నౌ… టాకింగ్ టైమ్….!

వారికి తెలియంది కాదు. అంత అమాయకులేం కాదు. కాకుంటే తన దారికి తెచ్చుకునేందుకు ఒక్కో వ్యూహాన్ని ఎంచుకుంటున్నారు. అది ఫలప్రదం అవుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే మొత్తానికి ఆ పార్టీ మాత్రం తాను అనుకున్న దిశలోనే వెళుతున్నట్లు కన్పిస్తోంది. కాని చివరకు ఫలితం ఎలా ఉండబోతుందన్నది తేలాల్సి ఉంది. మహారాష్ట్రలో శివసేన కు గ్రౌండ్ లెవెల్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేశారు రాజ్ థాక్రే. పక్కా లోకల్ పేరుతో మహారాష్ట్రలో ప్రారంభమయిన శివసేన తర్వాత క్రమంగా ఇతర రాష్ట్రాలకూ వ్యాపించింది.

రెండు పార్టీలదీ……

రాజ్ థాక్రే మరణం తర్వాత ఆయన కుమారుడు ఉద్థవ్ థాక్రే పార్టీ పగ్గాలు అందుకున్నారు. శివసేన, భారతీయ జనతాపార్టీలు రెండూ ఒకే నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నవే. హిందుత్వ నినాదంతోనే శివసేన ఇంత ఎత్తుకు ఎదిగింది. శివసేన, బీజేపీలు ప్రతి ఎన్నికల్లో కలసి పోటీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం కేంద్రంలోనూ, మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ రెండు పార్టీలూ భాగస్వామ్యులే. అయితే గత కొంత కాలం నుంచి శివసేన తన గళం మార్చింది. ముఖ్యంగా ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల పోకడలను శివసేన వ్యతిరేకిస్తూ వస్తోంది.

బీజేపీ లేకుండా……

మహారాష్ట్రలో శివసేన బీజేపీ లేకుండా బరిలోకి దిగితే భంగపాటు తప్పదని దానికి తెలియంది కాదు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలే ఈవిషయాన్ని స్పష్టం చేశాయి.రెండు పార్టీల ఓటు బ్యాంకు ఒక్కటే కావడంతో విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి ప్రత్యర్థి పార్టీకి అనుకూలత ఏర్పడుతుందన్నది అందరికీ తెలిసిందే. కాని శివసేన ఇదేమీ పట్టించుకోనట్లు తాము వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేయమని చెప్పేసింది. అంతేకాదు ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించింది. దీంతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా వెళ్లి ఉద్ధవ్ ను కలసి పరిస్థితిపై చర్చించాల్సి వచ్చింది.

అందుకే తరచూ విమర్శలా?

ఇటీవల జరిగిన అవిశ్వాసం సమయంలోనూ శివసేన గైర్హాజరై తన నిరసనను తెలిపిందే తప్ప బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయకపోవడం గమనార్హం. శివసేన టార్గెట్ ఈసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి. అందుకోసం వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలన్న ఉద్దేశంతో ఉద్ధవ్ ఉన్నారు. సీట్ల పంపకంలో డీల్ కుదిరితే రెండు పార్టీలు కలసి పోటీ చేస్తాయి. ఆ సీట్ల కోసమే తరచూ పార్టీపైన కాకుండా మోదీ, అమిత్ షాలపైనే శివసేన ఎక్కువగా విరుచుకుపడుతుంది. చివరి నిమిషంలోనైనా ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగి సెటిల్ చేస్తుందన్న నమ్మకం కావచ్చు. అందుకే ఉద్ధవ్ తరచూ విమర్శలకు దిగుతున్నారన్నది విశ్లేషకుల అంచనా. తాజాగా ఉద్ధవ్ మోదీ, అమిత్ షాలపై విరుచుకపడ్డారు. దేశంలో ఆవులకు ఉన్న రక్షణ మహిళలకు లేదని ఆయన మండిపడ్డారు. ఇందుకు సిగ్గుపడాలని సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు ఉద్దవ్. తాము భారతీయ జనతాకు మాత్రమే మిత్రులమని, మరెవ్వరికీ కాదని ఆయన తేల్చి చెప్పారు. అవసరమైతే ఒంటరిగా బరిలోకి దిగడానికి సిద్ధమని ఆయన మరోసారి ప్రకటించడం విశేషం. మొత్తం మీద సీట్ల పంపకం కోసమే శివసేన ఈ ఎత్తులు వేస్తుందని భావించిన బీజేపీ కూడా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని సంకేతాలు పంపుతుండటం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*