కమలం పుంజుకుంటోందా..?

పెద్ద నోట్ల రద్దుతో తొలుత నోట్ల కొరత సమస్య ఏర్పడినా ప్రభుత్వం చిన్నగా ఆ సమస్యను అధిగమించింది. ఇక జీఎస్టీకి కూడా జనం అలవాటు పడుతున్నారు. మోదీపైనా, భారతీయజనతా పార్టీపైన వ్యతిరేకత ఎక్కువగా ఉందని వస్తున్న ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం జరిగే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ ప్రభావం చూపుతుందని కమలనాధులు భావించారు. ఇందులో రాజస్థాన్ ది ప్రత్యేక పరిస్థితి. అక్కడ పార్టీకన్నా, ముఖ్యమంత్రి వసుంధర రాజేపైనే తీవ్ర వ్యతిరేతక ఉంది. దీన్నుంచి బీజేపీ బయటపడటం కష్టమేనని కమలనాధులు సయితం అంగీకరిస్తున్నారు.

రెండు రాష్ట్రాల్లో…..

ఇక పెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్ తో పాటు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాన్ని కొద్దిగా శ్రమిస్తే సులువుగా కైవసం చేసుకోవచ్చన్నది కమలనాధులు ఆలోెచనగా ఉంది. మిజోరాం రాష్ట్రాన్ని వదిలేస్తే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి బలం లేదు. కనీసం ఐదు రాష్ట్రాల్లో మూడింటిని గెలుచుకుని తమ సత్తా తగ్గలేదని నిరూపించుకోవాలన్నది కమలనాధుల వ్యూహంగా ఉంది. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ ఎన్నికలపైనే ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఈ రెండు రాష్ట్రాలనూ తమ ఖాతాలో వేసుకుంటే పరువు దక్కుతుందిన భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్స్ గా భావిస్తుండటంతో ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడకూడదని భావిస్తున్నారు.

అనుకూలంగా మారిన…..

ఇప్పటికే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజేపీికి కొంత అనుకూలంగా ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన వ్యక్తిగత ప్రతిష్టతో పార్టీని మరోసారి గట్టెక్కించగలరన్న విశ్వాసంతో పార్టీ ఉంది. మొత్తం 90 స్థానాలుగల ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను దక్కించుకునే వీలుందని సర్వేలు కూడా స్పష్టం చేస్తుండటంతో రమణ్ సింగ్ కు మరింత బూస్టింగ్ ఇచ్చేందుకు కమలనాధులు సిద్ధమయ్యారు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉండటం తమకు కలసి వస్తుందని నమ్ముతున్నారు. రమణ్ సింగ్ పైనే పూర్తిగా మోదీ, అమిత్ షాలు ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.

చౌహాన్ కూడా…..

ఇక మధ్యప్రదేశ్ కూడా కొంత అనుకూల వాతావరణమే కన్పిస్తుందంటున్నారు. 2003 నుంచి ఇక్కడ బీజేపీ అధికారంలో ఉండటం, ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ 13 ఏళ్ల నుంచి పనిచేస్తుండటం కాంగ్రెస్ కు కలసి వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కలహాలు తమను గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. దిగ్విజయ్ సింగ్, కమల్ నాధ్, జ్యోతిరాదిత్య సింధియాలు గ్రూపులుగా విడిపోవడం, అర్బన్ నియోజకవర్గాల్లో ఇంకా పట్టు సాధించకపోవడం కాంగ్రెస్ కు మైనస్ గా మారింది. మధ్యప్రదేశ్ లో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటుందన్న వార్తలు కమలనాధుల్లో కొంత ఉత్తేజాన్ని నింపాయి. ఈరెండు రాష్ట్రాల్లో గెలిస్తే ఖచ్చితంగా అక్కడి ముఖ్యమంత్రుల ఖాతాలో పడుతుంది. ఓడిపోతే మాత్రం మోదీ అకౌంట్లో వేసేస్తారు. మొత్తం మీద రెండు రాష్ట్రాల్లోనైనా గెలిచి వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలన్న మోదీ, షాల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*