బొమ్మిరెడ్డి క్విట్… హాట్ సీట్ లో ఆనం….!

ఆనం రామనారాయణరెడ్డి వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టారు. ఆత్మకూరు టిక్కెట్ తనకు కాదని తెలియడంతో ఆయన తనకు కేటాయించనున్న వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దాదాపు సిద్ధమయిపోయారు. ఒకటి కావాలంటే మరొకటి వదులోక తప్పదన్న సూత్రాన్ని ఆనం పాటిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి దశాబ్దకాలంగా ప్రాధాన్యత వహిస్తూవచ్చిన ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి అదే నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా మారారు. అదే పార్టీలో ఉండి ఆత్మకూరు నియోజకవర్గంనుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని ఆనం తలంచారు. కాని టీడీపీ నేతలతో పొసగని ఆనం రామనారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. తర్వాత వై.ఎస్. జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.

వెంకటగిరికి ఫిక్స్ అయి…..

అయితే వైఎస్సార్సీపీలో చేరినా ఆనం కోరిక ఫలించబోదు. ఈ సంగతి ఆయనకు ముందే తెలుసు. ఎందుకంటే ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి గౌతమ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను కాదని తనకు టిక్కెట్ జగన్ ఇవ్వరన్న విషయం ఆయనకు తెలియంది కాదు. అయితే అన్నీ లెక్కలు వేసుకునే మరీ ఆనం ఫ్యాన్ పార్టీవైపు పరుగులు తీశారు. ఆనం కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి, నెల్లూరు టౌన్ నియోజకవర్గాలతో సంబంధాలున్నాయి. అయితే అన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులు ఆల్రెడీ ఉన్నారు. ఒక్క వెంకటగిరి నియోజకవర్గమే ఖాళీగా ఉండటంతో ఆనం అక్కడకు షిఫ్ట్ అవ్వాలని ముందుగానే ఊహించారు. ఆనం అనుకున్నట్లుగానే జగన్ కూడా వెంకటగిరికి వెళ్లిపొమ్మన్నారు.

బొమ్మిరెడ్డి ఇబ్బందులని…..

కాని వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డికి పట్టు ఉంటే ఉండొచ్చు కాని అప్పటికే నాలుగేళ్ల నుంచి ఆ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్న జడ్పీ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఖచ్చితంగా అసమ్మతి స్వరం విన్పిస్తారు. అది కూడా ముందుగానే ఊహించిందే. బొమ్మిరెడ్డి వర్గీయులందరూ తనకు వ్యతిరేకమవుతారని తెలుసు. అయితే బొమ్మిరెడ్డి తెలుగుదేశంపార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవ్వడం, వైసీపీ అధినేత జగన్ ను వ్యక్తిగతంగా దూషించడం ఆనం కు ప్లస్ అయిందంటున్నారు. జగన్ గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇస్తారు కాని, టిక్కెట్ ఇవ్వనంత మాత్రాన అలా పార్టీ అధినేతపై నోరుపారేసుకోవడమేంటని అప్పటి వరకూ బొమ్మిరెడ్డికి సన్నిహితులుగా ఉన్న వారు సయితం ముక్కున వేలేసుకున్నారు.

వరుస సమావేశాలతో…..

బొమ్మిరెడ్డి పార్టీ నుంచి క్విట్ అవుతుండటంతో అప్పటి వరకూ మౌనంగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి కార్యక్షేత్రంలోకి దిగారు. ఇప్పటికే వెంకటగిరి నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో ఆనం సమావేశమవుతున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నియోజకవర్గంలో పర్యటించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఆనంను నెల్లూరుకు వచ్చి మరీ వెంకటగిరి నియోజకవర్గం నుంచి నేతలు వచ్చి తమ మద్దతును తెలుపుతున్నారు. వీరిలో బొమ్మిరెడ్డి బంధువులు కూడా ఉండటం విశేషం. మొత్తం మీద ఆనం రామనారాయణరెడ్డి ఈసారి వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు త్వరలోనే ప్రచారంలోకి దిగనున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 16632 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*