పాపం…. ఆ పార్టీకి రూట్ లేదు…. మ్యాప్ లేదు …!!

అటల్ బిజెపి అజేయ బిజెపి నినాదంతో దేశవ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించింది కమల దళం. కానీ అత్యంత కీలకమైన తెలంగాణ లో మాత్రం నేతలకు దశా దిశా నిర్దేశించక క్యాడర్ ఉత్సాహాన్ని నీరుగార్చింది అధిష్టానం. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముందస్తు ఎన్నికలకు దూకుడుతో తెరతీసిన కెసిఆర్ ను ఎదిరించే సత్తా తమకే ఉందంటూ నిన్న మొన్నటివరకు బీరాలు పలికిన కమలం నేతలు అధిష్టానం గమ్మున వుండండి అని మౌఖీక ఆదేశాలతో ఢీలా పడింది.

ఢిల్లీ లో దోస్తీ గల్లీలో కుస్తీ …

గులాబీ బాస్ కెసిఆర్ తొలినుంచి వ్యూహాత్మకంగా బిజెపితో వ్యవహారం నడుపుతూ వచ్చారు. ఢిల్లీ లో మోడీ తో దోస్తీ నడుపుతూ రాష్ట్రానికి వచ్చేప్పటికి కుస్తీ మొదలు పెట్టారు. దాంతో గత కొన్నేళ్లుగా టిబిజెపి కి ముందుకు వెళ్లాలా? లేక వెనక్కు పోవాలో అర్ధం కాక అధిష్టానం నుంచి సరైన సూచనలు లేక అయోమయంలో కొట్టుమిట్టాడుతూనే వుంది. వాస్తవానికి ఏపీతో పోలిస్తే తెలంగాణాలో బిజెపి కొంత మెరుగైన పరిస్థితే వుంది. ఆరెస్సెస్ దళాలు రాష్ట్రమంతా విస్తరించి వున్నాయి. దీనికి తోడు భాగ్యనగర్ లో వుండే ప్రత్యేక పరిస్థితులు ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలే. తెలంగాణాలో కాంగ్రెస్ తో సమానంగా ఎదిగే అవకాశాలు వున్నా గులాబీ బాస్ వ్యూహాలు ఎత్తుగడలతో బిజెపి చిత్తు అవుతూ వచ్చింది. ఫలితంగా ఇప్పుడు ముందస్తు ఎన్నికలు ముంచుకొచ్చినా కమలదళం ముందుకు పోలేని దుస్థితి లోనే వుంది.

షా వచ్చాకనే క్లారిటీ ….

అయితే ఈనెల 15 న తెలంగాణ రానున్న అమిత్ షా పార్టీ నేతలకు ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ పై ఏ మేరకు దూకుడు పెంచాలన్నది అప్పుడే డిసైడ్ కానుంది. రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయన్నది పక్కన పెట్టి 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపి భవిష్యత్తుకు పునాది వేసే ఆలోచనలో అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మరి కమలనాధులు ఏమి చేయనున్నారో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*