ఆచారి….కల్వకుర్తి…. యాత్ర….!!

తెలంగాణాల్లో చాలా చిత్ర విచిత్రమైన ఘ‌ట‌న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అంద‌రూ కలిసి మూకుమ్మడిగా ఒక్కటై.. అధికార టీఆర్ ఎస్‌ను మ‌ట్టిక‌రిపించాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే మ‌హాకూట‌మికి తెర‌దీశారు. కీల‌క‌మైన అభ్యర్థుల‌ను రంగంలోకి దింపుతున్నారు. అయినా కూడా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం పోటీ ర‌స‌వ‌త్తరంగా మారుతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఉమ్మడి ఉమ్మడి మహబూబ్‍నగర్‍ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కల్వకుర్తి నియోజకవర్గం ఒక‌టి. ఇక్కడ ప్రజ‌లు స్థానిక‌త‌కు పెద్ద పీట వేస్తున్నారు. తమ స‌మ‌స్యలు ప‌రిష్కరించే నాయ‌కుడికి, త‌మ‌కు అందుబాటులో ఉండే నేత‌కు మాత్రమే ప‌ట్టం క‌డుతున్నారు.

ఎన్టీఆర్ ను సయితం ఓడించి….

దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతోంది. గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను సైతం ఓడించి స్థానికుడికే పట్టం కట్టిన ఘనత ఇక్కడి ఓటర్లది. 2014 ఎన్నికల్లో బీజేపి అభ్యర్థి టి. ఆచారికి, కాంగ్రెస్‍ అభ్యర్థి వంశీచంద్‍రెడ్డికి మద్య హోరాహోరి పోరు సాగింది. ఆ ఎలక్షన్స్‌లో 78 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్‍ అభ్యర్థి వంశీచంద్‍రెడ్డి విజయం సాధించాడు. కానీ ఈసారి కల్వకుర్తి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన టీఆర్‍ఎస్‍ అభ్యర్థి జైపాల్‍ యాదవ్‍.. ఈసారి పార్టీలోని తన సహచరులైన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి , ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిల పూర్తి మద్దతు కూడగట్టేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు.

ఆచారికి సానుకూలమేనా…?

ఇదే జ‌రిగి.. కిష్టారెడ్డి, క‌సిరెడ్డిలు జైపాల్‌కు జైకొడితే.. ఎన్నిక ఏక‌ప‌క్షమే అనే టాక్ వ‌స్తోంది. అదేస‌మ‌యంలో బీజేపీ అభ్యర్థి టి. ఆచారి కూడా గెలుపుపై ధీమాగానే ఉన్నారు. నియోజకవర్గంలో 5 సార్లు పోటీ చేసి ఓటమి చెందిన వ్యక్తిగా, ప్రజల్లో సానుభూతి పొందడం ఒకటైతే, గత ఎన్నికల్లో అత్యంత స్వల్ప మెజారిటీ 78 ఓట్లతో ఓటమి చవిచూడటం కూడా కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజల నుంచి సానుభూతిని పెంచాయి. ఈసారి తనకు భారీ మెజారిటీతో విజయాన్ని కట్టబెడతారని బీజేపి అభ్యర్థి టి.ఆచారి ఆశాభావంతో ఉన్నారు. ఇక టీఆర్‍ఎస్‍ అభ్యర్థి జైపాల్‍ యాదవ్‍ టికెట్‍ కన్ఫర్మ్ అయిన‌ప్పటి నుంచి అసమ్మతి సెగ తగులుతూనే ఉంది. ఇక్కడి నుంచి టీఆర్‍ఎస్‍ తరపున టికెట్‍ ఆశించిన వారిలో నలుగురు వ్యక్తులు ఉండటం ఆయ‌న‌కు క‌ష్టాలు తెస్తోంది.

ఎన్నికలకు ముందు…..

ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, గౌలి శ్రీనివాస్‍, బాలాజీసింగ్‍లు పార్టీ టికెట్‍ ఆశించారు. చివరకు పార్టీ అధినేత కేసీఆర్‍ జైపాల్‍ యాదవ్‍కు మరోసారి టికెట్‍ కేటాయించారు. దీంతో అసమ్మతి వర్గాలు గుప్పుమన్నాయి. ఎమ్మె ల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇండిపెండెంట్‍ అభ్యర్థిగా రంగంలోకి దిగాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఐతే కేసీఆర్‍, కేటీఆర్‍లు రంగంలోకి దిగి కసిరెడ్డికి నచ్చజెప్పడంతో ఆయన ప్రస్తుతానికి సైలెంటయ్యారు. కానీ, వీరు మాత్రం ఎన్నిక‌ల‌కు ముందు ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంటే ఇక్కడ పోటీ ర‌స‌వ‌త్తరంగా మారుతుంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*