నాడు బాల‌య్య‌ క‌న్నేసిన చోట… నేడు టీడీపీకి దిక్కులేదు…!

గ్రేట‌ర్ హైద‌రాబ‌ద్‌లో శేర్‌లింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం అన్ని పార్టీల‌కు అత్యంత కీల‌కం.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్ర‌ముఖ సంస్థ‌లు ఉన్నాయి.. గ‌త ఎన్నిక‌ల‌కు.. ఇప్ప‌టి ప‌రిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ఇక్క‌డి నుంచి టికెట్ ఆశించేవారి సంఖ్య కాస్త ఎక్కువ‌గా ఉంది. అన్ని పార్టీల్లోనూ టికెట్ రేసులో చాలా మందే ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆరికెపూడి గాంధీ బ‌రిలోకి దిగి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌గౌడ్‌పై విజయం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో గాంధీకి రికార్డుస్థాయిలో 71 వేల పైచిలుకు మెజార్టీ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో ప‌లువురు టీడీపీ ఎమ్మెల్యేలు కారెక్కేశారు. ఈ నేప‌థ్యంలోనే గాంధీ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు టికెట్ వీరిద్ద‌రిలో ఎవ‌రికి వ‌స్తుంద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మిగిలింది. ఈ సీటు సీఎం కేసీఆర్ ఎలా స‌ర్దుబాబు చేస్తార‌న్న‌ది అంద‌రిలో ఉత్కంఠ రేపుతోంది.

ఓసారి కాంగ్రెస్…మరోసారి టీడీపీ…..

నిజానికి, 2009లో నియోజక వర్గాల పునర్విభజనకు ముందు శేరిలింగంపల్లి ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. అయితే పునర్విభజన తర్వాత 10 డివిజన్‌లతో పాటు పాక్షికంగా రెండు డివిజన్‌లతో పూర్తిస్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇక్క‌డ‌ దాదాపు 10 లక్షలకు పైగా జనాభా ఉంది. ఇక 6.20 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన త‌ర్వాత జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లో ఓ సారి కాంగ్రెస్‌, ఆ త‌ర్వాత టీడీపీ విజ‌యం సాధించాయి. 2009లో టీడీపీ ఓడినా చాలా స్వ‌ల్ప తేడాతో మాత్ర‌మే ఓడిపోయింది. అది కూడా నాడు లోక్‌స‌త్తా ఇక్క‌డ ఏకంగా 30 వేల పైచిలుకు ఓట్లు చీల్చ‌డంతోనే టీడీపీ ఓడాల్సి వ‌చ్చింది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి బాల‌కృష్ణ‌, లోకేష్ పేర్లు కూడా రేసులో వినిపించాయి.

ఐటీ రంగానికి…..

వాస్త‌వంగా చూస్తే గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌గానే చెప్పాలి. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున మొవ్వా సత్యనారాయణపై కాంగ్రెస్‌ అభ్యర్థి భిక్షపతి యాదవ్ 1,227 ఓట్ల తేడాతో గెలిచారు. 2014ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆరికెపూడి గాంధీ… టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌గౌడ్‌పై విజయం సాధించారు. అయితే, ఇప్పుడు వీరిద్ద‌రూ టీఆర్ఎస్‌లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఐటీ రంగానికి గుండెకాయ‌లా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాగైనా గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో అధికార టీఆర్ఎస్‌, కాంగ్రెస్ , టీడీపీలు ఉన్నాయి.

మొవ్వాను మళ్లీ తీసుకొచ్చి…..

ఇక్క‌డి టీడీపీ నాయ‌కులు మ‌ళ్లీ మొవ్వా స‌త్య‌నారాయ‌ణ‌ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇస్తే టీడీపీ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కంతో వారు ఉన్నారు. ఒక‌వేళ ఎవ‌రితోనైనా పొత్తుపెట్టుకున్నా.. టీడీపీ ఈ సీటును వ‌దులుకునే ప‌రిస్థితి ఉండ‌దు. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని డివిజ‌న్ల‌లో టీఆర్ఎస్ గెలిచింది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ఆ పార్టీ మ‌రో కీల‌క నేత‌కు టికెట్ కేటాయించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం మ‌రో ప్ర‌ముఖుడు రంగంలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌ టీడీపీ నుంచి మాత్రం అరవింద్‌ కుమార్‌ గౌడ్ పేరు విన‌బ‌డుతోంది. ఏదేమైనా చంద్ర‌బాబు ప‌దే ప‌దే తాను ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశాన‌ని సూచిక‌గా చెప్పుకునే హైటెక్ సీటీతో పాటు ఐటీ రంగం విస్త‌రించి ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఇప్పుడు త‌న ప‌రువును కాపాడుకునేందుకు పోటీ ప‌డాల్సిన స్థితికి ప‌డిపోయింది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఇక్క‌డ ఏమైనాస సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుందా ? లేదా ? చేతులు ఎత్తేస్తుందా ? అన్న‌ది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*