నాయకులను మార్చండి…. ప్లీజ్..!

అవును! రాజ‌కీయాల్లో ఉన్న వారికి అనుభ‌వం ఒక్క‌టే కాదు.. వాక్చాతుర్యం కూడా ఉండి తీరాలి! ఇక‌, ఎదుటి పార్టీని ఎదు ర్కొనేందుకు గ‌ట్టి ప‌ట్టుండాలి. ప్ర‌తి ఒక్క విమ‌ర్శ‌ను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మ‌కంగా ఎదురుదాడి చేయ‌గ‌ల‌గాలి. మ‌రి ఇవ‌న్నీ.. బీజేపీ నాయ‌కుల‌కు ఉన్నాయా? ముఖ్యంగా జాతీయ అధికార ప్ర‌తినిధిగా ప‌రుగులు పెడుతున్న ప్ర‌చారం పొందుతున్న జీవీఎల్ న‌ర‌సింహారావుకు ఈ ల‌క్ష‌ణాల్లో కొన్న‌యినా ఉన్నాయా? అనేది ప్ర‌ధాన సందేహం. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న మీడియాలో పెద్ద ఎత్తున క‌నిపిస్తున్నాడు. టీడీపీనేత‌ల‌పై జ‌రుగుతున్న ఐటీ దాడుల‌కు సంబంధించి కొంత మేరకు ఆయ‌న స్పందిస్తున్నారు. ప్ర‌తి విమ‌ర్శ‌లు చేస్తున్నారు కూడా! అయితే, జీవీఎల్ ప్ర‌య‌త్నాల‌న్నీ కూడా ప‌స‌లేని విమ‌ర్శ‌లే న‌న్నట్టుగా సాగుతున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

కేంద్రం నుంచి స్పందన ఏదీ…?

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని ఒక జిల్లా మొత్తం తుఫాను దెబ్బ‌కు చివురు టాకులా ఒణికిపోయింది. ఈ సమయంలో పార్టీలన్నీ కూడా దాదాపుగా ఈ విషయం గురించే మాట్లాడుతున్నాయి. పైగా.. తుఫాను బాధితులకు కేంద్రం కనీస సహాయం కూడా అందించలేదనే విమ‌ర్శ‌లు గుప్పు మంటున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం తుఫాను న‌ష్టంపై కేంద్రానికి లేఖ‌రాసినా. కూడా ఇప్ప‌టికీ స్పంద‌న క‌నిపించ‌లేదు. ఇలాంటి నేపథ్యంలో.. అసలు తుఫాను గురించి నోరెత్తకుండా.. ఎంతసేపూ సీఎం రమేష్ మీద జరిగిన ఐటీదాడుల గురించి రోజుకు రెండుసార్లు మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుతుండడం అక్కడ ఆ పార్టీకే ఇబ్బందిగా ఉంది. ఆంద్రప్రదేశ్ కు చెందిన జీవీఎల్ నరసింహారావు.. కేవలం ఏపీ వ్యవహారాలతో ఊరుకోవడం లేదు.

తెలంగాణాలోనూ…..

తెలంగాణ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నాడు. పొత్తులకు దిక్కులేకపోయిన నేప‌థ్యంలో ఏం చేయాలో తెలియ‌క పార్టీ స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఇక‌, తాజాగా రాహుల్ ప‌ర్య‌ట‌న‌తో తెలంగాణ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. మోడీ, కేసీఆర్ ఒక‌టేన‌ని ఆయ‌న విమ‌ర్శించారు. దీనిపై ఘాటైన కౌంట‌ర్ ఇవ్వ‌కుండా.. ఏదో మొక్కుబ‌డి విమ‌ర్శ ల‌తోను, ప‌స‌లేని కామెంట్ల‌తోనూ జీవీఎల్ స‌రిపెడుతున్నాడ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఏ మొహం పెట్టుకుని రాహుల్ ఏపీ లోకి, తెలంగాణాలోకి అడుగుపెడ‌తాడంటూ.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పాతి చింత‌కాయ్ ప‌చ్చ‌డినే త‌ల‌పించాయి. అలా పాచిపోయిన అంశాల ఎజెండాతో అంతకు మించి కాంగ్రెస్ ద్రోహాలు వేరే ఏమీ లేవన్నట్లుగా జీవీఎల్ మాట్లాడడం ఇక్కడి నాయకులకు ఇబ్బందిగా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలమైన నాయకత్వం లేదని కూడా జీవీఎల్ అంటున్నారు. మ‌రి తెలంగాణాలో కానీ, ఏపీలో కానీ.. బీజేపీకి స‌రైన నాయ‌క‌త్వం ఉందా? అంటే అది కూడాలేదు. మ‌రి ఈ స‌మ‌యంలో జీవీఎల్ వంటి వారి వ‌ల్ల ఏంటి ప్ర‌యోజ‌నం.. నాయ‌కుడిని మార్చండి!! అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*