బుచ్చయ్యా.. ఎక్కడున్నావయ్యా?!

ఆయ‌న కాక‌లు తీరిన తెలుగు దేశం పార్టీ నేత‌. రాజ‌కీయ ఉద్ధండుల‌కే పాఠాలు నేర్పగ‌ల దిట్ట. విప‌క్షాల‌కు చుక్కలు చూపించే చ‌మ‌త్కారం ఉన్న ప్రావీణ్యుడు. ఆయ‌నే రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే టీడీపీ సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి. ఇప్పుడు ఈయ‌న అదృష్టం తిర‌గ‌బ‌డింద‌నే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజ‌కీయాల్లోను, ముఖ్యంగా టీడీపీ రాజ‌కీయాల్లోనూ సీనియ‌ర్ మోస్ట్ అయిన బుచ్చయ్య చౌద‌రి.. గ‌తంలో 5 సార్లు అసెంబ్లీకి ఎన్నిక‌య్యాడు. టీడీపీ ఆవిర్భావం నుంచి రాజ‌కీయాల్లో ఉన్న ఆయ‌న నాలుగు సార్లు రాజ‌మండ్రి సిటీ నుంచి ప్రస్తుతం రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. గ‌తంలో ఉమ్మడి రాష్ట్ర మంత్రి వ‌ర్గంలో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రిగానూ ప‌నిచేశారు. ముక్కుమీదే కోపం ఉండే బుచ్చయ్య చౌద‌రి.. ప్రతిప‌క్షా ల‌తో ఆడుకోవ‌డం అంటే మ‌హాఇష్టం. ఈ క్రమంలోనే ఆయ‌న వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను అసెంబ్లీలోనే ఆట‌ప‌ట్టించి రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు.

ఎన్నో ఆశలు…..

ప్రధానంగా చంద్రబాబుపై ఈగైనా వాల‌నివ్వని నేత‌ల్లో బుచ్చయ్య ఒక‌రు. అలాంటి నేత ఇప్పుడు సైలెంట్ అయిపోయా రు. అంతేనా అసలు ఎక్కడా ఆయ‌న పేరుగానీ, ఆయ‌న ఊసుకానీ వినిపించ‌డం లేదు. ఆయ‌న టీడీపీలోనేఉన్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమ‌వుతున్నాయి. మ‌రి దీని వెనుక ఏముంది? ఏం జ‌రిగింది? అనే విష‌యాన్ని చూస్తే.. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన స‌మయంలో త‌న సీనియార్టీని చంద్రబాబు గౌర‌విస్తార‌ని, త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తార ని బుచ్చయ్య ఆశ‌లు పెట్టుకున్నారు. ఆయ‌న అనుచరులు ఏకంగా పండ‌గ చేసుకున్నారు. అయితే, అప్పటి ప‌రిస్థితిలో బుచ్చయ్యకు అవ‌కాశం ద‌క్కలేదు. ఇక‌, 2017 ఏప్రిల్‌లో మంత్రి వ‌ర్గాన్ని పున‌ర్ వ్యవ‌స్థీక‌రించారు. ఈ సంద‌ర్భంలోనైనా త‌న‌కు ఛాన్స్ ద‌క్కుతుంద‌ని బుచ్చయ్య అనుకున్నారు. ముఖ్యంగా తాను వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై చేస్తున్న పోరాటాన్ని బాబు గుర్తిస్తారని బుచ్చయ్య భావించారు.

మనస్థాపానికి గురై…..

అయితే, అప్పుడు కూడా బాబు నుంచి రిక్తహ‌స్తమే ఎదురైంది. దీంతో బుచ్చయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక‌, తాను పార్టీలో ఉండి లాభం ఏంట‌ని ప్రశ్నించారు. త‌న సీనియార్టీకి విలువ లేదా?; అని నిలదీశారు. అయినా కూడా బాబు బుజ్జగించారే త‌ప్ప ప‌ద‌వి మాత్రం ఇవ్వలేదు. ఆయ‌న తన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసే వ‌ర‌కు వ్యవ‌హారం వెళ్లింది. చివ‌ర‌కు ఏమైందో గాని ఆయ‌న సైలెంట్ అయిపోయారు. ఇక‌, ఇటీవ‌ల చంద్రబాబు పలు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను పందేరం చేశారు. నిన్నగాక మొన్న పార్టీలోకి చేరిన వారికి సైతం కీల‌క‌మైన ప‌ద‌వులు అప్పగించారు. ఈ స‌మ‌యంలోనైనా త‌న‌ను ఆర్టీసీ చైర్మన్‌ను చేస్తార‌ని, లేదా టీటీడీ బోర్డులో నియ‌మిస్తార‌ని బుచ్చయ్య భావించారు. ఈ రెండు విష‌యాలే కాదు.. ఏ విష‌యంలోనూ బాబు ఆయ‌న‌కు త‌గిన ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో బుచ్చయ్యకు ఏ ప‌ద‌వీ ద‌క్కలేదు. ఇక‌, బుచ్చయ్య రోడ్డు మీద‌కు కూడా రావ‌డం మానేశారు. త‌న‌క‌న్నా వెనుక వ‌చ్చిన అనేక మందికి ప‌దవులు ద‌క్కుతున్నా యని, త‌న‌ను మాత్రం బాబు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బుచ్చయ్య తీవ్ర మ‌న‌స్థాపంతో ఉన్నారు. రాష్ట్రం మొత్తం కేంద్రంపై మాట‌ల దాడి చేస్తున్నా.. బుచ్చయ్య ఇప్పటి వ‌ర‌కు నోరు మెద‌ప లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టిక్కెట్ రాద‌న్న ప్రచారం కూడా జ‌రుగుతోంది. మ‌రి రాబోయే రోజుల్లో ఈయ‌న ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*