అయ్యన్న ఎందుకు ఊరుకుంటారు…. !!

విశాఖ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్యన రాజకీయ విభేదాలు అలాగే పచ్చగా పదిలంగానే ఉన్నాయి. ఇందుకు తాజా ఉదాహరణగా విశాఖ భూ కుంభకోణాలపైన చంద్రబాబు సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు కమిటి (సిట్) నివేదికను అడ్డం పెట్టుకుని మంత్రులు మళ్ళీ వార్ మొదలెట్టేశారు. సిట్ తనకు క్లీన్ చీట్ ఇచ్చిందంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు జబ్బలు చరచుకోవడమే కాదు, తనపైన రాజకీయ ప్రత్యర్ధులు బురద జల్లారని చూశారంటూ అయ్యన్నపై పరోక్షంగా హాట్ కామెంట్స్ చేసిన సంగతి విదితమే. దీనికి ప్రతిగా అయ్యన్న ఇపుడు ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

సూత్రధారులెవరో…?

సిట్ నివేదికలో కేవలం అధికారులే దోషులు అని ఉందని, తప్పు చేసిన అధికారులు శిక్ష అనుభవించడం మంచిదేనని అయ్యన్న అన్నారు. అంతటితో ఊరుకోకుండా వారి చేత ఇంతటి తప్పులు చేయించిన వారు ఎవరోనని సందేహం వ్యక్తం చేశారు. ఏ అధికారి వెనక పెద్దలు లేకుండా ఇంతటి భారీ కుంభకోణాలు చేయలేడని మంత్రి సూత్రీకరించారు. అందువల్ల తప్పనిసరిగా విశాఖ భూకభాల వెనక పెద్ద తలకాయలే ఉన్నాయని మంత్రి అనడం ఇక్కడ విశేషం. ఇలా తన బాణాన్ని మళ్ళీ ఆయన మంత్రి గంటా వైపు విసిరారు.

వలస వచ్చిన వారి పనే ఇది….

ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు, విశాఖలో స్థిరపడిన వారు కలసి ఇక్కడ భూములను దోచుకున్నారంటూ మంత్రి మండిపడ్డారు. వలస వచ్చిన వారు అంటే అది కచ్చితంగా మంత్రి గంటాపైనే విమర్శ అన్నది తెలిసిపోతోంది. ఇదేం ఆషామాషీ కబ్జా కాదన్న మంత్రి అయ్యన్న దాదాపుగా 2,500 కోట్ల రూపాయల విలువ చేసే భారీ కుంభకోణం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంతటి కుంభకోణం కేవలం అధికారులే చేశారంటే ఎవరూ నమ్మరని కూడా అయ్యన్న అన్నారు. అసలు దోషులు తెర వెనక ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

అధికారులు నోరు విప్పాలి….

తమపైన వచ్చిన ఆరోపణలకు అధికారులు నోరు విప్పాలని అయ్యన్న డిమాండ్ చేయడం విశేషం. తమను ఈ భూ కబ్జాలకు ఎవరు వెనక ఉంచి వత్తిడి చేసింది కూడా చెప్పాలని ఆయన కోరారు. అపుడే అసలు నిజాలు వెలుగు చూస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారులు నోరు తెరిస్తే వాస్తవాలు బయటకు వచ్చి అసలు వ్యక్తులు తెర ముందుకు వస్తారని అయ్యన్న అనడంతో రాజకీయ వర్గాల్లో సంచలనం రేగుతోంది. ఎన్నికల ముందు బయటకు వచ్చిన సిట్ నివేదిక ఇపుడు అధికార పార్టీలోనే చిచ్చు రేపుతోంది. మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*