రాకుంటే….పొమ్మంటారనా?

బెజవాడ ఒకప్పుడు వాణిజ్య రాజధాని. రాజకీయ రాజధానిగానూ పేరుంది. బెజవాడలో రాష్ట్ర రాజకీయాలను శాసించే నేతలుండేవాళ్లు. బెజవాడ కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలు నడిచేవని అప్పట్లో పేరుండేది. అయితే ఆ తర్వాత క్రమంగా విజయవాడ రాజకీయ కేంద్రంగా పేరు చెరుపుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు హైదరాబాద్ కేంద్రంగానే పాలిటిక్స్ నడిచేవి. కాని ఇప్పుడు బెజవాడకు మళ్లీ ఆ కళ వచ్చేసినట్లుంది. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి నాలుగేళ్లవుతున్నా ఇంకా అనేక పార్టీలూ నిన్న మొన్నటి వరకూ హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు నడిపేవి. కాని ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇప్పుడు అన్ని పార్టీలూ తమ దుకాణాన్ని బెజవాడకు మార్చేశాయి.

ముందుంది టీడీపీనే….

అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముందు ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిందనే చెప్పాలి. అధికారంలో ఉండటం, తరచూ పార్టీ సమావేశాలను నిర్వహించాల్సి రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులోని పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా చేసుకుని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమరావతికి దగ్గరలోనే రాష్ట్ర పార్టీ కార్యాలయ నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. టీడీపీ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గత మూడేళ్ల నుంచి విజయవాడ కేంద్రంగానే జరుపుతుందని చెప్పాలి.

ఆగస్టులో జగన్ గృహప్రవేశం….

ఇక ప్రతిపక్ష నేత జగన్ మాత్రం నిన్న మొన్నటి వరకూ విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. పార్టీ సమావేశాలన్నీ హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతుండేవి. ఏపీ నుంచి నేతలందరూ సమావేశాల కోసం హైదరాబాద్ పరుగులు తీయాల్సి వచ్చేది. దీనిపై జగన్ విమర్శలనూ ఎదుర్కొన్నారు. కాని కొన్నాళ్ల క్రితం తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని బందరు రోడ్డులో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే సమావేశాలు జరుగుతున్నాయి. ఇక జగన్ పాదయాత్రలో ఉండటంతో మొత్తం ఏపీలోనే ఆ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇక తాడేపల్లిలో జగన్ సొంత ఇల్లు, పార్టీ కార్యాలయ నిర్మాణపనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఆగస్టులో గృహప్రవేశం చేయడానికి రెడీ అవుతున్నారు జగన్.

పవన్ నేను సయితం అంటూ….

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సయితం బెజవాడకు మకాం మార్చేశారు. జనసేనాని గుంటూరు జిల్లాలోని కాజా గ్రామం సమీపంలో ఇంటిని, పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు సిద్దమయ్యారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. పార్టీ కార్యాలయం, ఇంటి నిర్మాణం ఆలస్యమవుతుందని భావించిన పవన్ విజయవాడలో పటమటలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడే పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీలు కూడా పార్టీ కార్యక్రమాలను బెజవాడ నుంచే షురూ చేస్తున్నాయి. మొత్తం మీద సెంటిమెంట్ అనుకున్నారో…. ప్రజలు ప్రశ్నిస్తారనుకున్నారో తెలియదు కాని అందరు నేతలూ బెజవాడకు మకాం మార్చేశారు. దీంతో బెజవాడ రాజకీయ రాజధానిగా చాన్నాళ్ల తర్వాత మారిందనే చెప్పొచ్చు.