ఈ స్పీడుతో కారును ఓవర్ టేక్ చేయగలరా..?

ఓ వైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుస్నాబాద్ వేదిక ప్రచార శంఖారావం పూరించారు. మళ్లీ టీఆర్ఎస్ ని ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే 105 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు. ఇంచుమించు అందరు అభ్యర్థులు ఇవాళ ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. మళ్లీ గెలుపుపై కేసీఆర్ చాలా దీమాగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రధాన పోటీదారుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం టీఆర్ఎస్ దూకుడును అందుకోలేక వెనకబడిపోతోంది. రాష్ట్ర పార్టీ నేతలు కొంత చురుగ్గానే వ్యవహరిస్తున్నా.. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మానస సరోవర్ యాత్రలో ఉండటం వల్ల కాంగ్రెస్ ఏ విషయంలోనూ ధైర్యంగా ముందుకు వెళ్లలేకపోతోంది.

మహాకూటమి ఏర్పాటు సాధ్యమేనా..?

రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా ఎక్కువ స్థానాల్లో ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్ – కాంగ్రెస్ ల మధ్యే ఉండనుంది. అయితే, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా 14 శాతం ఓట్లు సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రొ.కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జన సమితి పార్టీ కూడా బరిలో ఉండనుంది. అయితే, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే విపక్షాలకు ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. దీంతో టీఆర్ఎస్ ను ఓడించాలంటే పొత్తుల ద్వారానే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది కాంగ్రెస్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాలనుకుంటోంది. టీడీపీ కూడా ఇందుకు సిద్ధంగానే ఉంది. ఓట్లు చీలకుండా టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసమితితో కలిసి మహాకూటమిగా ఏర్పాడాలని భావిస్తోంది. అయితే, అందుకు తగ్గట్లుగా చర్చలు మాత్రం ఇంకా ప్రారభించలేదు. దీంతో పొత్తుల అంశం ముందుకు వెళ్లడం లేదు.

ఇంకా పొత్తుల చర్చలే లేవు…

ఇక కీలకమైన అభ్యర్థుల ఎంపికలోనూ కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో నిర్ణయం తీసుకునే పరిస్థితి కనపడటం లేదు. 60 స్థానాలకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నా రాహుల్ వచ్చేవరకు ప్రకటించే అవకశం లేదు. ఇందుకు మరో వారం రోజులైనా సమయం పట్టే అవకాశం ఉంది. ఇక 20 – 30 స్థానాల్లో కాంగ్రెస్ లో ఒకరికంటే ఎక్కువ మంది టిక్కెట్లు ఆశిస్తున్నారు. అయితే, అసలు ఇంకా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియే మొదలుకాలేదని, సర్వేల ఆధారంగానే టిక్కెట్లు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. టిక్కెట్ల కోసం ఢిల్లీకి, గాంధీ భవన్ కు రావద్దని నేతలను కోరారు. ఇక పొత్తులు ఖరారు, సీట్ల పంపకం, సీట్ల కేటాయింపుకే ఇంకా కనీసం 10-15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

ఇప్పటికైనా వేగం పెంచేనా..?

సహజంగా నామినేషన్ల దాఖలుకు సమయం ముగుస్తున్న వేళ టిక్కెట్లను ప్రకటించడం అనవాయితీగా వస్తోంది. అయితే, ప్రతిపక్షాల కటే వేగంగా వెళ్లేందుకు, టిక్కట్లు దక్కని అసంతృప్తులను బుజ్జగించేందుకు, వారి ప్రభావం లేకుండా చూసుకునేందుకు కేసీఆర్ చాలా ముందే అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ లో మాత్రం ఆ పరిస్థితి ఉండదు. టిక్కెట్లు దక్కని వారు రోడ్డుపైకి ఎక్కే అవకాశం ఉంటుంది. పార్టీకి వ్యతిరేకంగా మారతారు. మరి పొత్తులు ఫైనల్ కావడానికే 15 రోజులు సమయం పట్టనుండటంతో అప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులు ఒకదశ ప్రచారం కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మరి, కాంగ్రెస్ ఇప్పటికైనా వేగంగా స్పందించి టీఆర్ఎస్ కు పోటీగా పరిగెడుతుందో లేదో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*