జారి పోతున్నారే…. పారాహుషార్….!!

ప్రధాని నరేంద్రమోదీని గద్దెదించడానికి విపక్షాలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తుండగా, ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల్లో మాత్రం తలోదారి చూసుకుంటున్నాయి. బీహార్ రాజకీయం దేశమంతటా విస్తరిస్తుందేమోనన్న భయం కమలనాధులను పట్టిపీడిస్తుంది. బీహార్ లో గత ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్ జనశక్త పార్టీలు కలసి పోటీ చేశాయి. అలాగే రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యు, కాంగ్రెస్ లు మహాకూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. ఆ ఎన్నికల ఫలితాలు కమలం పార్టీకే అనుకూలంగా వచ్చాయి.

గత ఎన్నికల్లో……

మొత్తం 40 స్థానాలున్న బీహార్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 22, రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ ఆరు, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. గత పార్లమెంటు ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ జేడీయూ కేవలం రెండు స్థానాలతోనే సరిపుచ్చుకుంది. అయితే ఈసారి ఈక్వేషన్స్ మారాయి. జేడీయు అధినేత నితీష్ కుమార్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ యాదవ్ తో విభేదించి ఆయన బీజేపీతో జట్టుకట్టారు. లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడంతో ఆయన మహాకూటమి నుంచి బయటకు వచ్చి కమలంతో దోస్తీ కట్టి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

బీజేపీ, జేడీయూలు కలసి…..

అయితే వచ్చే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నితీష్ కుమార్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల మధ్య చర్చలు ఇటీవల జరిగాయి. ఈ చర్చలు ఫలప్రదం అయ్యాయి. బీజేపీకి 22 సిట్టింగ్ స్థానాలు, జేడీయూకు 12 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఇందుకు జేడీయూ అధినేత నితీష్ అంగీకరించకపోయినా ఇంకా సీట్ల సంఖ్య విషయంలో స్పష్టత రాలేదు. అయితే 34 స్థానాల్లో జేడీయూ, బీజేపీ పోటీ చేసి మిగిలిన ఆరుస్థానాలకు మిత్రపక్షాలకు ఇవ్వాలని నిర్ణయించడం మిత్రుల్లో మనస్పర్థలకు కారణమయింది.

ఈ రెండు పార్టీలూ…..

గత ఎన్నికల్లో తాము ఆరు సీట్లు గెలిస్తే ఇప్పుడు తగ్గిస్తే ఎలా అంటూ లోక్ జనశక్తి పార్టీ ప్రశ్నిస్తుంది. అలాగే తాము మూడింటిలో గత ఎన్నికల్లో గెలిచామని ఈసారి సీట్ల సంఖ్య పెంచాలంటున్నారు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ నేతలు. బీజేపీ ఇలా నిర్ణయిస్తే తాము ఒంటరిపోరుకు దిగుతామని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ నేత, ప్రస్తుత కేంద్రమంత్రి ఉపేంద్ర కుశ్వాహా ఎల్.జే.డి అధినేత శరద్ యాదవ్ ను కలసి చర్చించడం కలకలం రేపుతోంది. బీహార్ లో మహాకూటమిలో కుశ్వాహా పార్టీ చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ విలాస్ పాశ్వాన్ కూడా మరో దారి చూసుకునే పనిలో ఉన్నారని సమాచారం. మొత్తం మీద మిత్రులు దూరమవుతుండటం కమలనాధులను కలవరపెట్టే అంశమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*