భూమా ఫ్యామిలీకి టెన్షన్…టెన్షన్?

భూమా కుటుంబానికి మూడు సీట్లు. ఈసారి ఈ మూడు సీట్లలో వారు చెమటోడ్చకతప్పదంటున్నారు. కర్నూలు పట్టణ నియోజకవర్గాన్ని పక్కన పెడితే భూమా దంపతులు ప్రాతినిధ్యం వహించిన ఆళ్లగడ్డ, నంద్యాల మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. భూమా దంపతుల హఠాన్మరణంతో వారి వారసులు రాజకీయాల్లో అనుకోకుండా వచ్చేశారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ గెలుపొందగా, నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలో భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డి భారీ మెజారీటీతో విజయం సాధించారు. అయితే ఈసారి మాత్రం ఈ రెండు సీట్లు గెలుచుకోవడం భూమా కుటుంబానికి కష్టమేనంటున్నారు. ఇటు సొంత పార్టీలో వ్యతిరేకతతో పాటు ప్రత్యర్థులు బలంగా ఉండటమే ఇందుకు కారణం.

అఖిలపై అసంతృప్తి…..

ఆళ్లగడ్డ విషయానికొస్తే మంత్రి భూమా అఖిలప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భూమా శోభానాగిరెడ్డి హయాంలో క్యాడర్ లోనూ, ప్రజల్లోనూ మంచి పట్టుండేది. కాని అఖిలప్రియ హయాంలో క్యాడర్ ను కూడా దూరం చేసుకుందంటున్నారు. అలాగే ఏవీ సుబ్బారెడ్డి లాంటి నేతలు అఖిలను వచ్చే ఎన్నికల్లో దెబ్బేయడానికి కాచుక్కూర్చున్నారు. అఖిలప్రియకు ప్రజల్లోకన్నా పార్టీలోనే ఎక్కువ వ్యతిరేకత ఉండటంతో అఖిల గెలుపు నల్లేరు మీద నడక కాదని తెలుస్తోంది. ఆళ్లగడ్డలో సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలను అఖిల చే్స్తున్నప్పటికీ ప్రజాదరణ మాత్రం పొందలేకపోయారని, కలివిడిగా అందరితో మాట్లాడకపోవడం, సన్నిహితులను కూడా దూరం చేసుకోవడంతో అఖిలకు ఇబ్బందులు తప్పవంటున్నారు.

గంగుల ఫ్యామిలీ నుంచి…..

ఇదే ఆళ్లగడ్డలో ఇప్పుడు గంగుల ప్రభాకర్ రెడ్డి తనయుడు విజయేంద్రరెడ్డి అలియాస్ నాని దూసుకు వెళుతున్నారు. జగన్ పాదయాత్రలోనే ఆళ్లగడ్డలో నాని తన సత్తా చూపించాడంటున్నారు. భూమా, గంగుల ఫ్యామిలీకి దశాబ్దాల నుంచి వైరం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా గంగుల విజయేంద్రరెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారయింది. నాని యువకుడు కావడంతో ప్రజాసమస్యలపై ఆందోళనలు చేస్తూ జనం వద్దకు చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, మంత్రిపై ఉన్న అసంతృప్తి తనను గెలిపిస్తాయని విజయేంద్రరెడ్డి చెబుతున్నారు.

శిల్పా కుమారుడు బరిలో…

నంద్యాల నియోజకవర్గానికి వస్తే భూమా బ్రహ్మానందరెడ్డి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతోనే విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఈ ఎన్నికలలో భారీతేడాతో ఓటమి పాలయ్యారు. మంత్రివర్గమంతా ఉప ఎన్నికల్లో తిష్టవేయడంతో ఓటమి పాలు కావాల్సి వచ్చిందని శిల్పా అభిప్రాయంగా ఉంది. ఎన్నికల సమయంలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆయన ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు రవి రెడ్డిని బరిలోకి దించుతున్నారు. ఇప్పటికే రవి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో ఈసారి నంద్యాల, ఆళ్లగడ్ల ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పక తప్పదు. ఏది ఏమైనా ఈసారి ఈ రెండు నియోజకవర్గాల్లో ఉత్కంఠ పోరు నెలకొంటుందన్నది వాస్తవం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*