ఎంపీ అవంతికి గెలుపు గుర్రం అదేనా..?

అవంతి శ్రీనివాస‌రావు ఉర‌ఫ్ ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు. విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో గెలుపొందిన ఆయ‌న అవంతి విద్యా సంస్థ‌ల‌కు అధిప‌తి. దీంతో ఆయ‌న అవంతి శ్రీనివాస‌రావుగానే ప‌రిచయం అయ్యారు. 2014లో టీడీపీ త‌ర‌ఫున టికెట్ సాధించిన అవంతి.. అప్ప‌టి వైసీపీ అభ్య‌ర్థి గుడివాడ అమ‌ర్నాథ్ మీద దాదాపు 47,900 పైచిలుకు ఓట్ల ఆధిక్య‌త‌తో అవంతి విజ‌యం సాధించారు. కింది నుంచి పైకి ఎదిగిన నేత‌గా ఆయ‌న గుర్తింపు సాధించారు.

విశాఖ రైల్వే జోన్….

దీంతో పేద‌లు ఎక్కువ‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న గెలుపు ముందుగానే ఊహించారు. అయితే, మారిన రాజకీయ ప‌రిణామాలు, జ‌గ‌న్ హ‌వా ప్ర‌భావంతో అవంతి గెలుపు చివ‌రి వ‌ర‌కు దోబూచులాడింది. దీంతో ఒకానొక ద‌శ‌లో అవంతి తీవ్ర మ‌న‌స్థాపానికి కూడా గుర‌య్యారు. రిజ‌ల్ట్ త‌న‌కు అనుకూలంగా రావ‌డంతో హ‌మ్మ‌య్య అనుకున్న అవంతి.. అప్ప‌టి నుంచి ప్ర‌జ‌ల్లో తిరుగుతూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి విశేషంగానే కృషి చేశారు. ప్ర‌ధానంగా ఇక్క‌డ ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్న విశాఖ రైల్వే జోన్‌ను అవంతి కూడా సీరియ‌స్‌గానే తీసుకున్నారు.

నియోజకవర్గంలో మూడు ఆఫీసులు….

2015లో ఇదే అంశంపై ఆయ‌న వీధిలోకి వ‌చ్చి సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో క‌లిసి.. ధ‌ర్నాకు కూడా దిగారు. ఇక‌, ప్ర‌జ‌ల‌కు ఎక్క‌డిక‌క్క‌డ అందుబాటులో ఉండాల‌నే ధ్యేయంతో ఆయ‌న నియోజ‌క‌వ ర్గం మొత్తంలోనూ మూడు ఆఫీస్‌లు తెరిచి త‌న సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేశారు. నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను పార్ల‌మెంటులో ప్ర‌స్థావించిన ఎంపీల్లో అవంతి తొలి ప‌దిమందిలో ఒక‌రుగా నిలిచి గుర్తింపు పొందారు. పార్ల‌మెంటు స‌మావేశాల‌కు విధిగా హాజ‌ర‌వుతూ దాదాపు 80% హాజ‌రు సాధించారు. అదేవిధంగా తొలి రెండేళ్ల‌లోనే ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి దాదాపు 264 ప్ర‌శ్న‌లు పార్ల‌మెంటులో సంధించారు.

కమ్యునిటీ హాళ్లకు….

ఎంపీగా రాచ‌మ‌ర్యాద‌లు పొంద‌డం దేశంలో కామ‌న్‌. అయితే, అవంతి మాత్రం వీటికి దూరంగా త‌న‌ను తాను నిరూపించు కున్నారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న ఎంపీగా ఆయ‌న గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంపీ లాడ్స్ నుంచి క‌మ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం ఎక్కువ‌గా నిధులు కేటాయించి స్థానిక స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టారు. తాగునీరు, రైల్వే స్టేష‌న్ ఆధునికీక‌ర‌ణ కోసం నిధులు వెచ్చించారు. దుడ్డుపాలెం, తాళ్ల‌పాలెం త‌దిత‌ర మూడు గ్రామాల‌ను ప్ర‌ధాన మంత్రి సంస‌ద్ గ్రామ యోజ‌న కింద ద‌త్త‌త తీసుకునిఅభివృద్ధి చేశారు.

అది వస్తేనే….

ఇలా మొత్తంగా అభివృద్ధి మంత్రం ప‌ఠిస్తూ.. ముందుకు సాగుతు న్న అవంతికి ఒక్క‌టే ఒక్క దిగులు ప‌ట్టుకుంది. అదే విశాఖ రైల్వే జోన్‌. ఇది సాధిస్తేనే స్థానికంగా ఆయ‌న‌కు ఇప్పుడున్న గ్రాఫ్ మ‌రింత‌గా పెరుగుతుంద‌నేది విశ్లేష‌కుల మాట‌. ఇక‌, సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద అవంతికి మంచి మార్కులే ఉన్నాయి. పార్టీ లైన్ త‌ప్ప‌కుండా ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాదు, ఏదైనా విష‌యంపై మాట్లాడాల‌న్నా కూడా అధిష్టానం నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఆయన చింత అదే….

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఏపీ విభ‌జ‌న హామీల ఆందోళ‌న‌లోనూ త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతున్నారు. దైవ భ‌క్తి ఎక్కువ‌గా ఉన్న అవంతి ఏటా విధిగా స్వామి మాల ధ‌రించ‌డం విశేషం. ఇప్పుడు ఆయ‌న ఫోక‌స్ అంతా వ‌చ్చే ఎన్నిక‌ల‌పైనే. అయితే, ఇప్ప‌టికీ దోబూచులాడుతున్న విశాఖ రైల్వే జోన్‌ను సాధిస్తే.. త‌న విజ‌యం మ‌రోసారి ఖాయ‌మ‌ని ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో చెబుతున్నారు. మొత్తంగా అభివృద్ధి మంత్రంతో దూసుకుపోతున్న అవంతి చింత మొత్తం.. విశాఖ జోనే కావ‌డం గ‌మనార్హం మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇక ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం ఆయ‌న జ‌న‌సేన‌తోనూ స‌న్నిహితంగా ఉంటున్న‌ట్టు మ‌రో టాక్ న‌డుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*