మోడీ గెలిచే అవకాశమే లేదు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమరానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఎన్నికలకు ముందుగానే పార్టీ కార్యాచరణను ప్రకటించారు. బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాదని చంద్రబాబు జోస్యంచెప్పారు. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి వరకూ బీజేపీకి తిరుగులేదని అందరూ అనుకున్నారని, కాని ఇప్పుడు పరిస్థితిని చూస్తే బీజేపీ అధికారంలోకి రావడం కష్టమేనని చంద్రబాబు తేల్చేశారు.

వారి గర్వమే వారికి శాపం…..

బీజేపీ అధినాయకత్వం అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు ఆ పార్టీని ఈ స్థితికి తెచ్చాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పదవి వల్ల వినయం పెరగాలే కాని, బీజేపీ నేతల్లో అహం పెరిగిందని ఆయన గుర్తు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందుకు టీడీపీ నేతలందరూ సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. కేవలం ప్రత్యేక హోదా మాత్రమే కాకుండా నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చంద్రబాబు కోరారు. కథువా, ఉన్నావ్ సంఘటనలతో బీజేపీ దేశవ్యాప్తంగా తన ప్రభను కోల్పోయిందన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడం కష్టమేనని తెలిపారు.

బంద్ ల వల్ల నష్టమే…..

బంద్ లు, రాస్తారోకోలు వల్ల రాష్ట్రమే దెబ్బతింటుందున్నారు చంద్రబాబు. నిన్న ఒక్కరోజు బంద్ కారణంగా ఆర్టీసకి 12 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. షాపులు ఒక రోజు మూసివేయడం వల్ల వేలాది మందికి నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్రంతో పాటు ప్రజలు నష్టపోకుండా ఆందోళన కార్యక్రమాలు ఉండాలని చంద్రబాబు పార్టీనేతలకు ఉద్భోధించారు. ఈ ఏడాది మొత్తం టీడీపీ నేతలందరూ ప్రజల చెంతనే ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఆందోళనలతో పాటు సంక్షేమం కూడా…..

ఇక ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం తెలుగుదేశం పార్టీ కూడా పోరాటపంథాను అనుసరిస్తుందని చెప్పారు. ఈ నెల 20వ తేదీన తాను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒకరోజు నిరాహారదీక్షకు దిగుతానని, దీనికి సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ ఛార్జులు సామూహిక దీక్షలకు దిగాలన్నారు. అలాగే మంత్రులు కూడా వారి వారి జిల్లాల్లో దీక్ష చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల20వ తేదీన జరగాల్సిన దళిత తేజం ముగింపు సభను మే మొదటి వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీ నుంచి అన్ని నియోజకవరగ్ాల్లో సైకిల్ యాత్ర నిర్వహించాలని ఇరవై రోజుల పాటు సైకిల్ యాత్రలను నిర్వహించి నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలన్నారు. 30న తిరుపతిలో జరిగే బహిరంగ సభను ఆ జిల్లాకే పరిమితం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అలాగే అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సిన భృతిపై విధివిధానాలను నిర్ణయించాలని కేబినెట్ సబ్ కమిటీని బాబు ఆదేశించారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటిన్లు ప్రారంభించాలన్నారు. ఇలా ఒకవైపు కేంద్రంపై పోరాటం చేస్తూనే, సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేయాలని చంద్రబాబు ఈ సమావేశంలో నిర్ణయించడం విశేషం. మేలో 175 నియోజకవర్గాల్లో మినీ మహానాడులు నిర్వహించాలని సమావేశం అభిప్రాయపడింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*