చల్లా చేరే పార్టీ ఇదేనా?

రాయలసీమ నేత చల్లా రామకృష్ణారెడ్డిని చల్లబర్చేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దూతను పంపారు. ఆయనకు మరో ముఖ్యమైన పదవి ఇస్తామని కబురు పంపారు.శాంతించాలని కోరారు. అయితే చల్లా మాత్రం చల్లబడలేదు. తనకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదన్నారు. ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల్లో చల్లా రామకృష్ణారెడ్డికి కడప ఆర్టీైసీ రీజనల్ ఛైర్మన్ పోస్టు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పదవిని తీసుకోనని చల్లా బహిరంగంగా చెప్పేశారు. అంతేకాదు అధిష్టానానికి కూడా సవాల్ విసిరారు.

అవమానపర్చారంటూ….

తనకు కడప ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పదవి ఇచ్చి అవమానపర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు సీనియర్ నేతల మాటలు వినే తనను దూరం పెడుతున్నారని చల్లా చెబుతున్నారు. చల్లాను శాంతింప చేయడానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వరుసగా ఫోన్లు వస్తున్నాయి. అయితే చల్లా ఆ ఫోన్లను లిఫ్ట్ చేయడం లేదు. దీంతో నేరుగా చంద్రబాబు దూత ఒకరు చల్లా వద్దకు వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తనను ముఖ్యమంత్రి స్వయంగా పంపారని, త్వరలోనే ముఖ్యమైన పదవి ఇస్తామని చెప్పి రమ్మన్నారని ఆయన చెప్పారు.

చల్లా వద్దకు చంద్రబాబు దూత….

అయితే చల్లా ఆయన ముందే టీడీపీ అధిష్టానాన్ని కడిగి పారేశారు. గత ఎన్నికలకు ముందు పార్టీలోకి రావాలని బతిమాలిన చంద్రబాబు నాయుడు, తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు‘‘ ఓడిపోయిన వారికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి తనకు మాత్రం కడప రీజనల్ ఛైర్మన్ పదవి ఇస్తారా? అంతకంటే ఈ పదవి ఇవ్వకపోయినా బాగుండేది. తనను ఘోరంగా అవమానించారు. దీనికి ఫలితం త్వరలోనే చూస్తారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బస్టాండుల్లో కూర్చుని వచ్చేపోయే బస్సులను లెక్కేసుకునే పదవి ఇస్తారా? అని చల్లా మండిపడ్డారు.

ఏపార్టీలోకి వెళతారో…..

త్వరలోనే చల్లా రామకృష్ణారెడ్డి పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చల్లా తమ్ముడి కుమారుడి వివాహం త్వరలోనే ఉంది. ఈ వివాహం పూర్తయిన వెంటనే కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు చల్లా. ఈ సమావేశంలోనే చల్లా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి పార్టీ మారతారన్న టాక్ బలంగా విన్పిస్తుండటంతో నచ్చజెప్పడానికి టీడీపీ నేతలు వరుసగా రంగంలోకి దిగుతున్నారు. ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. మొత్తం మీద చల్లా వ్యవహారం టీడీపీలో ఇంకా చల్లారలేదన్నది వాస్తవం. త్వరలోనే చల్లా తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*