జగన్ ను టార్గెట్ చేసింది అందుకేనా?

బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర రెడ్డి. రాత్రికి రాత్రి రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌న తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల ద్వారా సంచ‌ల‌నం సృష్టించి న ఓ నాయ‌కుడు! కేవ‌లం నెల్లూరుకే ప‌రిమిత‌మైన బొమ్మిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా వారం రోజులుగా బాగా వార్త‌ల్లో నానుతున్నారు. అయితే, ఆయ‌న వ్యూహాత్మకంగానే రాజ‌కీయాల్లో ఇలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు. ఇదెలా ఉన్నా.. త్వ‌ర‌లోనే బొమ్మిరెడ్డి టీడీపీలోకి చేరిపోతున్నార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీ ముఖ్యనేతలంతా బొమ్మిరెడ్డితో సంప్రదింపులు జరుపుతూ టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు.

చంద్రబాబు వచ్చిన తర్వాతే…..

అయితే బొమ్మిరెడ్డి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం విదేశీ పర్యటన ముగించుకొని అమరావతి చేరిన తరువాత బొమ్మిరెడ్డి విషయంలో క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి బయటకు వచ్చిన బొమ్మిరెడ్డి వ్యూహాత్మ‌కంగానే జ‌గ‌న్‌ను టార్గెట్ చేసుకున్నాడు. ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఒకింత ప్ర‌భావం చూప‌గ‌లిగే స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ.. అసెంబ్లీకి ఎన్నిక‌య్యే స‌త్తా ఆయ‌న‌కు లేద‌న్న‌ది వాస్త‌వం. కానీ, ఈ మాత్రం కూడా బ‌లం లేని టీడీపీ ఇప్పుడు బొమ్మిరెడ్డి చుట్టూ గిరికీలు కొడుతోంది. జెడ్పీ చైర్మ‌న్‌గా ఉన్న ఆయ‌న నిన్న‌టి వ‌ర‌కు వైసీపీ వెంకటగిరి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతున్నారు.

టీడీపీ ఆశలు అవే……

అయితే జ‌గ‌న్ స‌డెన్‌గా వెంకటగిరి నుంచి ఆయ‌న్ను త‌ప్పించి మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి ప‌గ్గాలు ఇవ్వ‌డంతో బొమ్మిరెడ్డి జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. బొమ్మిరెడ్డి తండ్రి సుందరరామిరెడ్డి ఆత్మకూరు నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాదు.. బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలతోపాటు నాయకులతో కూడా ఈ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కొమ్మి లక్ష్మయ్య నాయుడు, బొల్లినేని కుటుంబాలతో రాఘవేంద్రరెడ్డి కుటుంబాలకు సత్సంబంధాలు ఉన్నాయి. బొమ్మిరెడ్డిని పార్టీలో కలుపుకుంటే ఆత్మకూరులో పార్టీ పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుందని టీడీపీ అంచనా.

వ్యూహాత్మకంగానే……

బొల్లినేని, కొమ్మి, బొమ్మిరెడ్డి, కన్నబాబు, డీసీసీబీ చైర్మన్‌ ధనంజయరెడ్డిలు జత కలిస్తే ఆత్మకూరులో గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ విశ్వసిస్తోంది. ఈయన చేరికవల్ల వెంకటగిరి నియోజకవర్గంలో సైతం టీడీపీకి లాభం చేకూరే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మంత్రులతో సహా జిల్లా పరిధిలోని ముఖ్య నాయకులంతా బొమ్మిరెడ్డిని పరామర్శ పేరుతో పలకరిస్తూ, మెల్లగా తమ మనసులో మాట చెబుతున్నారు. మొత్తానికి వ్యూహాత్మ‌కంగానే విష‌యం న‌డుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మరి చంద్రబాబు వచ్చిన తర్వాత బొమ్మిరెడ్డి విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*