సుమన్ రోట్టె విరిగింది.. ఎక్క‌డ ప‌డిందో తెలుసా?

బాల్క సుమ‌న్‌. తెలంగాణ ప్ర‌జ‌లకు ఈ పేరు కొత్త‌కాదు. ఇప్పుడు ఆయ‌నకు రాజ‌కీయంగా మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజ‌కీయంగా వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న‌కు కేబినెట్ బెర్త్‌ను ఇప్ప‌టికే ఖ‌రారు చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ ఉద్య‌మంలో విద్యార్థుల‌ను పెద్ద ఎత్తున స‌మీక‌రిం చాడు. వారితో పెద్ద ఎత్తున ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేశాడు. ఓయూలో ఉద్య‌మాన్ని ఉధృతం చేయ‌టంలో సుమ‌న్ కీల‌క పాత్ర పోషించాడు. ముఖ్యంగా తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మంలో సుమ‌న్ కీల‌క పాత్ర పోషించాడు.

కేసీఆర్ దృష్టిలో పడి….

ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేప‌ట్ట‌డంలో ఆయ‌న నిరంత‌రం కృషి చేశారు. ఇక రాష్ట్రం కోసం ప‌లువురు విద్యార్థులు త‌మ ప్రాణాలను అర్పించ‌డంతో, విద్యార్థులెవ‌రూ ఆత్మ‌బ‌లిదానాలు చేసుకోవ‌ద్దంటూ వారికి ధైర్యం చెప్ప‌టంలోనూ సుమ‌న్ చాలా ప్ర‌య‌త్నాలు చేశాడు. దాంతో పాటు కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష స‌మయంలోనూ టీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ తెచ్చేందుకు కృషి చేశాడు. దీంతో బాల్క‌… తెలంగాణ ఉద్య‌మ నాయకుడు, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ దృష్టిలో ప‌డ్డారు. దీంతో యువ‌కుడైన బాల్క‌ను కేసీఆర్ చేర‌దీశారు. పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పించారు. టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మించారు.

ఎంపీ టిక్కెట్ ఇచ్చి…..

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉద్య‌మ‌కారుల‌తో పాటు విద్యార్థి నాయ‌కుల‌కు కూడా టీఆర్ఎస్ పార్టీ టికెట్ల‌ను కేటాయించింది. గాద‌రి కిశోర్, పిడ‌మ‌ర్తి ర‌వి, బాల్క సుమ‌న్, ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ల‌కు టికెట్లు ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే బాల్క సుమ‌న్ కు అత్యంత కీల‌క‌మైన, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న‌ పెద్ద‌ప‌ల్లి ఎంపీ టికెట్ ఇవ్వ‌డం అప్ప‌ట్లో తీవ్ర‌ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే వంద‌ల కోట్ల ఆస్తులు ఉన్న మాజీ ఎంపీ వివేక్ పై పోటీ చేయ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు. ఖ‌చ్ఛితంగా ఓడిపోయే సీటునే సుమ‌న్ కు క‌ట్ట‌బెట్టారంటూ ప్ర‌చారం సాగింది.

సుమన్ ప్రచారం…..

కానీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో వంద‌ల కోట్లు ఒక‌వైపు, వంద‌ల కేసులు మ‌రో వైపు మీరు ఎటువైపు అంటూ సుమ‌న్ చేసిన ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి బాగా దూసుకెళ్లింది. దీంతో అనూహ్యంగా మాజీ ఎంపీ వివేక్ ను ఓడించి ఎంపీగా ఎన్నిక‌య్యారు సుమ‌న్. అప్ప‌టి నుంచి కూడా బాల్క‌.. తెలంగాణ వాయిస్‌ను పార్ల‌మెంటులో బాగానే వినిపిస్తూ వ‌స్తున్నారు. ఇక‌, ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో పెద్దప‌ల్లి నుంచి పోటీ చేసిన వివేక్‌.. టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే.. పార్ల‌మెంటులో టీఆర్ ఎస్ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్న బాల్క‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ టికెట్ కేటాయించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్టుగా ప్ర‌చారం సాగుతోంది.

సుమన్ కు చెప్పేశారంటూ…..

అంతేకాదు, ఆయ‌న‌ను గెలిపించుకోవ‌డం ద్వారా కేబినెట్‌లోకి కూడా తీసుకోవాల‌ని కేసీఆర్ ప‌క్కా స్కెచ్ సిద్ధం చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌యంపై సుమ‌న్ కు చెప్పేశార‌ని, ఆయ‌న కూడా అసెంబ్లీ స్థానం వేట‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే ఎక్క‌డ నుంచి పోటీ చేస్తార‌నే దానిపై ప్ర‌క‌ట‌న రావ‌చ్చున‌ని తెలుస్తోంది. ఇక యువ నాయ‌కుడికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న కేసీఆర్, వ‌చ్చే ఎన్నిక‌ల్లో సుమ‌న్ ను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేయ‌బోతుండ‌టం మంచి ప‌రిణామ‌మే అంటున్నారు సుమ‌న్ అభిమానులు. సో.. బాల్క సుమన్ రొట్టె విరిగి నేతిలో ప‌డుతోంద‌న్న మాట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*