ఏపీలో బీజేపీ ప్లాన్ “బి” ఇదే…!

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్లాన్ బీ అమలుకు రెడీ అయింది. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ, తాము చేస్తున్న అభివృద్థి పనులను ప్రజలకు వివరించాలని రెడీ అయిపోయింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్షల పేరిట తమ పార్టీపైనా, ప్రధాని మోదీ పైనా చేస్తున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కేంద్ర నాయకత్వం ఎలాంటి వ్యూహంతో వెళ్లాలో నూరిపోసింది. ఆ ప్రకారమే ఇప్పుడు ఏపీలో బీజేపీ నేతలు ఆ వ్యూహం అమలుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు.

కేంద్రమంత్రుల పర్యటనతో…..

బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క కేంద్రమంత్రి కూడా రాలేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఆయన అధికారిక కార్యక్రమాలకే పరిమితమయిపోయారు. తాజాగా నిన్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దాదాపు పది నెలల తర్వాత పోలవరం సందర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పెరిగిన అంచనాలు, భూసేకరణ వంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పులను గడ్కరీ ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. భూసేకరణ పరిహారం పెరిగినా, భూమి విస్తీర్ణం ఎందుకు పెరిగిందన్న అనుమానాలను గడ్కరీ వ్యక్తం చేసి టీడీపీని కొంత ఇబ్బందుల్లోకి నెట్టారు. ఇలా కేంద్ర మంత్రి రాకతో తమకు నిధులు వస్తాయని భావించిన తెలుగుదేశం ప్రభుత్వానికి నిరాశ మిగలింది. అంతే కాకుండా పోలవరం విషయంలో లోటుపాట్లను ఎత్తి చూపడంలో గడ్కరీ సక్సెస్ అయ్యారంటున్నారు.

ఎయిమ్స్ విష‍యంలో…..

అలాగే ఈనెల 13వ తేదీన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఆయన నేరుగా మంగళగిరికి వెళ్లి ఎయిమ్స్ పురోగతిపై సమీక్షించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ను రాష్ట్రానికి ఇచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే అది పూర్తి కాలేదని జేపీ నడ్డా చెప్పనున్నారు. కేవలం వంద ఎకరాలు భూమి ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మాణానికి చేసిందేమీ లేదన్నది బీజేపీ వాదన. దీంతో నడ్డా ఏపీకి వచ్చి ఎయిమ్స్ పైనా ప్రజలకు క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలిసింది.

సంస్థలు మంజూరు చేసినా…..

అలాగే ఆంధ్రప్రదేశ్ కు మంజూరైన వివిధ విద్యాసంస్థల పురోగతిని ఈ నెలాఖరులో కేంద్ర మానవవనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమీక్షించనున్నారు. ఏపీకి పలు విద్యాసంస్థలు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేని కారణంగానే వాటిలో పురోగతి లేదన్నది బీజేపీ వాదన. అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీకి కూడా త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇలా కేంద్ర మంత్రులు వరుసగా వచ్చి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడమే కాకుండా నాలుగేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూసే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇలా బీజేపీ ఏపీలో నిలదొక్కుకోవడానికి, టీడీపీని డైలమాలో పడేసేందుకు ప్లాన్ బి ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*