ఉన్నా ఒక్కటే…ఊడినా ఒక్కటేనా?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కమలం పార్టీకి తీపి కబురు. మిత్రపక్షంగా ఉండి కూడా దూరం పాటిస్తున్న శివసేనకు చేదు అనుభవం ఎదురైంది. శివసేనకు తన అసలు బలం ఏంటో తెలిసొచ్చిందా. కమలం పార్టీతో కలసి వెళ్లకుంటే రానున్న ఎన్నికల్లో కూడా డ్యామేజీ అవ్వకతప్పదని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. కొన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ, శివసేన కలసి ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. సిద్ధాంతాల పరంగా రెండు పార్టీలూ ఒకే దారిలో నడవడం, ఇద్దరి ఓటు బ్యాంకు ఒకటే కావడంతో చేతులు కలిపి గత అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో విజయాన్ని అందుకున్నాయి.

శివసేన వేరుకుంపటి…….

అయితే గత ఏడాదిన్నర కాలంగా శివసేనకు బీజేపీ అంటే పొసగడం లేదు. బీజేపీ కాదు గాని ముఖ్యంగా మోదీ, అమిత్ షా లంటే గిట్టడం లేదు. దీంతో మోదీ, అమిత్ షా లపై పరుష వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ అధికార పత్రిక సామ్నాలో సయితం వీరి వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే సయితం అనేక సమావేశాల్లో మోదీ నిర్ణయాలను తప్పుపడుతూ వస్తున్నారు. అంతేకాదు గుజరాత్ ఎన్నికల సమయంలోనూ, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీని పొగడటం కూడా కమలనాధులకు కంటగింపుగా మారాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన ఇప్పటికే ప్రకటించింది. అమిత్ షా వచ్చి స్వయంగా ఉద్ధవ్ థాక్రేతోచర్చలు జరిపినా తమ దారి సపరేటు అని చెబుతూ వస్తోంది.

బీజేపీ భయం…భయంగా….

వచ్చే ఎన్నికల్లో విడిపోయి పోటీకి దిగితే అది కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీలకు అడ్వాంటేజీ అవుతుందన్నది భారతీయ జనతా పార్టీ భయం. అందుకే శివసేనతో నేరుగా తాను తెగదెంపులు చేసుకోవడానికి భయపడుతుంది. అయితే తాజాగా మహారాష్ట్రలో జరిగిన రెండు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు బీజేపీ భయాన్ని పోగొట్టాయనే చెప్పాలి. గత ఎన్నికల కంటే మించి బీజేపీ ఓట్లు…సీట్లు సాధించింది. అదీ శివసేనతో కాకుండా ఒంటరిగా బరిలోకి దిగి తన సత్తాను చాటింది. మహారాష్ట్రలోని జలగావ్ నగరపాలక సంస్థలోనూ, సంగ్లి-మిరాజ్-కుప్వాడ్ మున్పిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీలను దెబ్బకొట్టి మరీ జెండాను పాతేసింది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతాల్లో బీజేపీ విజయాన్ని ఎవరూ ఊహించలేదు.

తాజా ఫలితాలతో…..

75 స్థానాలున్న జలగావ్ నగర పాలకసంస్థ ఎన్నికలలో బీజేపీ 57 సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. సంగ్లి-మిరాజ్-కుప్వాడ్ మున్పిపల్ కార్పొరేషన్ లో కూడా 78 స్థానాలకు గాను 41 స్థానాలు దక్కించుకుని శరద్ పవార్ కు సవాల్ విసిరింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే శివసేనతో పొత్తు లేకుండానే గెలుపు సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. వచ్చే లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు ఇది రిహార్సల్స్ మాత్రమేనంటున్నారు కమలనాధులు. ఒకవైపు మహారాష్ట్రలో మరాఠాల ఉద్యమం ఊపందుకుంటున్నా, రైతులు రోడ్డెక్కుతున్నా….బీజేపీ ఈ రెండు కార్పొరేషన్లలో విజయం సాధించడం ఊహించని పరిణామమే. అయితే ఈ ఎన్నికలే ప్రాతిపదికగా తీసుకోలేం గాని, మహారాష్ట్రలో శివసేన లేకున్నా….ఒంటరిగానైనా బీజేపీ ఎన్నికలకు వెళ్లేందుకు కావాల్సిన ఆత్మస్థయిర్యాన్ని ఈ ఎన్నికలు ఇచ్చాయని చెప్పక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*