బాబు బ‌లం తెలిసిపోయిందా..? ఇదీ క‌థ‌..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కేంద్రంపై చేస్తున్న పోరును పెంచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఒంట‌రిగా చేసిన పోరు ను మ‌రింత‌గా పెంచేందుకు ఆయ‌న రాష్ట్రాల‌ను కూడ‌దీస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న 15వ ఆర్థికసంఘం విధివిధానాలను వ్యతిరేకిస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మూడు అంశాలపై తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపనున్నారు. దీనికి సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రాల‌ను ఒదిలేసిన చంద్ర‌బాబు 11 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల‌కు సంబంధించిన సీఎంల‌కు లేఖ‌లు రాసి మ‌రీ అమ‌రావ‌తికి ర‌ప్పించేందుకు ప్రయ‌త్నించారు. ఈ నేప‌థ్యంలో కేంద్రానికి గ‌ట్టి షాకే ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావించారు.

వివిధ రాష్ట్రాలను కలుపుకుని…

ఏపీకి సాయం చేయ‌ని కేంద్రంపై క‌త్తి గ‌ట్టిన చంద్ర‌బాబు.. త‌న‌తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంల‌ను కూడా క‌లుపుకొని ముందుకు వెళ్తుండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. దీనికిగాను ఆయ‌న 15వ ఆర్థిక సంఘం నియ‌మాల‌ను వినియోగించుకోవ‌డం గ‌మ‌నార్హ‌. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం సూచించిన విధి విధానాలు, నిబంధనల పేరుతో బాబు కేంద్రాన్ని ముఖ్యంగా మోడీని ఇరుకున పెట్టాల‌ని నిర్ణ‌యించారు.

బలంచూపిద్దామనుకుంటే….

15వ ఆర్థిక సంఘం విధి విధానాల్లో 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగిస్తోంద‌ని, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా అవసరమా? అన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయ‌ని, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా శాతాన్ని పరిశీలిం చాలని 15వ ఆర్థిక సంఘాన్ని కేంద్రం కోరడాన్ని కూడా బాబు తెర‌మీదికి తెస్తున్నారు. ఒక్కో రాష్ట్రానిది ఒక్కో రకమైన అవసరం, వాటిమేరకు సొంతంగా పథకాలు నిర్వహించుకుందామంటే చేతిలో నిధులుండవు. ఏమి చేయాలన్నా కేంద్రం అండదండలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో చంద్ర‌బాబు ఆయా రాష్ట్రాల‌ను కూడ‌దీసి .. మోడీకి మూడేలా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, బాబు వ్యూహం ఆదిలోనే హ‌రించుకు పోయిందా? అన్న‌ట్టు అయింది. ఈ స‌మావేశానికి ఏపీని ఆనుకుని ఉన్న తెలంగాణ‌, త‌మిళ‌నాడు, ఒడిసా రాష్ట్రాల సీఎంలు కానీ, ఆర్థిక మంత్రులు కానీ హాజ‌రుకాలేదు.

ఎక్కువ మంది డుమ్మా కొట్టడంతో….

అంతేకాదు. బాబు ఆహ్వానించిన వారిలో స‌గం మంది వ‌ర‌కు డుమ్మా కొట్టిన‌ట్టు తాజా స‌మాచారం. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయ‌ణ స్వామి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌ ఆర్థిక శాఖ మంత్రి మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు హాజ‌ర‌య్యారు. దీనిని బ‌ట్టి.. మోడీకి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పాల‌న్న బాబు వ్యూహం బెడిసి కొడుతున్న‌ట్టే అనిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*