ఏపీని మోడీ ముంచేశారు

రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని తాను విభజన సమయంలో దీక్ష చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి కోసమే తాను ఎన్డీఏలో భాగస్వామిగా చేరామన్నారు. ఢిల్లీలో చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల కంటే ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించినా, రాష్ట్రం పురోభివృద్ధి కోసమే తాను బీజేపీతో చేతులు కలిపానన్నారు. ఎన్నికల సమయంలో తాను, ప్రధాని మోడీ, మరో భాగస్వామి పవన్ కల్యాణ్ లు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చామన్నారు. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యేందుకు సహకరిస్తామని మోడీ ఆనాడు హామీ ఇచ్చారన్నారు. కాని నాలుగేళ్ల గడిచినా విభజన హామీల్లో ఎక్కువ భాగం అమలు చేయలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము అడిగితే 14వ ఆర్థిక సంఘం అభ్యంతరం చెప్పిందని తమకు చెప్పారని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారన్నారు. హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామంటేనే తాను అంగీకరించానని చెప్పుకొచ్చారు. కాని అక్కడా మొండిచేయే చూపారన్నారు. అయితే ఆర్థిక సంఘం అలా చెప్పలేదని తనకు తర్వాత తెలిసిందన్నారు. విభజన హామీలు అమలు చేయాలంటూ తాను 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా కేంద్ర ప్రభుత్వం కనికరించలేదన్నారు. నాలుగేళ్లు సహనం వహించానని, అయితే ఏపీని కేంద్రం పట్టించుకోనందునే తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. మోడీ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టేందుకే తాను ఢిల్లీ వచ్చానన్నారు. రెండు జాతీయ పార్టీలూ తమ రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నారు. పార్లమెంటులో చేసిన చట్టాలను, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. ఏపీ విషయంలో జరిగిన మోసాన్ని దేశానికి తెలియజేయాలనే ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఏపీని కేంద్రం నిండా ముంచేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోడీ ఆంధప్రదేశ్ లోని అమరావతి, నెల్లూరులో చేసిన ప్రసంగాల వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు. మోడీ ఇచ్చిన హామీలనే తాము అడుగుతున్నాము తప్ప గొంతెమ్మ కోర్కెలను అడగటం లేదన్నారు. ఏపీ అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్నందునే తాను నాలుగు సంవత్సరాలు వేచి చూశానని చెప్పారు చంద్రబాబు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*