అయ్యన్న తిరగబడుతున్నారా…!!

ayyannapathrudu-angry-on-telugudesam-party-highcommand

టీడీపీలో రెబెల్ ఎవరైనా ఉంటే మొదటి పేరు విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుతోనే చెబుతున్నారు. ఆయన ధిక్కార స్వరం అధినాయకత్వానికే సవాల్ అన్నది తమ్ముళ్ళ మాట. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అయ్యన్నది కూడా రాజకీయ కుటుంబమే. ఆయన తాత లచ్చాపాత్రుడు అప్పట్లోనే రాజకీయాల్లో ఉన్నారు. దాంతో ఆయన్ని తన పార్టీలో చేర్చుకునేందుకు అప్పట్లో అన్న నందమూరి రాయబారం చేశారు. అయితే తన మనవడికి అవకాశం ఇమ్మని లచ్చాపాత్రుడే కోరడంతో అయ్యన్న అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేశారు. తొలి దఫాలోనే టీడీపీ నుంచి గెలిచిన అయ్యన్న పిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టి ఆ హోదాలో పెళ్ళి చేసుకున్న నేతగా గుర్తుండిపోతారు. తాను చంద్రబాబు కంటే సీనియర్ అన్న మాట అనే ధైర్యం ఒక్క అయ్యన్నకే సాధ్యం.

ముక్కుసూటి విమర్శలు…

తెలుగుదేశం పార్టీలో ఆది నుంచి ఉన్న వారిలో అయ్యన్న ఒకరు. ఆయన చాలా కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్న మాట వినిపిస్తోంది. దాన్ని ఆయన బాహాటంగా వేదికల మీదనే పంచుకుంటూ ఉన్నారు. గత ఏడాది కాంగ్రెస్ తో కలసి తెలంగాణాలో టీడీపీ పోటీ చేయడం కూడా అయ్యన్నకు ఇష్టం లేదంటారు. ఇక ఏపీలో టీడీపీతో పొత్తు అంటే బట్టలూడదీసి జనం కొడతారు అని అయ్యన్న అనడం వెనక కూడా ఓ హెచ్చరిక ఉంది. దాన్ని అర్ధం చేసుకున్న అధినాయకత్వం ఆ ఆలోచన విరమించుకుంది. ఈ నేపధ్యంలో తాజాగా అయ్యన్న లగడపాటి సర్వే పేరుతో మరో మారు పెద్ద నోరు చేసుకున్నారు.

లగడపాటి అంటే కోపమా…?

లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడు. ఆయన చంద్రబాబుకు ఇటీవల కాలంలో బాగా చేరువ అయ్యారు. తాజా ఎన్నికల్లో ఆయన సలహా మేరకే చంద్రబాబు పార్టీ టికెట్లు అందరికీ కట్టబెట్టారని ప్రచారం కూడా ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుల సలహాలు బాబు విని టీడీపీని పాడుచేస్తున్నారన్న ఆవేదన సీనియర్లలో ఉంది. దాన్ని ప్రతిబింబించేలా అయ్యన్న తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. లగడపాటి సర్వేను పనికిమాలిన సర్వేగా సీనియర్ నేత అయ్యన్న అనడం ఓ విధంగా సాహసమే. నిజానికి లగడపాటి సర్వే టీడీపీకి ఎంతో బూస్టింగ్ ఇచ్చింది. ఓ విధంగా ఏ సర్వే చెప్పని విధంగా మళ్ళీ అధికారం టీడీపీదేనని చెప్పుకొచ్చింది. అటువంటి సర్వేను చెత్త సర్వే అనడం ద్వారా అయ్యన్న తన కోపాన్ని పరోక్షంగా అధినాయకత్వం మీద చూపించారా అన్న చర్చ సాగుతోంది.

క్షేత్ర స్థాయిలో వేరుట….

ఇక దిగువన ఉన్న ప్రజలతో సంబంధాలు పెట్టుకుని సర్వే చేస్తే బాగుంటుంది కానీ ఎక్కడో అంతస్తుల్లో కూర్చుని సర్వే చేయడమేంటని అయ్యన్న ప్రశ్నించారు. ఈ విధంగా ఆయన అనడం ద్వారా లగడపాటి సర్వేను బోగస్ అని తేల్చేశారు. అంతే కాదు, దీన్ని నమ్మి ఎవరూ మోసపోవద్దని కూడా పిలుపు ఇవ్వడం బట్టి చూస్తూంటే చంద్రబాబు మీద ఇండైరెక్ట్ సెటైర్లు ఉన్నాయనే భావించాలని అంటున్నారు. ఓ విధంగా పార్టీ పరిస్థితి చెప్పడమే కాదు, రానున్న రోజుల్లో తిరుగుబాటుకు అయ్యన్న సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకే ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 18021 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*