అశోక్ ‘‘చక్రం’’ తిరుగుతుందా?

విజ‌య‌న‌గ‌రం రాజ‌వంశం నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి ఓ మ‌హిళ దిగుతున్నారా..? విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ సీటు కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా..? అంటే తాజా ప‌రిస్థితులు ఔన‌నే అంటున్నాయి. ఆ వార‌సులు మ‌రెవ‌రో కాదు… కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తి రాజు కుమార్తె అదితి గ‌జ‌ప‌తి రాజు. 2019 ఎన్నిక‌ల్లో ఆమె బ‌రిలోకి దిగ‌బోతున్నార‌నే ప్ర‌చారం జోరందుకుంది. కొంత‌కాలంగా ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో చురుగ్గా ఉండ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇప్ప‌టికే అశోక్‌గ‌జ‌ప‌తి రాజు ఎంపీగా కొన‌సాగుతున్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని అదితిని వార‌సురాలిగా తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు జిల్లాలో వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

కొంతకాలం నుంచి చురుగ్గా…..

నిజానికి కొంత‌కాలంగా అదితి రాజ‌కీయ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అటు క్యాడ‌ర్‌కు, ఇటు ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌న తండ్రితో పాటు ప్ర‌తి వేదిక‌ను ఆమె పంచుకుంటున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు త‌న‌వంతుగా కృషి చేస్తున్నారు. ఇదంతా చూసి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె పోటీ చేయ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది. మొద‌ట్లో అశోక్ గ‌జ‌ప‌తి రాజు కాంగ్రెస్‌లో ఉన్నారు. 1978లో జ‌న‌తా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆతర్వాత టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొన‌సాగుతున్నారు. పార్టీలో, ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టారు. టీడీపీ ఆవిర్బావం నుంచి 1983, 1985, 1989, 1994, 1999, 2009ల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్క 2004 ఎన్నిక‌ల్లో మాత్ర‌మే ఆయ‌న కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న తొలిసారి లోక్‌స‌భ‌కు పోటీ చేశారు. 2014లో తొలిసారి ఎంపీగా విజయం సాధించారు.

వచ్చే ఎన్నికలేసరైనవని…..

ఆ త‌ర్వాత మూడున్న‌రేళ్ల పాటు కేంద్ర‌మంత్రిగా కూడా ప‌నిచేశారు. టీడీపీ ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు రావడంతో ఆయ‌న త‌న మంత్రి ప‌ద‌విని వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే అశోక్ త‌న కుమార్తెను పొలిటిక‌ల్ ఎంట్రీ చేయించేందుకు వ‌చ్చే ఎన్నిక‌లే స‌రైన‌వ‌ని భావిస్తున్నారు. అదితి గ‌జ‌ప‌తి రాజు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే విష‌యంపై ఇప్ప‌టికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటూ తేల్చ‌లేద‌ని తెలిసింది. మ‌రో విష‌యం ఏమిటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అశోక్‌గ‌జ‌ప‌తి రాజు బ‌రిలోకి దిగేందుకు సుముఖంగా లేర‌ని కూడా తెలుస్తోంది. ఆయ‌న రాజ‌కీయాల నుంచి విశ్రాంతి తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు చెబుతున్నారు.

అసెంబ్లీ సీటు మాత్రమే…..

అయితే, ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎలా స్పందిస్తారు..? అశోక్‌గ‌జ‌ప‌తి రాజు ఏం చేస్తారు..? అన్న‌దానిపైనే జిల్లాలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా.. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే గీత‌ను కాద‌ని అదితికి టికెట్ ఇచ్చేందుకు చంద్ర‌బాబు ఒప్పుకుంటారా..? అన్న‌ది కూడా డౌటేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. అశోక్ ఎంపీగా పోటీ చేసేందుకు ఒప్పుకోక‌పోయినా కుమార్తెకు మాత్రం విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ సీటే కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. అలా అయితే అక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత‌ను త‌ప్పించాల్సి ఉంది. అందుకు చంద్ర‌బాబు ఒప్పుకోని ప‌క్షంలో వార‌సురాలికి ఎంపీ సీటే ఆప్ష‌న్‌గా ఉంటుంది. ఏద‌మైనా కుమార్తె సీటు విష‌యంలో చంద్ర‌బాబు సీనియ‌ర్ అయిన అశోక్‌కు ఏ మాట చెప్ప‌క‌పోవ‌డంతో ఆయ‌న తీవ్రంగా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.