సీఎంను ఓడించేందుకు సీక్రెట్ ప్లాన్‌

క‌ర్ణాట‌క‌లో బీజేపీ వ్యూహాల‌కు సీఎం సిద్ధరామ‌య్య చిక్కడం లేదు.. క‌మ‌ల‌ద‌ళం ఎత్తుల‌ను చిత్తు చేస్తూ త‌న స‌త్తాచాటుతున్నాడు. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి ద‌క్షినాదిన పాగా వేయాల‌ని చూస్తున్న బీజేపీని సిద్దు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. తాజాగా సీఎం సిద్ధరామ‌య్యను ఓడించేందుకు బీజేపీ-జేడీఎస్ సీక్రెట్ ప్లాన్ వేసిన‌ట్లు స‌మాచారం. అయితే దానిని తిప్పికొట్టేందుకు సిద్దరామ‌య్య మాస్టర్ ప్లాన్ వేసిన‌ట్లు తెలిసింది. సిద్ధరామయ్య నార్త్ కర్ణాటక నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు స్పష్టంగా ప్రకటించిన సిద్ధరామయ్య ఆయన శ్రేయాభిలాషుల సూచన మేరకు రెండో సీటులో కూడా నిలబడాలని నిర్ణయించుకున్నారని, ఇందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ కూడా సుముఖత వ్యక్తం చేశారని స‌మాచారం.

ఇక్కడ ర‌హ‌స్య ఒప్పందం….

చాముండేశ్వరి నియోజకవర్గంలో ఇప్పటికే జేడీఎస్, బీజేపీ మధ్య రహస్యంగా ఒప్పందం కుదిరిన‌ట్లు స‌మాచారం. దీనిని ప‌సిగ‌ట్టి ముందు జాగ్రత్తగా ప‌క్కాగా గెలిచే అవకాశాలున్న మరో నియోజకవర్గం నుంచి కూడా నామినేషన్ వేయాలని పార్టీ కార్యకర్తలు సిద్ధరామయ్యపై ఒత్తిడి చేస్తున్నట్లు స‌మాచారం. ఈ నేపథ్యంలో చాముండేశ్వరితో పాటు బాగల్‌కోట్ జిల్లాలోని బదామి నుంచి కూడా సిద్ధరామయ్య పోటీ చేసే అవకాశాలున్నాయని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. కాగా, కేపీసీసీ చీఫ్ జి.పరమేశ్వర్ సైతం రెండు సీట్లలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆయన 30,000 ఓట్లతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆయన సైతం తుంకూరు జిల్లాలోని కోరాటగెరెతో పాటు బెంగళూరులోని పులికేశినగర్ నుంచి పోటీ చేస్తారని సమాచారం. అయితే దీనికి రాహుల్ ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.

బ‌దామి నుంచి కూడా…..

సిద్ధరామయ్య పోటీ చేసే అవకాశం ఉన్న బదామీ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో కురుబ ఓటర్లు ఉన్నారు. సిద్ధరామయ్య కూడా కురుబ సామాజిక వర్గానికి చెందినవారే. సిద్ధరామయ్య ప్రస్తుతం మైసూరు జిల్లా వరుణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ నియోజకవర్గాన్ని తన కుమారుడు డాక్టర్ యతీంద్ర కోసం ఖాళీ చేశారు. సిద్ధరామయ్య 1983 నుంచి 2008 వరకూ చాముండేశ్వరి నుంచి ఐదుసార్లు గెలుపొందారు. తొలిసారి ఇండిపెండెంట్‌గా, రెండు, మూడోసారి జనతాపార్టీ టిక్కెట్‌పై, నాల్గోసారి జేడీఎస్ టిక్కెట్‌పై, గత ఎన్నికల్లో (ఐదోసారి) కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలుపొందారు.

ఇక్కడ సిద్ధూను ఓడించాలని….

చాముండేశ్వరి నియోజ‌క‌వ‌ర్గంలో సిద్ధరామ‌య్యను ఎలాగైనా ఓడించేందుకు బీజేపీ – జేడీఎస్ మ‌ధ్య కుదిరిన ఒప్పందంపై ఇప్పటికే మ్యాట‌ర్ లీక్ అయ్యింది. దీనిపై సిద్ధరామ‌య్యకు పార్టీతో పాటు ఆయ‌న చేయించుకున్న అంత‌ర్గత స‌ర్వేల్లో త‌న ఓట‌మికి ఆ రెండు పార్టీలు స్కెచ్ వేసిన‌ట్టు తేట‌తెల్లమైంది. ఈ క్రమంలోనే రిస్క్ తీసుకునేందుకు ఇష్టం లేక సిద్ధరామ‌య్య కూడా కార్యక‌ర్తలు, కీల‌క నాయ‌కుల ఒత్తిడితో బ‌దామి నుంచి కూడా పోటీకి రెడీ అవుతున్నారు. అక్కడ క‌మ్యూనిటీ బ‌లంగా కూడా గ‌ట్టిగా ఉండ‌డం, పార్టీ కూడా స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో ఆయ‌న‌కు ఇబ్బంది ఉండ‌ద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఇక ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతున్న కొద్ది క‌ర్ణాట‌క‌లో మ‌రెన్ని రాజ‌కీయ చిత్రాలు, సంచ‌ల‌నాలు న‌మోదు అవుతాయో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*