కమలం కోలుకోవడం కష్టమే…!

ఎన్నిక‌ల ముంగిట బీజేపీని క‌ష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.. ఒక స‌మ‌స్య అలా ఉండ‌గానే.. మ‌రొక‌టి వ‌చ్చి మీద‌ప‌డుతోంది.. ఇప్ప‌టికే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా న‌మ్మ‌క‌ద్రోహానికి పాల్ప‌డింద‌న్న ఆగ్ర‌హంలో ఆంధ్రులు ఉన్నారు. తాజాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు సాధ్యం కాద‌ని కేంద్రం తేల్చి చెప్ప‌డంతో తెలుగు ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.. ఏపీలోని క‌డ‌ప‌లో, తెలంగాణ‌లోని బ‌య్యారంలో స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. త‌మ‌కు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుప‌డుతాయ‌ని భావించారు. కానీ, రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తెలుగు ప్ర‌జ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌మ‌ల‌ద‌ళంపై ఉక్కుపాదం మోప‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

వ్యతిరేకత మరింత…..

ఈ ప‌రిణామంతో ఏపీలో ఇప్ప‌టికే బీజేపీపై ఉన్న వ్య‌తిరేక‌త మ‌రింత తీవ్రం కానుంది. ఎన్నిక‌ల వేళ బీజేపీ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం ఆ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసుకున్న సెల్ఫ్‌గోల్‌గా రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. విభజన చట్టంలోని అంశాల అమలుపై కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో కేంద్రం కూడా సుప్రీం కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. క‌డ‌ప‌, బయ్యారంలో ఉక్కు ప‌రిశ్ర‌మ‌ల‌ ఏర్పాటు సాధ్యం కాదంటూ అందులో పేర్కొంది. రాష్ట్ర‌ పునర్విభజన చట్టంలో కేవలం స్టీల్ ప్లాంట్ల‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు పరిశీలించమని మాత్రమే ఉందని కేంద్రం అఫిడ‌విట్‌లో పేర్కొంది.

పరిశీలించి మాత్రమే…..

నిజానికి ప‌రిశ్ర‌మ‌ల‌ ఏర్పాటు సాధ్యం కాద‌ని 2014లోనే చెప్పామని కేంద్రం పేర్కొంది. అయినా ఆయా రాష్ట్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఇచ్చిన‌ నివేదికలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఏర్పాటు సాధ్యం కాద‌ని నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం చెప్పింది. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆంధ్రులు బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కేంద్రంపై నిరంత‌ర కార్యాచ‌ర‌ణ‌తో ఉద్య‌మిస్తున్నారు.

కన్నా కలసి చెప్పినా…..

మోడీ ఆంధ్రుల‌కు న‌మ్మ‌క‌ద్రోహం చేశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక తెలంగాణ‌లో మాత్రం బీజేపీతోపాటు అధికార టీఆర్ఎస్‌పై కూడా ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. బ‌య్యారంలో ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటుకు కేంద్రంపై టీఆర్ఎస్ పెద్ద‌గా ఒత్తిడి తేలేదు. దీంతో ప్ర‌జ‌లు గులాబీ పార్టీపై కూడా ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్నారు. ద‌క్షిణాదిన ఎలాగైనా పాగా వేయాల‌ని యాత్ర మొద‌లు పెట్టిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈనెల 22న ఆయ‌న హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు. ఇదే క్ర‌మంలో ఏపీలో కూడా ఆయ‌న ప‌ర్య‌ట‌న ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. ఓవైపు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఢిల్లీకి వెళ్లి అటు ప్ర‌ధాని మోడీని, ఇటు అమిత్‌షాను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన రోజే కేంద్రం ఈ షాకింగ్ నిర్ణ‌యం తీసుకోడంతో రాష్ట్ర నేత‌లు మ‌రింత ఆందోళ‌న‌కు గ‌ర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. నూత‌న అధ్య‌క్షుడు క‌న్నాకు ఈ విష‌యంలో ఆంధ్రుల‌ను మెప్పించ‌డం క‌ష్ట‌మే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*