ఎంపీ అవంతి యూట‌ర్న్‌.. ఎందుకంటే..?

అన‌కాప‌ల్లి ఎంపీ, రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శించే అవంతి శ్రీనివాస్ ఉర‌ఫ్ ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు యూట‌ర్న్ తీసు కున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పార్టీపై ఆధిప‌త్యం చ‌లాయించేందుకు ప్ర‌ద‌ర్శించిన ఆయ‌న ఉన్న‌ప‌ళంగా ఇప్పుడు అధిష్టానానికి దాసోహం అనే ప‌రిస్తితికి వ‌చ్చారు. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు ముత్తంశెట్టి ఇలా మారిపోయారు? అనే కీల‌క ప్ర‌శ్న‌లు అన్ని వ‌ర్గాల్లోనూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న అవంతికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయ‌డం ఇష్టం లేదు. ఎంపీగా ఆయ‌న ఇచ్చిన హామీల‌ను దాదాపు ఇప్ప‌టికీ నెర‌వేర్చ‌లేక పోయారు. ఆయ‌న చేసిన ఉద్య‌మాలు కూడా గుర్తింపున‌కు నోచుకోకుండాపోయాయి.

తిరిగి ఎంపీగా పోటీ చేస్తే……

దీంతో ఎంపీగా తిరిగి పోటీ చేస్తే అంత సానుకూల ప‌రిస్థితులు లేవ‌ని ఆయ‌న గుర్తించారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, దీనిపై నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంచుకున్న అవంతి.. ఆయా నియోజ‌క‌వర్గాల్లో ఏదో ఒక దానిని ఖ‌రారు చేయాల‌ని నిర్ణ‌యించాని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అయితే, ఈ క్ర‌మంలోనే అవంతి ప్రోగ్రెస్‌పై చంద్ర‌బాబు రిపోర్టు తెప్పించుకున్నారు. దీనిలో ఆయ‌న‌పై పెద్ద సానుకూల ప‌వ‌నాలు ఏవీ లేవ‌ని స్ప‌ష్టం కావ‌డంతో విష‌యాన్ని ఆయ‌న‌కు నేరుగానే చెప్పారు. దీంతో వెన‌క్కి త‌గ్గిన అవంతి తాజాగా యూట‌ర్న్ తీసుకుని, త‌న‌ను తానే నియంత్రించుకున్నారు.

అధిష్టానం నిర్ణయం ప్రకారమే…..

రానున్న ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తానని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తాజాగా అవంతి కాలేజీలో జరిగిన సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, పార్టీ అధిష్ఠా నం నిర్ణయించిన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని చెప్పారు. జిల్లా టీడీపీలో ఎటువంటి వర్గాలు లేవని, అంతా ఏకతాటిపై నడుస్తున్నామన్నారు. అయితే, ఇటీవ‌ల కాలంలోఅవంతి వ్య‌వ‌హారంపై ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాస‌రావుపై పోరు జెండా ఎగ‌రేయ‌డం వంటి కీల‌క అంశాలు ఆయ‌న‌కు ప్ర‌తిబంధకంగా మారాయ‌ని అంటున్నారు.

అవంతి సీటు ఎక్కడ….?

అవంతి 2009లో ప్ర‌జారాజ్యం నుంచి భీమిలిలో ఎమ్మెల్యేగా గెలిచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న అక్క‌డి నుంచే పోటీ చేస్తాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం అక్క‌డ మంత్రి గంటా ఎమ్మెల్యే. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ పెరిగింది. గంటా తాను భీమిలి నుంచి త‌ప్పుకునే ప్ర‌శ‌క్తే లేద‌ని చెప్పారు. దీంతో అవంతికి అసెంబ్లీ సీటు ఎక్క‌డ దొరుకుతుందో ? బాబు ఆయ‌న్ను ఎంపీగా కాద‌ని…. అసెంబ్లీకి పంపిస్తారా ? అన్న‌ది డౌటే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*