ఏపీలో ఆ ముగ్గురు మంత్రుల‌కు టిక్కెట్లు లేవా ?

ఏపీలో ఆస‌క్తిక‌ర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీలో రోజురోజుకు రాజ‌కీయాలు మారుతున్నాయి. వ్యూహ ప్ర‌తివ్యూహ‌లు సిద్ధం చేయ‌డంలో ముందుండే.. సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మంగా తీసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు, వ‌చ్చే ఎన్నిక‌లకు మ‌ధ్య చాలానే తేడా ఉంది. గ‌త ఎన్నిక‌ల వేళ‌.. చంద్ర‌బాబుకు రెండు ప్ర‌ధాన విష‌యాలు క‌లిసి వ‌చ్చాయి.

ఒంటరిపోరుకి సిద్ధమవుతూ…

బీజేపీ, ప‌వ‌న్‌లు ఆయ‌న‌కు గ‌ట్టి మ‌ద్ద‌తుగా నిలిచారు. టీడీపీకి ఓట్లు ప‌డ‌డంలో చాలా జిల్లాల్లో ప‌వ‌న్ ప్ర‌సంగాలు బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు సైతం ప‌లు వేదిక‌ల‌పై ఒప్పుకొన్నారు కూడా. అయితే, ఇప్పుడు బాబు వైఖ‌రితో ఈ ఇద్ద‌రూ దూర‌మ‌య్యారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబుకు ఒంట‌రిపోరు త‌ప్పదు. ఈ నేప‌థ్యంలోనే చంద్రబాబు త‌న ప్ర‌తి అడుగును ఎంతో వ్యూహాత్మ‌కంగా ముందుకు వేస్తున్నారు. త‌న కేబినెట్‌లో సీనియ‌ర్లుగా ఉన్న ముగ్గురు మంత్రుల విష‌యంలో చంద్ర‌బాబు చాలా ప‌క‌డ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నార‌ని తెలుస్తోంది. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, పొంగూరు నారాయ‌ణ‌. ఈ ముగ్గురు మంత్రుల‌ను వాడుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు తాజాగా వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

అందరూ ఆప్తులే…

ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు.. చంద్ర‌బాబుకు మంచి ఆప్తులుగా గుర్తింపు పొందారు. ఈ నేప‌థ్యంలో వీరిని వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీకి పూర్తిగా వినియోగించుకుని పార్టీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో మంత్రి నారాయ‌ణ‌.. పార్టీకి అన్ని విధాలా అండ‌గా నిలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీని చేసి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఇక సోమిరెడ్డి గత ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అయినా పార్టీని నిల‌బెట్టేందుకు నెల్లూరులో ఆయ‌న చేసిన కృషిని గుర్తించి.. చంద్ర‌బాబు ఆయ‌న‌కు ప‌ద‌విని ఇచ్చారు.

ఎమ్మెల్యేగా పోటీ చేయనట్లే…

ఇక‌, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సీనియార్టీలో చంద్ర‌బాబుతో స‌రిస‌మానం. ఈ నేప‌థ్యంలో ఈ ముగ్గురికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ టికెట్లు ఇవ్వ‌కుండా ఎమ్మెల్సీలు గానే ఉంచి పార్టీకి వినియోగించుకోవాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ముగ్గురిలో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు గ‌త ఎన్నిక‌ల్లోనే పోటీ చేయ‌లేదు. తుని నుంచి వ‌రుస‌గా ఆరుసార్లు గెలిచిన య‌నమ‌ల ఏడో ప్ర‌య‌త్నంలో 2009లో ఓడిపోయారు. ఆ త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల‌కు ఆయ‌న దూరంగా ఉన్నారు. ఇక సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి గ‌త నాలుగు ఎన్నిక‌ల్లోనూ ఓడిపోతున్నారు. ఈసారి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన స‌ర్వేప‌ల్లిలో ఆయ‌న వార‌సుడికి లేదా మ‌రో బ‌ల‌మైన వ్య‌క్తిని పోటీ చేయించాల‌ని బాబు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో సోమిరెడ్డికి సీటు లేద‌న్న‌ది ఖాయ‌మే. ఇక మంత్రి నారాయ‌ణ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాల‌ని విశ్వ‌ ప్రయ‌త్నాలు చేస్తున్నా అక్క‌డ ఉన్న స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో బాబు ఆయ‌న‌కు అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు సుముఖంగా లేరు. ఏదేమైనా ఈ ముగ్గురు మంత్రులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే ఛాన్సులు అయితే లేవు. మ‌రి ఫైన‌ల్‌గా బాబు డెసిష‌న్ ఎలా ఉంటుందో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*