ఎవరి మాట నెగ్గేను….?

ఇంకా తొమ్మిది రోజులే సమయం. కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ తేదీ ఖరారు కావడంతో ఆశావహులందరూ హస్తిన బాట పట్టారు. ఈ నెల 10వ తేదీన మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ విస్తరణలో కేవలం ఆరుగురికే స్థానం దక్కనుంది. మరి జేడీఎస్ తమకు రెండు మంత్రి పదవులు కావాలని కోరుతోంది. జనతాదళ్ ఎస్ కు రెండు స్థానాలు ఇస్తే కాంగ్రెస్ నాలుగు మంత్రిపదవులే దక్కుతాయి. అయితే మంత్రి పదవిని కోరుకునే వాళ్లు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే కొందరు ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ కు దిగారు.

జాబితా హైకమాండ్ వద్ద……

అయితే ఢిల్లీ అధిష్టానం మాత్రం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబితా ప్రకారమే నడుచుకోవాలని సూచిస్తోంది. సామాజిక వర్గాలు, ప్రాంతాల సమతూకంతో మంత్రి వర్గ విస్తరణ చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చిన సిద్ధరామయ్య పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావుతో కలసి కూర్చుని ఒక జాబితాను రూపొందించారని చెబుతున్నారు. ఇందులో తొలి నుంచి అసంతృప్తితో రగలిపోతున్న ఎంబీ పాటిల్, హెచ్.కె. పాటిల్ వంటి నేతలకు స్థానం కల్పించినట్లు వార్తలు అందుతున్నాయి. వీరితో పాటుగా ఇప్పటి వరకూ మంత్రి వదవి దక్కని బళ్లారి ప్రాంతానికి, ఉత్తర కర్ణాటకలో సీనియర్ నేతలకు స్థానం ఉందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అసంతృప్తి నేతలకు……

సీనియర్ నేత ఎంబీ పాటిల్ గత మూడు నెలల నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన అనేకమార్లు ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారు. ఈసారి తనకు చోటు దక్కకుంటే తానేంటో చూపిస్తానని హెచ్చరికలు కూడా ఒకదశలో జారీ చేశారు. అలాగే హెచ్ కె పాటిల్ ది కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న హెచ్.కె. పాటిల్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇక ఇటీవల బెంగుళూరు మేయర్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన రామలింగారెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. రామలింగారెడ్డి లేకుంటే మేయర్ పదవి దక్కడం కష్టమయ్యేదని, ఆయనను ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంది.

కుమారస్వామి కూడా…..

తర్వాత ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తామని ముంబయి వెళ్లి మంతనాలు జరుపుతున్నారంటూ ప్రచారం జరిగిన నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయంటున్నారు. చిక్ బళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర, హోస్ కోటె నియోజకవర్గం ఎమ్మెల్యే నాగారాజులను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ సిద్ధరామయ్య సిఫార్సు ఎంత మేర పనిచేస్తుందో చూడాలి. మరోవైపు ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా మంత్రి వర్గ విస్తరణ లోపు ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. జేడీఎస్ లో కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నారని, వారిని బుజ్జగించేందుకు తమకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని నేరుగా రాహుల్ ను కోరనున్నారు. మంత్రి వర్గ విస్తరణ జరిపితే ఇప్పటికే అదనపు శాఖలను నిర్వహిస్తున్న మంత్రుల నుంచి వాటిని తప్పించాల్సి ఉంటుంది. సిద్ధరామయ్య మాత్రం కాంగ్రెస్ కే ఆరు మంత్రి పదవులు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందని చెబుతున్నారు. మరి ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*