సింహం… షెకావత్…ను విస్మరించారా…??

భైరాన్ సింగ్ షెకావత్…. భారతీయ జన్ సంఘ్, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ వంటి దిగ్గజ నాయకుల సమకాలీకుడు. బీజేపీ ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషించిన వారలో ఒకరు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు శాసనసభ్యుడిగా, మూడుసార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడు. రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన ఉప రాష్ట్రపతి పదవి అలంకరించిన తొలి బీజేపీ నాయకుడు షెకావత్ కావడం విశేషం. రాష్ట్రపతి పదవి కోసం 2007లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభాపాటిల్ తో పోటీపడిన ధీశాలి. రాజస్థాన్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెసేతర సీఎంగా చరిత్ర సృష్టించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భైరాన్ సింగ్ షెకావత్ పై “తెలుగుపోస్ట్” ప్రత్యేక కథనం….

బీజేపీ ఎదుగుదలకు……

1923 అక్టోబరు 23న జన్మించిన షెకావత్ రాజస్థాన్ లో పార్టీ ఎదుగుదలకు తన జీవితాన్ని అంకితం చేశారు. నాడు నీరు పోసి పార్టీని పెంచి పెద్ద చేసిన నాయకుడు. రాజస్థాన్ బీజేపీ అంటే షెకావత్….షెకావత్ అంటే రాజస్థాన్ బీజేపీ అని పేరు తెచ్చుకున్నారు. బతికున్నంతకాలం రాష్ట్ర బీజేపీలో ఆయన మాటకు ఎదురులేదు. తిరుగులేదు. పార్టీ శ్రేణుల నుంచి ఢిల్లీలోని నాయకత్వం వరకూ షెకావత్ మాట వేదవాక్కు. షెకావత్ కు తనకంటూ ప్రత్యేక నియోజకవర్గం లేదు. రాష్ట్రం మొత్తం తనదేనని ఆయన తరచూ చెప్పేవారు. తాను ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడిని కానని, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉందని పేర్కొనేవారు. అన్నట్లుగానే ఆయన ప్రతిసారీ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రజల మన్ననలను అందుకునేవారు.

రాజకీయాల్లోకి……

రాజస్థాన్ సింహంగా పేరొందిన షెకావత్ 1952 లో రాజకీయల్లోకి ప్రవేశించారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రామ్ గర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1957లో శ్రమధోపూర్ స్థానం నుంచి ఎన్నికై అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. 1962, 1967 ఎన్నికల్లో “కిసాన్ పోల్” నియోజకవర్గం నుంచి విజయబావుటా ఎగురవేశారు. 1972లో మాత్రం ఓడిపోయారు. 1973లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పెద్దల సభలో తన ప్రతిభను చాటుకున్నారు. 1975లో అత్యవసర పరిస్థిత సమయంలో నాటి ఇందిర ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి హర్యానాలోని రోహతక్ జైల్లో నిర్బంధించింది. అత్యవసర పరిస్థితి అనంతరం 1977లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. నాటి ఎన్నికల్లో మొత్తం 200 స్థానాలకు జనతా పార్టీ 151 స్థానాలను గెలుచుకోవడంతో షెకావత్ ముఖ్యమంత్రి పదవికి ఎన్నికయ్యారు. తద్వారా తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. 1980లో జరిగిన లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపట్టిన ఇందిరాగాంధీ….షెకావత్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 1980లో బీజేపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరిన షెకావత్ తిరిగి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయిదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1989 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, జనతాదళ్ మొత్తం 25 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్నాయి. 1990 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనతాదళ్ సంకీర్ణం అధికారంలోకి రావడంతో షెకావత్ రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ఈసారి ధోల్ పూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి బీజేపీ పాల్పడిందంటూ కేంద్రంలోని నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం షెకావత్ సర్కార్ ను 1992లో రద్దు చేసింది. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో షెకావత్ సారథ్యంలోని బీజేపీ 96 స్థానాలను సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ముచ్చటగా మూడోసారి షెకావత్ ముఖ్యమంత్రి అయ్యారు.

ఉపరాష్ట్రపతిగా……

నాటి ఎన్నికల్లో బాలి, గంగానగర్ ల నుంచి పోటీ చేసిన ఆయన బాలిలో మాత్రమే గెలిచారు. గంగానగర్ లో ఓటమి పాలయ్యారు. 1998లో మళ్లీ బాలి నుంచి ఎన్నికైనప్పటికీ పార్టీ ఓడిపోవడంతో విపక్ష నేతగా వ్యవహరించారు. ఒక్క 1972లో తప్ప ప్రతి ఎన్నికలోనూ విజయం సాధించడం విశేషం. 2002లో ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసి కాంగ్రస్ అభ్యర్థి సుశీల్ కుమార్ షిండేని ఓడించారు. షెకావత్ 149 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి బీజేపీ నాయకుడిగా చరిత్ర నెలకొల్పారు. 2007 జులైలో రాష్ట్ర పతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు. యూపీఏ అభ్యర్థిగా ప్రతిభాపాటిల్ పై పోటీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో జులై 21న ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.

పేదల అభ్యున్నతి కోసం…..

మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షెకావత్ పేదల అభ్యున్నతికి పలు పథకాలను ప్రవేశపెట్టారు. అక్షరాస్యత పెంపుదలకు, పారిశ్రామికంగా పర్యాటకంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు. ఛైర్మన్ గా రాజ్యసభలో ఆయన నిర్వహించిన తీరు పలువురి ప్రశంసలను అందుకుంది. ముఖ్యమంత్రిగా పేదల కోసం “అంత్యోదయ యోజన” పథకాన్ని ప్రవేశపెట్టారు. గ్రామీణ విద్యుదీకరణ, పేదలకు గృహ నిర్మాణం ద్వారా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందువల్లే రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి పోటీ చేసినా ఎదురులేకుండా ఎన్నికయ్యారు. ఒక్క 1972లో తప్ప ప్రతిసారీ విజయం సాధిస్తూ వచ్చారు. తొలి అసెంబ్లీ ఎన్నికలు 1952 నుంచి 2002 వరకు యాభై ఏళ్ల పాటు చట్ట సభ సభ్యుడిగా ఉన్నారు. మధ్యలో ఒక్క ఆరేళ్లు మాత్రం రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. బీజేపీలో ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ చెప్పినట్లు వ్యవహరించేవారు కారు. ఛాందసవాదానికి దూరంగా ఉండేవారు. తన అయిదు దశాబ్దాల ప్రజా జీవితంలో అవినీతి ఆరోపణల మకిలి ఆయనకు అంటలేదు. స్వచ్ఛమైన నాయకుడిగా, ప్రజాదరణ కలిగిన నాయకుడిగా అందరి మన్ననలను అందుకున్నారు. నేటి తరం నాయకులు షెకావత్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కమలం పార్టీ ఇందుకు మినహాయింపు కాదు. రాష్ట్ర చరిత్రలో అంత గొప్ప నాయకుడిని సమీప భవిష్యత్తులో చూడలేం….!!!

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*