ఇక ‘‘హర్రర్’’ సినిమాయేనా?

లెక్క తేలడం లేదు. రాజీ కుదరడం లేదు. ఏ ఫార్ములా కూడా పనిచేయడం లేదు. మిత్రపక్షాలుగా ఉన్న వారు సీట్ల కోసం కొట్లాటకు దిగేలా ఉన్నారు. మిత్ర పక్షాలు ఒక్కొక్కటీ దూరమవుతున్న వేళ భారతీయ జనతా పార్టీ తనకు నమ్మకమైన మిత్రుడిగా భావించి నితీష్ కుమార్ ను దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు అనేకం చేసింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వయంగా వెళ్లి నితీష్ తో మంతనాలు జరిపారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా ఆ పార్టీకే ఇచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జనతాదళ్ (యు) నుంచి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సీట్ల విషయంలో ఎలాంటి వివాదాలు రాకుండా ఈ ప్లాన్ వేసింది. అయితే జేడీయూ మాత్రం కొంచెం కూడా తగ్గడం లేదు.

కలసి పోటీ చేస్తామంటూనే…..

బీహార్ లో బీజేపీ బలంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి బీజేపీ, జేడీయూ కలసి ఎన్నికలకే వెళతాయి. దీంతో కొంత అడ్వాంటేజీఉంటుందని ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటయన్నది కమలనాధుల భావన. బీహార్ రాష్ట్రంలో మొత్తం 40 లోక్ సభ స్థానాలున్నాయి. అందులో గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 22 స్థానాల్తో గెలిచింది. జేడీయూ కేవలం రెండు స్థానాలకే పరిమితమయింది. దీంతో సీట్ల పంపకంపై బీజేపీ కొంత పట్టుదలగానే ఉంది. సిట్టింగ్ ఎంపీల స్థానాలైనా తమకు దక్కకపోతే ఎలా అన్నది కమలనాధుల ప్రశ్న. సిట్టింగ్ ఎంపీలను తాము ఎలా పోటీకి దింపకుండా ఉంటామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

సీట్లు తగ్గించుకుని….

అందుకోసం తాము కొంత తగ్గేందుకు కూడా సిద్ధమని బీజేపీ నేతలు చెబుతున్నారు. తాము గత ఎన్నికల్లో 22 స్థానాలు గెలుచుకున్నా రెండు స్థానాలను వదులుకోవడానికి సిద్ధమని తెలిపింది. ఈ ఫార్ములా ప్రకారం బీజేపీకి 20 స్థానాలు, జేడీయూకు 12, రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జన్ శక్తి పార్టీకి ఐదు స్థానాలు, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి మూడు స్థానాలను కేటాయించాలన్న ప్రతిపాదనను కమలనాధులు రూపొందించారు. అయితే దీనికి జేడీయూ ససేమిరా అంగీకరించడం లేదు. అవసరమైతే పొత్తు లేకుండా బరిలోకి దిగుతామని జేడీయూ సంకేతాలు ఇస్తుంది.

జేడీయూ ససేమిరా….

జేడీయూ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం జేడీయూకు, బీజేపీకి 17 చొప్పున పార్లమెంటు స్థానాలను కేటాయించి మిగిలిన ఆరు స్థానాలను మిత్రపక్షంలోని పార్టీలకు ఇవ్వాలని సూచించింది. 2014 ఎన్నికలకు ముందు ఉన్న రికార్డులను పరిశీలించుకోమని చెబుతోంది. అప్పటి ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు బీజేపీ 15 స్థానాల్లోనూ, జేడీయూ 25 స్థానాల్లోనూ పోటీ చేసింది. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు అదే మాదిరిగా కాకున్నా తమకు 20 స్థానాలను కేటాయించాన్నది జేడీయూ వాదన. అయితే బీజేపీ మాత్రం బీహార్ లో 12 స్థానాలు ఇచ్చి యూపీ, జార్ఘండ్ రాష్ట్రాల్లో మరికొన్ని సీట్లు ఇస్తామన్నప్రతిపాదనకు కూడా జేడీయూ అంగీకరించడంలేదు. దీంతో బీహార్ లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పొత్తు పెద్ద అగాధమే సృష్టించనుందన్న వార్తలు వస్తున్నాయి. తాము అధికారంలో ఉన్న తమ గౌరవాన్ని కాపాడేవిధంగా సీట్లను ఇస్తే సర్దుకుపోతామని జేడీయూ చెబుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*