బీజేపీ ఆప‌రేష‌న్ ఏపీ.. కెప్టెన్ ఇత‌నే..!

క‌ర్ణాట‌కలో అప్ర‌తిహ‌త విజ‌యం న‌మోదు చేసింది బీజేపీ. ఈ ఊపు నిజంగా ఆ పార్టీ కానీ, ఆ పార్టీ నాయ‌కులు కానీ ఊహిం చలేదు. ముఖ్యంగా వివిధ మీడియా ఛానెళ్లు, స‌ర్వే సంస్థ‌లు వెల్ల‌డించిన ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు అన్ని పార్టీల‌నూ గంద‌ర‌గోళానికి గురి చేశాయి. అదేవిధంగా బీజేపీ కూడా పైకి ధీమా వ్య‌క్తం చేసినా.. లోలోన మాత్రం తీవ్ర ఆందోళ‌న‌నే క‌న‌బ‌రిచింది. తీరా ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. అంద‌రూ ఊహించ‌న‌ట్టుగా కాకుండా ఎవరూ అంచ‌నాలు సైతం వేయ‌లేని విధంగా ఏక‌ప‌క్షంగా బీజేపీ నెగ్గుకొచ్చింది. అధికారంలోకి వ‌చ్చే మెజారిటీని ఈ పార్టీ సొంతం చేసుకుంది. దీంతో ద‌క్షిణాదిలో బీజేపీకి అధికారం మ‌ళ్లీ కైవ‌స‌మైంది. దీంతో పార్టీలోనూ, నేత‌ల్లోనూ ఎన‌లేని ఉత్సాహం నెల‌కొంది.

చంద్రబాబుకు చెక్ పెట్టేలా…..

ఇక‌, ఇదే స‌మ‌యంలో బీజేపీకి వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తున్న ఆ పార్టీని ఎక్క‌డిక‌క్క‌డ ఓడించాలంటూ పిలుపునిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు చెక్ పెట్టేలా బీజేపీ వ్యూహానికి ప‌దును పెంచుతోంది. ఈ క్ర‌మంలోనే ఆప‌రేష‌న్ ఏపీ పేరుతో పెద్ద ఎత్తున చంద్ర‌బాబుకు చెక్ పెట్టేలా వ్యూహం సిద్ధం చేస్తోంది. ఈ బీజేపీ ఆప‌రేష‌న్ ఏపీ కార్య‌క్ర‌మానికి కెప్టెన్‌గా బీజేపీ అధికార ప్ర‌తినిధి, ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ రాం మాధ‌వ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్ ఈ విష‌యాన్నే స్ప‌ష్టం చేస్తోంది. “కర్ణాటకలో విజయంతో దక్షిణాదిన మా దండయాత్ర మొదలైంది… ఏపీ సీఎం చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు” అంటూ ట్వీట్ చేశారు రామ్ మాధవ్.

తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే…..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు వాళ్లు బీజేపీకి మద్దతు ఇవ్వకుండా చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నించారని విమ‌ర్శించారు. అయితే క‌ర్ణాట‌క‌లో తెలుగు వాళ్లు అత్యధికంగా ఉండే హైదరాబాద్ కర్ణాటకలోనే ఎక్కువ సీట్లు తమ పార్టీ సొంతం చేసుకుందన్నారు. తమ బలం 6 సీట్ల నుంచి 20కి పైగా పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. దక్షిణ భారతంలో తమ విజయ యాత్ర మొదలైందన్నారు రామ్ మాధవ్.

మరి బాబు ఎలా ఎదుర్కొంటారో…?

ముఖ్యంగా మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీలో బీజేపీ హ‌వా ప్ర‌ద‌ర్శించేందుకు చేయాల్సిన అన్ని ప్ర‌య‌త్నాలూ చేయ‌నుంద‌న‌డానికి ఈ వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తున్నాయి. మొత్తంగా ఏపీలో టీడీపీ హ‌వాకు, ప్ర‌ధానంగా ఎప్ప‌టిక‌ప్పుడు మాట‌లు మారుస్తూ.. రాజ‌కీయాల‌ను గ‌రం చేస్తున్న బాబుకు చెక్ పెట్టేదిశ‌గానే బీజేపీ వ్యూహం సిద్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి బాబు మోడీ, షాల వ్యూహాన్ని ఎలా ఎదుర్కొని నిల‌బ‌డ‌తారో చూడాలి.