బీజేపీ ఇక మొదలు పెట్టేసింది….!

ఏపీ రాజకీయాల్లో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది. ఇటీవల కాలంలో బీజేపీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మోడీని సయితం వదలడం లేదు. మోడీ నమ్మక ద్రోహి అంటూ ఘాటైన కామెంట్లే చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతల తిట్ల పురాణాన్ని చెప్పక్కర్లేదు. మోడీ, బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా టీడీపీని టార్గెట్ చేసేందుకు సిద్ధమయింది. టీడీపీ విమర్శలను అడ్డుకోకుంటే అసలకే ఎసరు వస్తుందని భవించిన కమలనాధులు రంగంలోకి దిగారు.

సిద్ధంగా ఉన్నప్పటికీ…..

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏం చేసిందన్న దానిపై ఒక బుక్ లెట్ ను బీజేపీ విడుదల చేసింది. ప్రత్యేక హోదాకు ఉన్న అదనపు సాయాన్ని లెక్కేసి మరీ కేంద్రం ఏపీకి 16 వేల కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడాన్ని బీజేపీ నేతలు తప్పుపట్టారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రాష్ట్రానికి 82 శాతం అదనంగా నిధులు వచ్చాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.

బురద జల్లే కార్యక్రమం……

అంతేకాదు ప్రత్యేక హోదా సంజీవిని కాదని చెప్పిన చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కేంద్రంపై బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని వారు తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. అలాగే విదేశాలకు వెళ్లిన చంద్రబాబు అక్కడ కూడా ప్రధాని మోడీని విమర్శించడాన్ని తప్పుపట్టారు. ప్రధానిని విదేశాల్లో తిడితే దేశంలోని ప్రతి పౌరుడిని తిట్టినట్లేనని వారు అభిప్రాయపడ్డారు. మోడీ దీక్ష చేస్తే వెటకారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఈ నెల 20వ తేదీన దీక్ష ఎందుకు చేస్తున్నారో చెప్పాలని బీజేపీ నేతలు కంభంపాటి హరిబాబు, విష్ణుకుమార్ రాజులు నిలదీశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*