అవంతి…కర్చీఫ్ వేస్తే…చంద్రబాబు?

మ‌రో ప‌ది మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. రాజ‌కీయాలు వేడెక్కాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఆశిస్తున్న‌వారు త‌మ త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. అదేస‌మ‌యంలో సిట్టింగులు త‌మ రాజకీయ కోరిక‌లు తీర్చుకునేందుకు పార్టీల అధిష్టానాల‌ను ప్ర‌సన్నం చేసుకునేందుకు ఉబ‌లాట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోవారు అనేక విన్యాసాలు చేస్తున్నారు. వీరిలో ప్ర‌ధానంగా తెర‌మీదికి వ‌స్తున్నారు.. అన‌కాప‌ల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు ఉర‌ఫ్ అవంతి శ్రీనివాస‌రావు. అవంతి ఫెర్టిలైజ‌ర్స్‌పేరుతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన కుటుంబం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన శ్రీనివాస‌రావు.. చంద్ర‌బాబుకు న‌మ్మిన బంటు! వివాద ర‌హితుడిగా పేరు తెచ్చుకున్నారు. అవినీతి ఆరోప‌ణ‌ల నుంచి చాలా దూరంగా ఉంటారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు చంద్ర‌బాబు వ‌ద్ద మంచి మార్కులు కూడా ఉన్నాయి.

దానిపై గాలి మళ్లింది…..

ప్ర‌స్తుతం ఎంపీ గా ఉన్న అవంతికి ఇప్పుడు అసెంబ్లీపై గాలి మ‌ళ్లింది! వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎమ్మెల్యే అయి..కుదిరితే మంత్రిగా కూడా చ‌క్రం తిప్పాల‌నేది ప్ర‌ధాన ల‌క్ష్యంగా మారిపోయింది. ఈ నేప‌థ్యంలోనే విశాఖ జిల్లాలో త‌న‌కు అనుకూలంగా ఉన్న అసెంబ్లీ స్థానం కోసం వెతుకుతున్నారు. వీటిలో గ‌తంలో తాను గెలుపొందిన భీమిలి నుంచి మ‌ళ్లీ పోటీ చేయాల‌ని భావించారు. 2009 ఎన్నిక‌ల్లో అవంతి ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆయ‌న గంటా గ్యాంగ్‌లోని మ‌నిషే. ఆ త‌ర్వాత అవంతి కూడా భీమిలి మీద కాన్‌సంట్రేష‌న్ చేయ‌డంతో అవంతికి, గంటాకు మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో గ్యాప్ వ‌చ్చింది.

గంటా ఉండటంతో…..

భీమిలిలో గంటా శ్రీనివాస‌రావు ఉండ‌డం, ముత్తంశెట్టి మ‌న‌సులో కోరిక తెలుసుకుని ఆయ‌న అడ్డు చెప్ప‌డంతో వెన‌క్కి త‌గ్గారు. ఈ నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి కేటాయించిన విశాఖ ఉత్త‌ర నియోజ‌క వ‌ర్గంపై ముత్తం శెట్టి ఆశ‌లు పెంచుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగూ టీడీపీ ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతుంది కాబ‌ట్టి తాను ఇక్క‌డి నుంచి పోటీ చేస్తే బెట‌ర‌ని ఆయ‌న అనుకున్నారు. అనుకున్న‌దే త‌డ‌వుగా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై అవ‌గాహ‌న పెంచుకున్నారు. ప్ర‌స్తుతం ఇక్క‌డ టీడీపీకి ఇంచార్జ్ లేక‌పోవ డంతో త‌న‌ను ఇక్క‌డ ఇంచార్జ్‌గా నియ‌మించాల‌ని, పార్టీని బ‌లోపేతం చేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తాన‌ని ఆయ‌న చంద్ర‌బాబుకు వ‌ర్త‌మానం పంపారు.

సబ్బం హరి ఆశిస్తున్న…..

దీనికి చంద్ర‌బాబు ఓకే అంటే.. ఉత్త‌రం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకు ముత్తం శెట్టి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, ఇక్క‌డ ముగ్గురు ఆల్రెడీ బ‌రిలో ఉన్న విష‌యం చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి స్వాతి కృష్ణారెడ్డి ఈ నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్నేశారు. ఇక్క‌డ పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఇక‌, కాంగ్రెస్‌లో చ‌క్రం తిప్పి ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న మాజీ ఎంపీ సబ్బం హ‌రి రేపో మాపో టీడీపీలోకి చేరే అవ‌కాశం ఉంది. ఈయ‌న‌కు ఈ సీటు కేటాయించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న స‌మాచారం. ఈ నేప‌థ్యంలో మ‌రి ముత్తంశెట్టి కోరిక ఎంత మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*