ఏనుగమ్మ…..ఏనుగు….!!!

తెలంగాణలో సీట్ల లెక్కలు తేలుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ 107 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. ఇక మహాకూటమిలోనూ సీట్ల లెక్కలు తేలాయి. పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయడంలో పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 75 మంది అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ కూడా 9 మంది అభ్యర్థులను ప్రకటించేసింది. సీపీఐ పోటీ చేసే 3 స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేశారు. టీజేఎస్ కు అభ్యర్థులను ఖరారు. చేసింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న రెబల్స్ బెడద ఆయా పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. టిక్కెట్లు దొరకని ఆశావహులు రెబెల్స్ గా పోటీ చేసే ప్రధాన పార్టీల విజయవకాశాలకు దెబ్బపడుతుందని భయపడుతున్నాయి.

ఇండిపెండెంట్ గా కంటే ఏనుగు గుర్తే బెటర్

పార్టీల టిక్కెట్లు ఆశించి దొరకని వారు స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, గెలుపుపై ధీమాగా ఉన్న అభ్యర్థులు కొత్త దారులు వెతుకుతున్నారు. మాయావతి నేతృత్వంలోని జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీల్లో టిక్కెట్లు దక్కని వారు ఈ మేరకు ఆలోచిస్తున్నారు. టీఆర్ఎస్ లో సిట్టింగులుగా ఉండి టిక్కెట్లు దక్కని బాబుమోహన్, బొడిగె శోభ భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. అయితే, బీజేపీ కూడా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. దీంతో బీజేపీలో ఖాళీ లేకపోవడంతో రెబల్స్ బీఎస్పీ ఏనుగు వైపు చూస్తున్నారు. బీఎస్పీ తరపున పోటీ చేస్తే దళిత ఓటు బ్యాంకు కూడా కలిసి వస్తుందని నమ్మకంగా ఉన్నారు.

ఇప్పటికే ప్రకటించిన అరవింద్ రెడ్డి

గత ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో కొనసాగిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేతలు ఇంద్రకరణ్ రెడ్డి(నిర్మల్), కోనేరు కొనప్ప(సిర్పూర్ కాగజ్ నగర్) ఇతర పార్టీల్లో ఖాళీలు లేకపోవడంతో చివరి నిమిషంలో బీఎస్పీలో చేరారు. బీఎస్పీ టిక్కెట్ పైన పోటీచేసిన వీరు ఇద్దరూ విజయం సాధించారు. తర్వాత వారు టీఆర్ఎస్ లోకి పోయారు. వీరిద్దరే ఈ ఎన్నికల్లో రెబెల్స్ కి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిలానే బీఎస్పీ తరపున పోటీ చేసి తమ బలం చూపించుకోవాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా బీఎస్పీ నేతలతో వారు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మంచిర్యాలీ కాంగ్రెస్ టిక్కెట్ దక్కని అరవింద్ రెడ్డి ఇప్పటికే బీఎస్పీ లేదా బీజేపీ తరపున పోటీ చేస్తానని ప్రకటించారు.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా…

ఉత్తర తెలంగాణకు చెందిన నేతలు ఎక్కువగా బీఎస్పీ వైపు చూస్తున్నారు. దళిత ఓటు బ్యాంకు కలిసివచ్చే అవకాశం ఉండటం, జాతీయ పార్టీగా గుర్తింపు ఉండటం, ఏనుగు గుర్తు చాలావరకు ప్రజలకు ఇప్పటికే తెలిపి ఉండటం వంటి కారణాలతో ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కంటే బీఎస్పీ నుంచి పోటీ చేస్తేనే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని రెబల్స్ భావిస్తున్నారు. పైగా పార్టీ అధినేత్రి మాయావతి కూడా రాష్ట్రంలో బీఎస్పీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని భావిస్తున్నారు. తాము రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంతపురం బాలయ్య ప్రకటించారు. మొత్తానికి బీఎస్పీ ఏనుగు ఎవరిని తొక్కేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*