అస్సలు మీకేం కావాలి…..?

రామ మందిర నిర్మాణం, హిందుత్వ నినాదంతో పాటుగా మోదీ క్రేజ్ తో గత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తిరిగి రామమందిరాన్ని నిర్మించి తీరుతామని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సయితం ముఖ్యనేతల సమావేశంలో రామమందిరం నిర్మించి తీరుతామని చెప్పినట్లు వార్తలొచ్చాయి. త్వరలోనే రామమందిరం పనులను కూడా ప్రారంభించనున్నట్లు అమిత్ షా చెప్పినట్లు కూడా ప్రచారం జరిగింది. దీనిపై అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పకుండానే అమిత్ షా ఎలా ప్రకటిస్తారని ఎంఐఎం నేత అసదుద్దీన్ వంటి వారు కూడా ధ్వజమెత్తారు.

టార్గెట్ మోదీ……

అయితే విపక్షాల మాట ఎలా ఉన్నప్పటికీ మోదీ, అమిత్ షాలను శివసేన టార్గెట్ చేసినట్లు కన్పిస్తోంది. నాలుగేళ్ల నుంచి రామమందిరం మాట ఎత్తకుండా, ఒంటెత్తు పోకడలను అవలంబిస్తున్న వారిద్దరి బండారాన్ని బయటపెట్టేందుకు శివసేన సిద్ధమయింది. ఈ మేరకు త్వరలోనే తాను అయోధ్య, వారణాసిల్లో పర్యటిస్తానని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. శ్రీరాముడిని అయోధ్య వెళ్లి దర్శనం చేసుకుంటానని, అలాగే వారణాసిలో గంగా ప్రక్షాళన కార్యక్రమం ఏమేరకు వచ్చిందో స్వయంగా చూస్తానని, గంగా హారతిలోనూ పొల్గొంటానని ఉద్ధవ్ థాక్రే చెప్పడం విశేషం.

రెండు పార్టీల ఓటు బ్యాంకు…..

ఉద్ధవ్ థాక్రే ప్రకటన వెలువడక ముందే ఆయన అభిమానులు మహారాష్ట్రలో పలు చోట్ల ఛలో అయోధ్య అంటూ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. ఇదంతా వచ్చే ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే నన్నది స్పష్టంగా తెలుస్తోంది. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ ఓటు బ్యాంకు ఒక్కటే. దాదాపు రెండు పార్టీలూ ఒకే అజెండాతో పనిచేస్తున్నాయి. గత నాలుగేళ్లుగా బీజేపీ రామమందిరం విషయంలో ఏమీ పట్టించుకోకపోవడం, గంగాప్రక్షాళన అంటూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేయడం వంటి వాటిని ప్రజల ముందుంచే యత్నాన్ని శివసేన ప్రారంభించిందంటున్నారు.

షా…వచ్చి మాట్లాడినా…..

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన ఇప్పటికే ప్రకటించింది. అయినా ఎన్డీఏలోనే కొనసాగుతోంది. ఇటు కేంద్ర ప్రభుత్వంలోనూ, రాష్ట్ర ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉంది. అయినా బీజేపీ తమ టార్గెట్ కాదని, దేశాని నడిపిస్తున్న మోదీ, పార్టీ ని నడిపిస్తున్న అమిత్ షాలే తమ లక్ష్యమని శివసేన బహిరంగంగానే చెబుతోంది. గతంలో బీజేపీ అగ్రనాయకత్వం శివసేనకు అత్యంత విలువ, గౌరవం ఇచ్చేది. కాని మోదీ హయాంలో అవి దక్కడం లేదన్నది వారి భావన. ఇటీవల అమిత్ షా స్వయంగా వచ్చి ఉద్ధవ్ థాక్రేను కలసిన తర్వాత శివసేన కొంత శాంతించినట్లు కన్పించినా కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు థాక్రే అయోధ్య, వారణాసి పర్యటన బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*