కర్ణాటకలో కాయ్ రాజా కాయ్ …!

కాదేది జూదానికి అనర్హం అనొచ్చేమో. కర్ణాటక ఎన్నికల సిత్రం ఇలా మొదలైందో లేదో బెట్టింగ్ రాజాలు అలా వాలిపోయారు. ఆన్ లైన్లో , ఆఫ్ లైన్లో గెలుపెవరిది అనే అంశంపై జోరుగా బెట్టింగ్ లు నడుస్తున్నాయి. 50 వేల రూపాయలనుంచి లక్షలు కోట్లలలో ఈ వ్యవహారం సాగిపోతుంది. ఈ సీజన్ లో సాగుతున్న ఐపీఎల్ బెట్టింగ్ లను మించి బెట్టింగ్ బంగార్రాజులు కర్ణాటక ఎన్నికలను బాగా ఆస్వాదిస్తున్నారు. ఎన్నికల అక్రమాలకే చెక్ పెట్టలేని ఈసీ యథేచ్ఛగా సాగుతున్న ఈ దందాను చూసి చూడనట్లే వదిలేస్తుంది. ఎందుకంటే ఈ పందాలు అన్ని అత్యంత గోప్యంగా సాగడమే మరి.

బెట్టింగ్ లలోను తెలుగు వారిదే హవా …

కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్లది నిర్ణయాత్మక పాత్ర. సుమారు కోటిమంది తెలుగువారు కర్నాటక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తారన్నది ఒక అంచనా. ఈ లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పందెం రాయుళ్ళ సందడిలోనూ తెలుగువారే దూసుకుపోతున్నారని విశ్లేషకుల అంచనా. కర్ణాటకలో ముఖ్యంగా బెంగుళూరు కేంద్రంగా నడిచే పేకాట క్లబ్ లు పబ్ లు నిర్వహించేవారిలో అత్యధికశాతం తెలుగు బడా బాబులే. జూద క్రీడను బాగా ఆస్వాదించే దక్షిణాది క్యాష్ పార్టీలన్నీ బెంగుళూరు చుట్టూ తిరుగుతూ వుంటారు. ఇప్పుడు వీరందరూ ఎన్నికల్లో గెలుపెవరిది అనే అంశంలో వివిధ రకాల పందాలు ఆడుతున్నారు.

బెంగుళూరు లో మకాం వేసిన బుకీలు …

నియోజక వర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? ఎవరు ముఖ్యమంత్రి కావొచ్చు అనే అంశాలపై ఈ పందెం దందా సాగుతుంది. ఇక బుకీలంతా బెంగుళూరు లో మకాం వేస్తే పంటర్లలో టెన్షన్ పీక్ కి వెళ్లిన వారు అక్కడికే వెళ్ళి దగ్గరుండి సర్వేలు చేసుకుంటున్నారు. మరికొందరు పార్టీలు చేసే తాజా సర్వేలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ పందాలు మారుస్తున్నారు. ఇలా కన్నడ రాజకీయాలు ఏ సంబంధం లేని వారికి కాసుల పంట పండిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*