క‌డ‌ప‌పై టీడీపీ ఆప‌రేష‌న్‌.. రీజ‌న్ ఇదే!

రాజ‌కీయాల్లో ప్రత్యర్థుల‌ను దెబ్బతీసేందుకు అనేక మార్గాలు ఉంటాయి. వారిని ఎదురొడ్డి దెబ్బతీయ‌డం ఒక భాగ‌మైతే.. వారిని నైతికంగా నూ దెబ్బతీయ‌డం ద్వారా విజ‌యం సాధించొచ్చనేది రెండో భాగం. ఈ రెండు విష‌యాల్లోనూ ఆరితేరారు సీఎం చంద్రబాబు. ప్రత్యర్థుల‌ను ఎలా లొంగ దీసుకోవాలో? అలా లొంగ‌దీసుకోవ‌డంలో ఆయ‌న ఆరితేరి పోయారు. ఈ క్రమంలోనే ఆయ‌న ఇప్పుడు జ‌గ‌న్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి నెగ్గి అధికార ప‌గ్గాలు చేప‌ట్టి రికార్డు సృష్టించాల‌ని చంద్రబాబు వ్యూహంగా నిర్ణయించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితిలో త‌న‌కు ప్రధాన శ‌త్రువుగా, అధికార పీఠం కోసం తీవ్రమైన పోటీ ఇస్తున్న జ‌గ‌న్‌ను ఎదుర్కొనాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ను ఎదుర్కొనే భాగంలో ఆయ‌న‌కు గ‌ట్టిప‌ట్టున్న సొంత జిల్లా క‌డ‌ప‌పై బాబు దృష్టి పెట్టారు.

నలభై ఏళ్లుగా…..

జ‌గ‌న్‌కే కాకుండా వైఎస్ ఫ్యామిలీ మొత్తానికి ఇప్పటి వ‌ర‌కు గ‌డిచిన 40 ఏళ్లుగా కూడా ఈ జిల్లా ఎంతో అండ‌దండ‌లుగా ఉంది. దీంతో జ‌గ‌న్‌కు ఇక్కడ తిరుగులేని మెజారిటీ ల‌భిస్తోంది. దీంతో జ‌గ‌న్‌ను అన్ని విధాలా ఆదుకుంటున్న ఈ జిల్లా లో పాగా వేయ‌గ‌లిగితే.. తాను స‌క్సెస్ అయిన‌ట్టేన‌ని చంద్రబాబు భావిస్తున్నారు. గ‌త రెండేళ్లుగా కూడా రాజ‌కీయంగా చంద్ర బాబు ఈ జిల్లాపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా జిల్లాలో టీడీపీ త‌ర‌ఫున కీలకంగా వ్యవ‌హ‌రిస్తూ.. జ‌గ‌న్‌ను బ‌ద్నాం చేయ‌డంలో ముందున్న సీఎం ర‌మేష్‌కు మ‌రోసారి రాజ్యస‌భ టికెట్‌ను రెన్యువ‌ల్ చేయ‌డం వెనుక కూడా ఇదే కార‌ణం ఉండి ఉంటుంద‌ని టీడీపీలో పెద్ద చ‌ర్చకూడా జ‌రిగింది. ఇక‌, కాంగ్రెస్ నేత‌, క‌డ‌ప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రా రెడ్డిని కూడా చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించ‌డం వెనుక ఇదే ర‌హ‌స్యం దాగి ఉంద‌ని అంద‌రికీ తెలిసిందే.

రంగంలోకి మంత్రి ఆది….

ఇక‌, క‌డ‌ప గ‌డ‌ప‌లో సైకిల్‌ను గిర్రున తిప్పాల‌న్న బాబు వ్యూహం స‌క్సెస్ అయ్యేందుకు ఇప్పటికే వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డిని బాబు వాడుతున్నార‌ని తెలుస్తోంది. జిల్లాలో వైసీపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పని చేస్తున్న ఆదినారాయణరెడ్డి… ఇందుకోసం బ్లూ ప్రింట్ ను కూడా సిద్ధం చేశారని సమాచారం. కొద్ది రోజుల క్రితం ఈ బ్లూ ప్రింట్ ను చంద్రబాబుకు వివరించిన మంత్రి ఆదినారాయణరెడ్డి… ఆయనతో కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

కొన్ని నెలలు ముందుగానే…..

ఈ ఆపరేషన్ లో భాగంగా టీడీపీ అధినేతకు మంత్రి ఆది కొన్ని కీలక సూచనలు చేశారట. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికను కొన్ని నెలల ముందుగానే ఖరారు చేయాలన్నది ఈ ఆపరేషన్ లో కీలకమైన అంశమని తెలుస్తోంది. ఇలా మొత్తంగా చంద్రబాబు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను దెబ్బకొట్టేందుకు ఆయ‌న సొంత జిల్లానే ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం అంటున్నారు టీడీపీ నేత‌లు. ముఖ్యంగా జ‌మ్మల‌మ‌డుగు సీటు కోసం పోటీప‌డుతోన్న ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డిల‌లో ఒక‌రిని ఎమ్మెల్యేగాను, మ‌రొక‌రిని ఎంపీగాను పోటీ చేయించాల‌ని చూస్తున్నారు.

మైనారిటీకి సీటు ఇచ్చి…..

ఇక క‌డ‌ప సీటు కోసం మైనార్టీ క్యాండెట్‌ను పోటీ పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు. క‌మలాపురం, మైదుకూరులో ఈ సారి టీడీపీ జెండా ఎగ‌ర‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఓవ‌రాల్‌గా చూస్తే జిల్లాలో ఉన్న 10 ఎమ్మెల్యే సీట్లలో క‌నీసం 5 సీట్లను గెలుచుకోవ‌డ‌మే టీడీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇటు జ‌గ‌న్ కూడా సొంత జిల్లాలో ప‌ట్టుకోసం త‌న ప్లాన్లు తాను వేస్తున్నాడు. మ‌రి ఈ రెండు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల్లో ఎవరు విజ‌యం సాధిస్తారో చూడాలి.

1 Comment on క‌డ‌ప‌పై టీడీపీ ఆప‌రేష‌న్‌.. రీజ‌న్ ఇదే!

Leave a Reply

Your email address will not be published.


*