తెలుగు రాజ‌కీయాల్లో కులాల లెక్కలివే…!

తెలుగు నాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొద‌లైన కుల‌రాజ‌కీయాలు ఇప్పుడు రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. రాజ‌కీయ నేత‌ల గెలుపు ఓట‌ముల‌తో పాటు ప్రభుత్వాల‌ను శాసించే ప‌రిస్థితికి కూడా కులాలు చేరిపోవ డం గ‌మ‌నార్హం. క‌మ్మ, కాపు, బీసీ వ‌ర్గాల‌కు ఎస్సీ సామాజిక వ‌ర్గాలు కూడా రాజ‌కీయంగా త‌మ రోల్‌ను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల ఏర్పాటుతో, ఆయా సామాజిక వ‌ర్గాల్లోని వారికి కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది. విషయంలోకి వెళ్తే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన‌ప్పటి నుంచి కాంగ్రెస్‌ను రెడ్డి కుల‌స్తులు తీవ్రంగా ప్రభావితం చేశారు. రెడ్డి పార్టీగా కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం పొందింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో వ‌చ్చి చీలిక‌తో రెడ్డి కాంగ్రెస్ కూడా ఏర్పాటైంది. ఇక న‌టుడు ఎన్టీఆర్ రాజ‌కీయ రంగ ప్రవేశం చేశాక‌.. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఎన్టీఆర్ భారీ మ‌ద్దతుదారుగా నిలిచారు.

ఎన్టీఆర్ కు మద్దతుగా…..

క‌మ్మసామాజిక వ‌ర్గం మొత్తం అప్పట్లో ఆయ‌న వెంటే న‌డిచింది. దీంతో అప్పటి ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ ఘ‌న విజ‌యం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక క‌మ్మ కుల‌స్తులు ఎక్కువుగా ఆ పార్టీకి, రెడ్లు మెజార్టీ కాంగ్రెస్ వైపు ఉంటూ వ‌చ్చారు. ఇక‌, అప్పటి కాంగ్రెస్ పాల‌న‌లో త‌మ‌కంటూ ఎలాంటి గుర్తింపున‌కు నోచుకోని బీసీ కులాల‌ను ఎన్టీఆర్ త‌న‌వైపు తిప్పుకొన్నారు. రాష్ట్రంలో వీరి సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌డంతో వారి అండ ఉంటే పార్టీని గెలిపించుకోవ‌డం న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని ఎన్టీఆర్ భావించారు. దీంతో బీసీల‌ను ఆర్థికంగా, సామాజికంగాకూడా బ‌లోపేతం చేశారు. బీసీ సంఘాల‌ను ఏర్పాటు చేశారు. బీసీల‌కు రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం పెంచారు. దీంతో బీసీలు మొత్తంగా టీడీపీ పంచ‌న చేరిపోయారు. అయితే సంఖ్యా ప‌రంగా ఎక్కువ మంది ఉండే కాపులు వంగ‌వీటి రంగా హ‌త్య త‌ర్వాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. తిరిగి 1994లో అదే కాపులు టీడీపీకి వ‌న్‌సైడ్‌గా ప‌నిచేశారు.

టీడీపీకి బీసీలు కొండంత…..

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా బీసీలు టీడీపీకి అండ‌గా ఉంటున్నారు. అయితే, ఇటీవ‌ల కాపు సామాజిక వ‌ర్గం త‌మ‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని డిమాండ్ చేయ‌డంతో చంద్రబాబు స్పందించారు. కాపుల‌కు 5% రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ.. ప్రతిపాద‌న‌ను ఆమోదించి కేంద్రానికి పంపారు. అయిన‌ప్పటికీ.. దీనివ‌ల్ల బీసీల‌కు న‌ష్టం లేద‌ని, బీసీలే త‌మ‌కు ప్రాణ‌మ‌ని రెండు రోజుల కింద‌ట కూడా చంద్రబాబు వెల్లడించ‌డం గ‌మ‌నార్హం. దీనిపై కొంద‌రు బీసీల్లో ఆలోచ‌న అయితే మొద‌లైంది. ఇక‌, ఎస్సీల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రం స‌హా ఇప్పుడున్న ఏపీలో ఎస్సీ ల ఓటు ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అయితే, వీరికి అమ‌లు చేసిన ప‌థ‌కాలు, రాజ‌కీయంగా తెచ్చిన చైత‌న్యం నేప‌థ్యంలో వీరు కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా మారారు. అయితే రాష్ట్ర విభజనతో ఆ ఓటు బ్యాంకు వైసీపీకి మళ్లింది.

మైనారిటీలకు వైఎస్……

ఇక‌, రాష్ట్రంలో మైనార్టీ వ‌ర్గాలు మాత్రం స‌మ‌యానికి త‌గిన విధంగా రాజ‌కీయ పార్టీల‌కు సాయం చేస్తూ వ‌చ్చారు. కానీ, వైఎస్ హ‌యాంలో వీరికి 4% రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డం పెద్ద సంచ‌ల‌న‌మైంది. విద్య, ఉద్యోగ అవ‌కాశాల్లో మైనార్టీల‌కు 4% రిజ‌ర్వేష‌న్ క‌ల్పించింది వైఎస్ ప్రభుత్వం. అదేస‌మ‌యంలో హ‌జ్ యాత్రల‌కు వెళ్లే వారికి కూడా ప్రత్యేక రాయితీలు ఇవ్వడం ద్వారా ఆ వ‌ర్గాన్ని త‌న వైపు తిప్పుకోవ‌డంలో వైఎస్ విజయం సాధించారు. అయితే, తాజాగా రాజ‌కీయ ప‌రిణామాల ఏపీలో మారిపోయాయి. ఇక్కడ కాపులు త‌మ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. త‌మ‌కు క‌ల్పించిన రిజ‌ర్వేష‌న్ ఇప్పటికీ స్పష్టత లేక‌పోవ‌డంపై వారు ఆగ్రహంతో ఉన్నారు.

కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినా…..

చంద్రబాబు వారి కోసం కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు చేసినా కొంద‌రిలో సానుకూల‌త‌, కొంద‌రిలో వ్యతిరేక‌త వ్యక్తమ‌వుతోంది. ఇక క‌మ్మలు ఎలాగూ టీడీపీ వైపే ఉంటారు. రెడ్డి వ‌ర్గం వైసీపీ వైపు ఉంటుంది. జ‌న‌సేన ఏర్పాటు కావ‌డంతో కొంత‌లో కొంత అయినా కాపు ఓట్లు ప‌వ‌న్ చీల్చుతాడు. అయితే ఈ ఎఫెక్ట్ టీడీపీకి ఉంటుందా ? వైసీపీకి ఉంటుందా ? అన్నది ఇప్పుడే అంచ‌నా వేయ‌డం క‌ష్టం. మ‌రోప‌క్క, ఎస్సీ సామాజిక వ‌ర్గం కూడా కాంగ్రెస్‌ను వ‌దిలేసి.. జ‌గ‌న్ వెంట న‌డిచేందుకు మొగ్గు చూపుతోంది. మ‌ళ్లీ వీరిలో మాదిగ‌లు బాబుకు అనుకూలంగా ఉండే ఛాన్సులు ఎక్కువుగా ఉంటే, మాల‌లు జ‌గ‌న్ వైపు కాస్త ఎక్కువుగా ఉండొచ్చు. జ‌న‌సేన ఏర్పాటుతో ఏపీలో రాబోయే ఎన్నిక‌ల్లో సామాజిక వ‌ర్గాల వారి ప్రభావం భారీ ఎత్తున ఉంటుంద‌ని అంటున్నారు.

తెలంగాణ‌లో లెక్కలేంటి….

ఇక అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో టీఆర్ఎస్ ఏర్పాటుతో అక్కడ వెల‌మ సామాజిక‌వ‌ర్గం ఈ పార్టీని ఓన్ చేసుకుంది. ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉండ‌డంతో ఆ వ‌ర్గం మ‌రింత బ‌లోపేతం అయ్యింది. ఇక రెడ్లు ఎలాగూ కాంగ్రెస్‌లోనే ఉండి అధికారం కోసం ఫైట్ చేస్తున్నారు. నాడు తెలుగుదేశానికి మ‌ద్దతుగా ఉన్న క‌మ్మ వ‌ర్గాన్ని కేసీఆర్ పూర్తిగా త‌న వైపున‌కు తిప్పుకునే ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇక బీసీల‌ను కూడా టీఆర్ఎస్‌కు సంస్థాగ‌త ఓటు బ్యాంకుగా మార్చేందుకు ప్లాన్లు వేస్తున్నారు. ఇటీవ‌ల రెండు రాజ్యస‌భ సీట్లు బీసీ వ‌ర్గాల‌కు ఇవ్వడం కూడా ఆ ప్లాన్‌లో భాగ‌మే. వాస్తవంగా చూస్తే ఏపీతో పోలిస్తే తెలంగాణ‌లో కులాల ప్రభావం త‌క్కువైనా ఇప్పుడు ఇక్కడ కూడా ఆ ప్రభావం ఎక్కువ అవుతోంది. ఇక ఎస్సీ సాంప్రదాయ ఓటు బ్యాంకు మొగ్గు కాంగ్రెస్ వైపే ఉంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1