చంద్రబాబుకు చిన్నమ్మతో చెక్ పెట్టేస్తారా?

ఆంధ్రప్రదేశ్ లో త్రిపుర తరహా వ్యూహాన్ని అమలు పరుస్తామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు కన్పిస్తోంది. ఏపీలో బీజేపీకి ఇప్పుడు కష్టకాలమే. ఏపీ విభజన హామీలు అమలు చేయలేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కారణంగా ఏపీ ప్రజలు కమలం పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఏపీలో బలోపేతం చేయడంపై బీజేపీ దృష్టి సారించింది. తొలుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించనుంది.

అధ్యక్షుడిగా సోము వీర్రాజు…..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరును ప్రకటించే అవకాశమే ఎక్కువగా ఉంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు చంద్రబాబును దెబ్బకొట్టేందుకు కేంద్ర నాయకత్వం వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు ఇటీవల మోడీపైన, కేంద్ర ప్రభుత్వంపైన మాటల దాడికి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన పుట్టిన రోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 12 గంటల నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షా వేదికపైన కూడా మోడీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. అంతటితో ఆగకుండా ఈ నెల 30వ తేదీన తిరుపతిలో మోడీని లక్ష్యంగా చేసుకుని భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

పురంద్రీశ్వరిని రంగంలోకి దించి…..

ఈ తరుణంలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు పురంద్రీశ్వరిని రంగంలోకి దించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించినప్పటికీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన, ఆయన వదిన పురంద్రీశ్వరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పురంద్రీశ్వరి వాగ్దాటి గల నేత. అంతేకాకుండా చంద్రబాబు కేంద్రంపై విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పగలరన్న నమ్మకంతో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

జూన్ లో కీలక ప్రకటన…..

చంద్రబాబు దూకుడుకు కళ్లెం వేయాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒకరైన చిన్నమ్మను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే ఒక సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవచ్చని, అలాగే టీడీపీ ఓటు బ్యాంకుకు గండికొట్టవచ్చన్నది కమలనాధుల వ్యూహంగా ఉంది. జూన్ నెలలోనే ఈ ప్రకటన వచ్చే అవకాశముందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జూన్ నెల నుంచి ఏపీపై పూర్తి స్థాయి దృష్టిని కేంద్ర నాయకత్వం పెట్టబోతోంది. కర్ణాటక ఎన్నికల ముగిసిన తర్వాత అమిత్ షా కూడా ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో త్రిపుర వ్యూహాన్ని అమలుపర్చాలని అమిత్ షా నిర్ణయించినట్లు కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఇది వర్క్ అవుట్ అవుతుందా? లేదా? అన్నదిచూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*