దేవుడే రక్షించాలి…!!!

‘కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడా కాపాడు’ అని వేడుకుంటాం. మరీ ఆయన పట్టించుకోవడం లేదని భావించినప్పుడు ’ ఉన్నావా? అసలున్నావా?‘ అంటూ ఆవేదన వెలిబుచ్చుకుంటాం. ’మమ్మల్ని గట్టెక్కించు స్వామీ. ఆపద మొక్కులు చెల్లించుకుంటాం’ అని ప్రార్థిస్తాం. శరణాగత రక్షకునికే పరీక్ష పెడతాం. దేశంలో రాజకీయ పార్టీలదీ ఇప్పుడు అదే పరిస్థితి. కాంగ్రెసు పార్టీ అధినాయకుడు ఏ పర్యటన చేసినా , ప్రజలతోపాటు గుడులు, గోపురాల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు. తాను హిందువునని చర్యల ద్వారా ప్రకటించుకుంటున్నారు. హిందూ మతంపై రాజకీయంగా పేటెంటు హక్కు తనదే అని విశ్వసించే భారతీయ జనతాపార్టీ సంగతైతే చెప్పనక్కర్లేదు. నానాటికీ క్షీణిస్తున్న తమ ప్రాభవ, వైభవాలను పునరుద్దరించుకునేందుకు బీజేపీకి మళ్లీ దేవుడు గుర్తుకు వస్తున్నాడు. ఉత్తర దక్షిణ భారతాల్లో ఊపు తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

స్వామియే శరణం…..

కమలం పార్టీ ఎన్ని యత్నాలు చేసినా, ఎంతగా పొత్తులకోసం పాకులాడినా పట్టు దొరకని రాష్ట్రాలు దక్షిణాది ప్రాంతాలే. కర్ణాటకను కైవసం చేసుకుని 2019 లో సౌత్ ఇండియాలో సవాల్ విసురుదామనుకున్న ప్రయత్నాలు సైతం ఫలించలేదు. ఇప్పుడు అయాచితంగా ఒక అవకాశం కలిసి వచ్చింది. దానిని ఆసరాగా చేసుకుంటూ హిందూ చాంపియన్ గా ఆవిర్భవించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. రామ రథ యాత్రతో 1991లో ఉత్తరభారతాన్ని ఏరకంగా ప్రభావితం చేసిందో అదే తరహాలో దక్షిణభారతంలోనూ అయ్యప్పను అభయప్రదాతగా మలచుకోవాలని చూస్తోంది. స్వామి సన్నిధిలో ప్రవేశించేందుకు అన్నివయసుల మహిళలకూ హక్కు ఉందంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మత నైష్టికులు, సంప్రదాయవాదుల విశ్వాసాలను దెబ్బతీసింది. అక్కడ ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం ఈతీర్పును మొండిగా అమలు చేయాలని ప్రయత్నించి భంగపడింది. లౌక్యంగా వ్యవహరించాల్సిన చోట మొరటు తనం ప్రదర్శించింది. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న భారతీయ జనతాపార్టీ స్వామియే శరణం అయ్యప్ప అంటూ రంగప్రవేశం చేసింది. రథ యాత్రకూ ఏర్పాట్లు చేసుకొంటోంది. దక్షిణభారతంలో అయ్యప్ప భక్తుల సంఖ్య అధికంగానే ఉంది. దీంతో సెంటిమెంటును రగిలించి పట్టు బిగించాలని భాజపా పక్కా ఏర్పాట్లు చేసుకొంటోంది.

శ్రీరాముని దయ చేతను..

2019 ఎన్నికల నాటికి మళ్లీ శ్రీరాముడినే నమ్ముకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 2014లో 71 లోక్ సభ స్థానాలను ఒంటరిగా గెలుచుకుంది. మిత్రపక్షాలతో కలిపి 73 స్థానాలు ఎన్డీఏకి ఉన్నాయి. మళ్లీ అంతటి ఘనవిజయం సాధించే సూచనలు కనుచూపుమేరలో ఎక్కడా లేవు. మరోవైపు కాంగ్రెసు, బీఎస్పీ,ఎస్పీ యూపీలో జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదే జరిగితే బీజేపీకి ఎదురీత తప్పదు. ఓట్ల పరంగా , సామాజిక సమీకరణల పరంగా 2014 ఎన్నికలనే ప్రాతిపదికగా తీసుకుని లెక్కిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయంటున్నారు. కేవలం 15 స్థానాల్లో మాత్రమే బీజేపీకి విజయావకాశాలుంటాయని సెఫాలజిస్టులు తేల్చి చెప్పేస్తున్నారు. ఒక రాష్ట్రంలోనే 58 స్థానాలు కోల్పోవడమంటే మాటలు కాదు. అధికారం కోల్పోవడం కిందే లెక్క. అందుకే ఈ లెక్కను సరిచేసుకునేందుకు బీజేపీ తనవంతు ప్రయత్నాలు ప్రారంభించింది. రానున్న అయిదారు నెలల్లో అభివ్రుద్ధిని అందలమెక్కించి, సంక్షేమాన్ని ఉరుకులు పరుగులు తీయించి ప్రజామద్దతు కూడగట్టడం సాధ్యం కాదు. మిగిలిన ఏకైక మార్గం భావోద్వేగాలు రెచ్చగొట్టడమే. అందుకే సంఘ్ పరివార్ ద్వారా మళ్లీ రామమందిర నిర్మాణోద్యమాన్నిచేపట్టాలని తలపోస్తున్నారు. ఇందుకుగాను జనవరి నెలను ముహూర్తంగా భావిస్తున్నారు. అప్పటికి ఎన్నికలకు నాలుగు నెలల వ్యవధి ఉంటుంది. ఉద్యమం చేపడితే పతాకస్థాయికి చేరడానికి ఆ సమయం సరిపోతుంది. అందుకే మళ్లీ శ్రీరాముని దయ చేతను ఎన్నికల సాగరాన్ని ఈదవచ్చనే భావనలో ఉన్నారు.

మేము సైతం…

మిగిలిన రాజకీయ పార్టీలు సైతం తామేమీ తక్కువ తినలేదు అంటున్నాయి. మతపరమైన భావోద్వేగాలు బీజేపీవైపే సంఘటితం కాకుండా చూసేందుకు శతవిధాలా యత్నిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ సాఫ్ట్ హిందుత్వ స్టాండ్ తీసుకుంది. అయ్యప్పస్వామి సన్నిధి విషయంలో ప్రజల మనోభావాలకే తమ ఓటు అంటూ పార్టీ వైఖరిని ప్రకటిస్తోంది. రాహుల్ గాంధీ తాను శివభక్తుడినని టెంపుల్ రన్ ప్రారంభించారు. గుడులు, గోపురాలు తిరగడంలో నాయకులు పోటీలు పడుతున్నారు. గతంలో మైనారిటీ, ఎస్సీ,ఎస్టీ ఓట్లు సంఘటితమైతే చాలనుకునే దశ నుంచి హిందూ ఓట్లను సాధించకపోతే భవిష్యత్తు ఉండదన్న నిజాన్ని పార్టీలు గ్రహిస్తున్నాయి. మొత్తమ్మీద 2019 రాజకీయ సమీకరణల్లో మతం ముఖ్యభూమిక పోషించబోతోంది. 2014లో పేటెంటు రైట్ ను బీజేపీ ఎగరేసుకుపోయింది. ఈ సారి మాత్రం తమవంతు వాటా కోసం కాంగ్రెసు వంటి పార్టీలు డిమాండు చేస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*