అవిశ్వాసం పై చర్చలో పాల్గొన్న వైసిపి ఎంపి

అవును అవిశ్వాసంలో వైసిపి ఎంపీ చర్చలో పాల్గొన్నారు. అందరు రాజీనామాలు చేస్తే ఇంకెలా పాల్గొంటారనుకుంటే పొరపాటే. వైసిపి నుంచి జంప్ అయ్యి టిడిపి లోకి దూకిన బుట్టా రేణుక ఇప్పటికి వైఎసార్సీపి తరపున సాంకేతికంగా సభ్యురాలు. శుక్రవారం పార్లమెంట్ లో జరిగిన చర్చలో బుట్టా రేణుకకు కూడా అవకాశం వచ్చింది. ఆమె కొద్ది సేపు విభజన తరువాత ఎపి ఎలాంటి దుస్థితిలో ఉందొ సభకు వివరించారు. దాంతో చారిత్రక చర్చలో వైసిపి లేకుండా పోయిందన్న పరిస్థితి మరోరకంగా ఆ పార్టీకి రికార్డ్ ప్రకారం తప్పినట్లే. లోక్ సభ రికార్డ్ ల ప్రకారం రేణుక వైసీపీ ఎంపీ గానే కొనసాగుతున్నారు. ఆమెపై వైసిపి ఇచ్చిన అనర్హత పిటిషన్ పై ఇంతవరకు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి స్పీకర్ చర్య తీసుకుంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆమె అనర్హురాలయ్యేది. కానీ నిన్న మొన్నటి వరకు ఎన్డీయే లో టిడిపి ఉండటంతో ఇలాంటివన్నీ పక్కన పెట్టేశారు. ఇలాంటి పరిస్థితి బీహార్ రాజ్యసభ అంశంలో ఎదురైనప్పుడు వారు తమకు వ్యతిరేకమన్న భావనతో వెంకయ్యనాయుడు ఆ సభ్యుల సభ్యత్వం రద్దు చేసి పారేశారు. కానీ రేణుక వంటి కొందరి విషయంలో మాత్రం వ్యవహారం కామ్ గా నడిపిస్తూ వస్తున్నారు.

ఎపి తెలంగాణాలో అదే …

పార్టీ ఫిరాయింపుల చట్టానికి ఎపి తెలంగాణాలో కూడా తూట్లు పడ్డాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ మారిన ఎమ్యెల్యేలు అనర్హులు కాకుండా స్పీకర్లు ఏ నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేశారు. దీనిపై విపక్ష పార్టీలు గగ్గోలు పెట్టినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి సరైన కాలపరిమితి అంటూ లేకపోవడంతో ఫిరాయింపుల చట్టం చెప్పుకోవడానికే పని చేస్తుంది. చట్టాలు చేసే వారే వాటిని పాటించడం లేదన్న భావన ప్రజల్లో ఏర్పడి నేతలను పలుచనగా చూసే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి పార్టీ మారేముందు సదరు చట్ట సభ సభ్యుడు పదవికి, పార్టీకి రాజీనామాలు చేసి గోడదూకడం అనే సంప్రదాయం కనుమరుగవుతుంది. కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన ఎన్నికలను ఎదుర్కోవడం ఒక సమస్యగా ఉంటే తిరిగి గెలుస్తామో లేదో నన్న భయం పార్టీ మారేవారిని, వారిని తమ పార్టీలో కలిపేసుకున్నవారికి ఏర్పడుతుంది. దాంతో అనైతిక ఫిరాయింపులకు తెర ఎత్తేస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ వ్యవహారాలపై సుప్రీం లో కోకొల్లలుగా కేసులు సైతం నడుస్తూనే వున్నా తీర్పు మాత్రం రాకపోవడం ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*