై దాడి కేసు ఆప్ నేతలపై నమోదయిన సంగతి తెలిసిందే. ఫైలు క్లియర్ చేయకుండా తమను లక్ష్యాలకు చేరుకోకుండా, ప్రజలకు సుపరిపాలన అందించడానికి వీల్లేకుండా ఎల్జీ వ్యవహరిస్తున్నారని ఆయన అభియోగం. అంతేకాదు నాలుగు నెలలుగా ఢిల్లీలోని ఐఏఎస్ అధికారులు విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నా ఎల్జీ పట్టించుకోవడం లేదు. కనీసం సమ్మె విరమణకు ప్రయత్నాలు చేయలేదు. ఇందుకోసమే కేజ్రీవాల్ చివరకు ముఖ్యమంత్రి హోదాలో ధర్నాకు దిగారు. ఇటీవలే కేజ్రీవాల్ కర్ణాటకలోని కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరయి విపక్ష నేతలతో చేతులు కలిపి వచ్చారు. మూడు రోజులుగా ఆందోళనచేస్తున్న కేజ్రీని కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీయే కాకుండా సహచర పక్షాలు కూడా పట్టించుకోకపోవడం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*