బీజేపీ…. కాంగ్రెస్‌నే మించిపోయిందే!

బీజేపీ అధికార దాహం ఎలా ఉందో తెలియ‌జెప్పేందుకు క‌ర్ణాట‌కలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలే నిద‌ర్శ‌న‌మనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అధికారం చేజిక్కించుకునే క్ర‌మంలో గెలుపు ముంగిట వ‌ర‌కూ వ‌చ్చి ఆగిపోయిన ప‌క్షంలో.. ప్రజా తీర్పును పాటించ‌డం హుందాత‌నాన్ని తీసుకొస్తుంది. కానీ ఎలాగైనా అధికారాన్ని హస్త‌గ‌తం చేసుకోవాల‌నే క్ర‌మంలో.. గ‌వ‌ర్న‌ర్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ ఆడుతున్న రాజ‌కీయ చ‌ద‌రంగం చూసిన వారంతా అవాక్క‌వుతున్నారు. ఇది ప్ర‌జాస్వామ్యానికి విఘాతం క‌లిగించే అంశ‌మని స్ప‌ష్టంచేస్తున్నారు.

గతంలో కాంగ్రెస్ కూడా….

గ‌తంలో కాంగ్రెస్ ఇలాంటి వ్య‌వ‌హార‌మే చేస్తే.. ఇప్పుడు అంత‌కు మించి బీజేపీ పావులు క‌దిపింది. కోర్టులు కూడా త‌మ నిర్ణ‌యంలో జోక్యం చేసుకోలేకుండా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసింది. రాత్రికిరాత్రే ప్ర‌భుత్వం ఏర్పాటుచేయాల‌నే ఆహ్వానాలు.. పొద్దున్నే ప్ర‌మాణ‌స్వీకారాలు చేయించి.. ప్రజాస్వామ్యాన్ని త‌మ గుప్పెట్లో పెట్టేసుకున్నారు బీజేపీ పెద్ద‌లు. క‌ర్ణాట‌క‌లో రాత్రికి రాత్రి అనూహ్య ప‌రిణామాలు జ‌రిగిపోయాయి. ప్ర‌భుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్‌-జేడీఎస్ సంసిద్ధంగా ఉన్నా.. గ‌వ‌ర్న‌ర్‌ను ఉప‌యోగించి బీజేపీ తెర‌పైకి కొత్త స‌మీక‌ర‌ణాలు తీసుకొచ్చింది.

సైలెంట్ ఉండి…చివరకు….

ప్ర‌భుత్వం ఏర్పాటుచేయాల‌ని య‌డ్యూరప్ప‌ను ఆహ్వానించ‌డం విశ్లేష‌కుల‌ను విస్మ‌యానికి గురిచేస్తోంది. ఫలితలొచ్చిన 36 గంటల పాటు సైలెంట్‌గా ఉన్న గవర్నర్ రాత్రి తొమ్మిది గంటలకు యడ్యూరప్పను ఆహ్వానించారు. నిజానికి అధికారిక ప్రకటన బయటకు వచ్చేసరికి పది అయింది. తమను గవర్నర్ ఆహ్వానించారని బీజేపీ నేతలు ఎనిమిదిన్నర నుంచే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. రాత్రి పది గంటలకు.. యడ్యూరప్పను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం.. ఉదయం తొమ్మిది గంటల కల్లా ప్రమాణస్వీకారం చేయాలనడం వెనుక బీజేపీ అనైతికత రాజకీయాలు చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తి ప్లాన్ అమలు….

ఉదయం తొమ్మిది గంటలకు ప్రమాణస్వీకారం పూర్తి చేయాలనే ప్లాన్ అమలు చేసింది. అంటే.. ఈ మధ్యలో కోర్టుకు వెళ్లే అవ‌కాశం కాంగ్రెస్‌కు ఉండదని మొత్తం త‌తంగాన్ని పూర్తిచేయించారు ప్ర‌ధాని మోదీ, జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా! ప్ర‌మాణ స్వీకారం అయిపోయిన‌ తర్వాత కోర్టులు ఏమీ చేయలేవని వీరి భావన కావొచ్చు. గవర్నర్ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవన్న సాంకేతిక వాదనతో యడ్యూరప్ప ప్రమాణానికి బీజేపీ ఇబ్బంది లేకుండా చేసుకుంది. కానీ అనూహ్యంగా సుప్రీంకోర్టు అర్థరాత్రి దాటిన తర్వాత తలుపు తట్టినా స్పందించింది.

న్యాయవ్యవస్థ వేగంగా స్పందించినా…..

కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్‌పై త్రిసభ్య బెంచ్‌ను ఏర్పాటు చేసి.. తెల్లవారే వరకూ వాదన వింది. న్యాయవ్యవస్థ వేగంగా స్పందించినా గతంలో ఉన్న తీర్పు, ప్రభుత్వాలు ఏర్పడిన తీరు, గవర్నర్ల వ్యవహారశైలిని పరిశీలిస్తే కాంగ్రెస్, జేడీఎస్‌లకు సుప్రీంకోర్టు నిర్ణయం నిరాశ కలిగించినట్లే. కర్ణాటకలో ముఖ్యమంత్రిగా కుమారస్వామికి ముందుగా అవకాశం ఇవ్వాలి. గోవా, మేఘాలయ, మణిపూర్‌లలో ఏం జరిగిందో.. కర్ణాటకలోనూ అదే జరింది. కానీ బీజేపీ మాత్రం ప్రాధాన్యాలు మార్చేసింది. కోర్టులు కూడా కల్పించుకో లేనంత వేగంగా రాజకీయ పరిణామాలు ముగించేయాలనుకుంది. గతంలో కాంగ్రెస్‌ ఇలా చేసింది కదా అని చాలా మంది చరిత్రను ముందు వేసుకుని బీజేపీ చేస్తోంది సమంజసమేనని వాదించేవాళ్లు ఉన్నారు. కానీ తప్పు ఎవరు చేసినా తప్పే. అందుకే గతంలో కోర్టు తీర్పులు చాలా గవర్నర్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చాయి. ఇప్పుడు ఆ కోర్టుల కళ్లకు కూడా గంతలు కట్టేసే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంతో ఆటలాడితే చివరికి ఆయా పార్టీలకే పెను ప్రమాదంగా మారుతుంద‌ని స్ప‌ష్టంచేస్తున్నారు విశ్లేష‌కులు!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*