దీక్ష సక్సెస్? ఫెయిలా? అంతర్మధనంలో టీడీపీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 12 గంటల దీక్ష సక్సెస్ అయిందా? లేదా? ఇదే టీడీపీలో జరుగుతున్న చర్చ. చంద్రబాబు చేసిన ఒకరోజు దీక్ష పార్టీకి ఫుల్లు మైలేజీ తెస్తుందని భావించారు. పుట్టినరోజు వేడుకలను కూడా పక్కనపెట్టి చంద్రబాబు ఉపవాస దీక్షకు పూనుకోవడం ఏపీలో టీడీపీకి హైప్ క్రియేట్ చేస్తుందనుకున్నారు. అయితే టీడీపీ అగ్రనేతలు జరిపిన విశ్లేషణల్లో దీక్ష అనుకున్నంత రీతిలో సక్సెస్ కాలేదని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు 12గంటల పాటు దీక్ష చేసినా కొందరు టీడీపీ నేతలు నియోజకవర్గాల్లో చేసిన నిర్వాకాన్ని తలనొప్పి తెచ్చిందంటున్నారు. చంద్రబాబు కూడా దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

నేతల మధ్య విభేదాలు….

నిన్న చంద్రబాబు దీక్ష సందర్భంగా 175 నియోజకవర్గాల్లో సంఘీభావ దీక్షలు చేయాలని చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బద్వేలు, కోడుమూరు నియోజకవర్గాలతో పాటు మరికొన్ని చోట్ల నేతల మధ్య ఉన్న విభేదాలు దీక్ష సందర్భంగా మరోసారి బయటపడ్డాయి. వేర్వేరు శిబిరాలను ఏర్పాటు చేసుకుని నేతలు దీక్షకు దిగడంతో క్యాడర్ అయోమయంలో పడింది. నిన్న జరిగిన పరిణామలపై సమీక్ష చేసిన చంద్రబాబు సంబందిత ఇన్ ఛార్జి మంత్రులకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అలా జరగకుండా ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. నిన్న మీడియాలో తాను చేస్తున్న దీక్ష కంటే ఇవే ఎక్కువ హైలెట్ అయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

బాలయ్య హాట్ కామెంట్స్…..

దీంతోపాటు బాలకృష్ణ మోడీపై చేసిన వ్యాఖ్యలుకూడా పార్టీని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయని భావిస్తున్నారు. ఏపీకి మోడీ చేస్తున్న అన్యాయాన్ని వివరించాలే కాని, మోడీపై వ్యక్తిగత దాడికి దిగితే అది బీజేపీకి సానుభూతి పెరగదా? అని చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం. మాట్లాడేటప్పుడు కొంత అవగాహనతో మాట్లాడాలని, బాలయ్య బాబు అలా ఎందుకు మాట్లాడారని, టీడీపీ సీనియర్ నేతను చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే మరోవైపు పవన్ కల్యాణ్ అంశం కూడా చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం.

పక్కదోవ పట్టించడానికే…..

పవన్ కల్యాణ్ కేవలం దీక్షను పక్కదోవ పట్టించడానికే అదేరోజు లోకేష్ తో పాటు పార్టీపై ఆరోపణలు చేయడాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా తప్పు పట్టారు. పవన్ కావాలనే ఇలా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. పవన్ ను వెనకుండి ఎవరో నడిపిస్తున్నారన్న అనుమానాన్ని కూడా చంద్రబాబు వ్యక్తం చేశారు. శ్రీరెడ్డి అంశం నాలుగైదు రోజులుగా జరుగుతుంటే, తాను దీక్ష చేస్తున్న రోజునే పవన్ ఎందుకు విమర్శలు చేయాల్సి వచ్చిందో ప్రజలు అర్థం చేసుకుంటారని చంద్రబాబు నేతలతో అన్నట్లు తెలిసింది. మొత్తం మీద 13 జిల్లాల నుంచి కార్యకర్తలను సమీకరించడంలో టీడీపీ నేతలు విజయం సాధించినా అనుకున్నంత మైలేజీ రాలేదన్న అభిప్రాయంలో టీడీపీ నేతలు ఉన్నట్లు తెలిసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*