బళ్లారి “గాలి” ఎటువైపు….?

ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఐదు స్థానాల్లో నాలుగు స్థానాల్లో విజయం దాదాపుగా తెలిసిపోయే విధంగా ఉంది. ఒక్క బళ్లారి పార్లమెంటు నియోజకవర్గం మాత్రమే నువ్వా? నేనా? అన్న రీతిలో సాగనుంది. కర్ణాటకలో శివమొగ్గ, బళ్లారి, మాండ్య , రామనగర, జమఖండి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో శివమొగ్గలో బీజేపీ కి కొంత ఎడ్జ్ ఉంది. ఇక మాండ్య స్థానంలో కూడా బీజేపీ చివరిక్షణంలో విజయం వైపు దూసుకెళుతుందన్న అంచనాలు ఉన్నాయి.

రామనగరలో వన్ సైడ్….

జమఖండిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయమనే చెప్పాలి. ఇక రామనగరలో బీజేపీ అభ్యర్ధి చంద్రశేఖర్ పోటీ నుంచి తప్పుకుంటన్నట్లు ప్రకటించడంతో అక్కడ గెలుప ఏకపక్షంగానే ఉంది. రామనగరలో ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత జనతాదళ్ ఎస్ తరుపున బరిలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ తనకు పార్టీ నేతలెవ్వరూ సహకరించడం లేదని పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు. పోటీ నుంచి తప్పుకోవడమే కాకుండా ఆ పార్టీలో ఉన్న లుకలుకలను కూడా బయటపెట్టడం విశేషం. బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీజేపీకి ఊహించని దెబ్బ తగిలింది. రామనగర ఇక ఏకపక్షంగా జేడీఎస్ ఖాతాలో పడినట్లే.

హోరా హోరీ…..

బళ్లారి పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం హోరా హోరీ పోరు సాగనుంది. ఇక్కడ బీజేపీ నేత శ్రీరాములు సోదరి శాంత బరిలో ఉండగా, కాంగ్రెస అభ్యర్థిగా ఉగ్రప్ప పోటీ లో ఉన్నారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గం నేతలు కావడం విశేషం. బళ్లారి ఎంపీ స్థానం ఎస్టీలకు రిజర్వ్ అయింది. గత ఎన్నికల్లో ఇక్కడ శ్రీరాములు బీజేపీ తరుపున పోటీ చేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. బళ్లారి అంటేనే గాలి జనార్థన్ రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీరాములు గుర్తొస్తారు. అందుకే ఈ సీటులో మరోసారి కమలం జెండా ఎగురవేసేందుకు గాలి కూడా ఇతోధికంగా సాయపడుతున్నారు. స్వయంగా కోర్టు ఆదేశాలతో తాను బళ్లారి రాలేకపోయినప్పటికీ ఫోన్ల ద్వారానే గాలి ప్రచారం చేస్తున్నారు.

ఎమ్మెల్యేలకు పరీక్ష……

ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఉగ్రప్ప కూడా తక్కువేమీ కాదు. ఆయనకు పోరాటయోధుడిగా పేరుంది. దీంతో పాటు బళ్లారి పార్లమెంటు పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల పనితీరుకు ఇది నిదర్శనమవుతుందని కాంగ్రెస్ అధిష్టానం వారికి హెచ్చరికలు పంపింది. అలాగే మంచి వ్యూహకర్తగా పేరున్న డీకే శివకుమార్ బళ్లారి ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో బళ్లారిలో పోటీ నువ్వా? నేనా ? అన్నట్లు ఉంది. మొత్తం మీద నాలుగు నియోజకవర్గాల్లో గెలుపుపై విశ్లేషకులు ఒక అంచనాకు వస్తుండగా బళ్లారి విషయంలో అది సాధ్యం కాకపోవడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*