కమలం కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది

బీజేపీని కాదని దూరం పెట్టి శత్రుభావం పెంచుకున్న తెలుగుదేశం పార్టీకి ఇక కష్టకాలమే. ఎత్తుగడలతో కక్ష సాధింపునకు భారతీయ జనతాపార్టీ అడుగులు కదుపుతోంది. ఎన్నికలకు ఏడాదిలోపు గడువు ఉన్న నేపథ్యంలో బాజపా కదలికలు వ్యూహాత్మక పంథాలో సాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం, పార్టీ కలిసి చేస్తున్న ప్రచారంతో నైతికస్థైర్యం కోల్పోయిన కమల శ్రేణులకు జవసత్తువలు కల్పించేలా అగ్రనాయకత్వం పథక రచన చేస్తోంది. ప్రత్యర్థిపై దాడికి అస్త్రశస్త్రాలు సమకూర్చబోతోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వము. రెండు లక్షలకోట్ల రూపాయలు ఇచ్చేశామంటూ నెత్తీ నోరు కొట్టుకుంటున్నా బీజేపీని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు. దాంతో ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రంతో సెంటిమెంటుగా ఉన్న అంశాలను ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తూ ఆ క్రెడిట్ ను పార్టీ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది.

పాజిటివ్ దాడి …

ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి మేము కేంద్రానికి రాం రాం చెప్పేశామంటూ టీడీపీ ప్రచారం సాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మంజూరు చేసిన జాతీయ సంస్థల విషయాన్ని పెద్ద అంశమే కాదన్నట్లు పక్కనపెట్టేస్తోంది. రాజధానికి ఇచ్చిన రెండువేల అయిదువందలకోట్ల రూపాయలూ తాత్కాలిక భవనాలకే సరిపోయాయంటోంది. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామంటూ మాట తప్పారంటూ ప్రధానిని నిందిస్తోంది. నిజానికి రాజధానిపై ఇంతవరకూ పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టునే సిద్దం చేసుకోకుండా కేంద్రంపై దుమ్మెత్తిపోస్తోంది. ప్రత్యేక హోదా ప్రయోజనాలకు సరిసమానమైన మొత్తాన్ని నిధుల రూపంలో స్పెషల్ పర్పస్ వెహికల్ గా ఇస్తామంటే ముందుకు రారు. ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం విస్మరించిన అంశాలు. కానీ బీజేపీ నాయకులు వీటిని కౌంటర్ చేయలేకపోతున్నారు. ఇది గమనించిన అధిష్టానం ఏపీ విషయంలో చకచకా పావులు కదుపుతోంది. గ్రౌండ్ లెవెల్ లో కనిపిస్తే తప్ప తమ నాయకులు ప్రజల్లోకి వెళ్లలేరని గ్రహించింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అనంతపురానికి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసింది. గతంలో మాదిరిగా టీడీపీ దీనిని తమ ఖాతాలో వేసుకోలేదు. రాయలసీమలో బీజేపీ ప్రచారానికి పనికొస్తుంది. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటుగా ఉన్న రైల్వేజోన్ ను కూడా మంజూరు చేసే దిశలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో బీజేపీపై నెగటివ్ ప్రచారానికి తెరపడుతుంది. దీనిని కూడా టీడీపీ తమ ఖాతాలో వేసుకోవడం సాధ్యం కాదు. జిల్లాల వారీ పెండింగులో ఉన్న కీలకమైన ప్రాజెక్టులపై కూడా కేంద్రం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ నాయకులకు తగినంత సాధనసంపత్తి సమకూర్చినట్లే. ఇక ముందు ఆంధ్రప్రదేశ్ కు మంజూరు చేసే ప్రతి పథకం, ప్రతి పైసా లెక్క బీజేపీ రాజకీయ ఖాతాలోకే జమ కావాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

విభజన వ్యూహం..

టీడీపీని కకావికలం చేసే ఎత్తుగడలూ బీజేపీ వద్ద సిద్దంగానే ఉన్నాయి. ఇప్పటికే అభివృద్ధిని మొత్తం అమరావతిలో కేంద్రీకృతం చేస్తున్నారనే విమర్శలని టీడీపీ ఎదుర్కొంటోంది. నిజానికి ఆశించిన స్థాయి ప్రాజెక్టులు అమరావతికి రావడం లేదు. కానీ చంద్రబాబు ప్రచార యావతో రాజధానిలో ఏదో జరిగిపోతోందనే ముద్ర పడిపోయింది. మిగిలిన ప్రాంతాలు బాబు వైఖరిపై కినుక వహిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ అసంతృప్తి బాగా ఎక్కువగా ఉంది. దీనిని మరింత పెచ్చరిల్లేలా చేయడానికి బీజేపీ వ్యూహం సిద్దం చేస్తోంది. కర్నూలుకు రాజధానిని దూరం చేశారనే బాధ అక్కడి ప్రజల్లో ఉంది. కనీసం తమకు హైకోర్టును అయినా ఇప్పించాలని అక్కడి వారు కోరుతున్నారు. దానిపై ఉద్యమం కూడా చేస్తున్నారు. దీనికి అవసరమైన మద్దతును బీజేపీ సమకూర్చిపెడుతోంది. హైకోర్టును అమరావతిలోనే పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాయలసీమ ప్రజల ఆలోచనలకు ఇది భిన్నమైనది. హైకోర్టును అడ్డుపెట్టి టీడీపీ సర్కారుకు ఇరకాటం కలిగించవచ్చని బీజేపీ భావిస్తోంది. ఉత్తరాంధ్రకు రైల్వేజోన్ ద్వారా తాము న్యాయం చేస్తున్నాం. టీడీపీ పెద్దగా ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదనే ప్రచారానికి కూడా తెరతీయబోతున్నారు.

వైసీపీకి వెసులుబాటు…

ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ రాజకీయ పార్టీ వారిని ఒప్పించడం ద్వారానే మనుగడ సాగించగలుగుతుంది. వారికి దూరం కావడానికి ఇష్టపడదు. అందుకే మోడీ, అమిత్ షా ల ద్వయం ఆంధ్రప్రదేశ్ ను దూరం చేసుకోవాలని భావించడం లేదు. రాం మాధవ్, జీవీఎల్ నరసింహారావు వంటి వారికి కేంద్ర దూతలుగా బాధ్యతలు అప్పగించారు. కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించారు. చంద్రబాబుకు సన్నిహితంగా మసలే బీజేపీ నాయకులను దూరంగా పెట్టారు. బీజేపీ ఇప్పటికిప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచేంత బలం పుంజుకోకపోవచ్చు. కానీ ప్రజల్లోకి వెళ్లేంత మద్దతు కూడగట్టుకోవచ్చనేది అంచనా. నాలుగైదు లోక్ సభ స్థానాలు , 20 అసెంబ్లీ స్థానాల్లో బలమైన పక్షంగా మారవచ్చని బీజేపీ అధినాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. వీరి ప్రచారం ఫలిస్తే కమలానికి కలిసొచ్చినా రాకపోయినా టీడీపీకి ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్సార్ కాంగ్రెసుకు మాత్రం ఎంతో కొంత వెసులుబాటు దక్కుతుంది. పరోక్ష ప్రయోజనం సమకూరుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*