ఒవైసీ ఒత్తిడి ఆ దిశగా…..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో మజ్లిస్ పార్టీతో కలిసి నడవక తప్పని పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో కాస్త అటూ ఇటూ అయినా మజ్లిస్ సహకారం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీతో పొత్తు లేకుండానే అవగాహనతో కేసీఆర్ ముందుకు వెళ్లదలచుకున్నారు. అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి దగ్గరవుతున్నారని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కొంత గుర్రుగానే ఉన్నారు. కాని కేసీఆర్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కరచాలనం చేయక తప్పదని చెబుతున్నారు.

ఏడు స్థానాల్లోనే…..

మజ్లిస్ కు హైదరాబాద్ లో ఏడుస్థానాల్లో గత కొంతకాలంగా గెలుస్తూ వస్తుంది. హైదరాబాద్ లోక్ సభ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీ సొంతం. ఇతర రాష్ట్రాల్లో కూడా మజ్లిస్ బలోపేతం అవుతున్న తరుణంలో దీర్ఘకాలంగా ఏడు అసెంబ్లీ సీట్లకే సరిపెట్టుకోవాల్సి వస్తుందన్నది ఆ పార్టీ నేతల ఆవేదన. అందుకే ఈసారి మరికొన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని గట్టిగా భావిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితితో చర్చలు కూడా మజ్లిస్ ప్రారంభించిందంటున్నారు. తమకు నికరంగా ఉండే ఏడు స్థానాలతో పాటు మరో నాలుగు స్థానాలు ఇవ్వాలని మజ్లిస్ అధినేత కోరనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

అవగాహన తోనే….

అయితే ఆ నాలుగు సీట్లను వదులుకునేందుకు టీఆర్ఎస్ అంగీకరిస్తుందా? లేదా? అన్నదే ప్రశ్న. మజ్లిస్, టీఆర్ఎస్ అధికారికంగా పొత్తుతో ఎన్నికలకు వెళ్లవు. కాని అవగాహన ద్వారానే మజ్లిస్ కోరిన సీట్లలో తమ అభ్యర్థులను టీఆర్ఎస్ నిలబెట్టక పోవడం కాని, డమ్మీ క్యాండిడేట్లను పోటీకి దింపడం కాని చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో సహా టీడీపీ, కోదండరామ్ పార్టీలు ఒక్కటవుతున్నాయి. ఈ మూడు కూటమిగా ఏర్పడే ఎన్నికలకు వెళ్లే అవకాశముంది. ఈ దశలో హైదరాబాద్ నగరంపై పట్టున్న మజ్లిస్ సహకారం గులాబీ పార్టీకి అవసరమే.

మరోనాలుగు స్థానాల్లో…..

అందుకే ఒవైసీ టీఆర్ఎస్ పై వత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది. దశాబ్దాలుగా తాము ఏడు అసెంబ్లీ సీట్లను దాటిరాలేకపోతున్నామని, ఈసారి నాలుగు అసెంబ్లీ సీట్లను తమకు కేటాయించాలని కోరుతున్నారు. గత ఎన్నికల్లో మజ్లిస్ రెండో స్థానంలో నిలిచిన సీట్లనే ఆ పార్టీ కోరుతుంది. వాటిలో జూబ్లీహిల్స్, అంబర్ పేట్, గోషామహల్, రాజేంద్రనగర్ స్థానాలను తమకు ఇవ్వాలని కోరుతుంది. ఆ నాలుగు సీట్ల విషయంలో ఇప్పటికే ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇక్కడ టీఆర్ఎస్ కొంత బలహీనంగా ఉన్నా ఇటీవలే పుంజుకుంటోంది. ముస్లిం రిజర్వేషన్లను అమలు 10 శాతానికి పెంచుతానని హామీ ఇచ్చిన కేసీఆర్ దానిని అమలు చేయలేని స్థితిలో మజ్లిస్ ప్రెషర్ కు తలొగ్గుతారంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*